Invention of the Wheel: జహీరాబాద్ సమీపంలో మహీంద్రా ట్రాక్టర్ తయారీ యూనిట్ ను సందర్శించి, న్యాల్కల్ మండలం రేజింతల్ లో పాలీహౌజ్ సాగును పరిశీలించి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో లాభసాటి పంటలసాగుపై రైతులకు అవగాహనా సదస్సులో రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి సదస్సును ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు గారు హాజరయ్యారు.
చక్రం పుట్టుకే పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది అని వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. దీని నుండే యంత్రాలకు సంబంధించిన ఆవిష్కరణకు పునాది పడింది. అక్కడి నుండి మొదలయిన నాగరికత ఎక్కడిదాకా వెళ్తుందో చెప్పలేం అని అన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్పుకు గురవుతుందని వ్యాఖ్యానించారు. కాలక్రమంలో ఎద్దుల బండ్లు, సైకిళ్లు, కార్లు, జీపులు, బస్సులు వచ్చాయి. వీటివలనే మానవాభివృద్దిలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి అని అన్నారు.
Also Read: PJTSAU-21-2022: ఈ నెల 23న “ఫ్లేమ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్” కార్యక్రమం.!
వ్యవసాయంలో కూడా పాత పద్దతులు అంతరించి ఆధునిక పద్దతులు వస్తున్నాయి. తెలంగాణలో 92.5 శాతం భూమి ఐదెకరాల లోపు రైతుల చేతులలో ఉన్నది. 20 ఎకరాలకు మించిన ఉన్న రైతుల సంఖ్య వేలల్లో మాత్రమే ఉన్నది. రాష్ట్రంలో అడవిపందులు, కోతులతో పంటలు నష్టమవుతున్నది వాస్తవమే. కేరళలో అడవి పందులను చంపేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో అనుభవం ఉన్న షూటర్లకు అడవి పందులను కాల్చి చంపే అనుమతులు ఇవ్వడం జరిగిందని అన్నారు.
కోతుల బెడదను నివారించేందుకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు ఒక్కటే మార్గం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం, ఇతర చర్యల మూలంగా భవిష్యత్ లో కోతులు అడవులు దాటి బయటకు రాకుండా ఉంటాయన్నారు.
తెలంగాణ నేలలు ఆలుగడ్డ సాగుకు అనుకూలం. ప్రజల అవసరాల మేరకు ఆలుగడ్డ సాగు చేయడం లేదు .. దాదాపు 5 వేల ఎకరాలలో మాత్రమే ఆలుగడ్డ సాగు చేస్తున్నారు.. దీనికి వంద రెట్లు సాగు పెరగాల్సిన అవసరం ఉన్నది. రైతులకు ఆలుగడ్డ విత్తనం అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాము అని వెల్లడించారు. కోహెడలో మార్కెట్ లో భారీ శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసి అక్కడ ఆలుగడ్డ విత్తనాల స్టోరేజి చేసి తెలంగాణలో ఆలుగడ్డ సాగు పెంచాలని నిర్ణయించాం అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఏ పథకం కూడా నిలిపివేసే పరిస్థితి లేదు.. కరోనా వైరస్ మూలంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలోనే రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం దృష్టిలో ఉన్న కొన్ని కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయి. అయిదారు నెలలలో ఈ పరిస్థితులలో మార్పు వస్తుందని అన్నారు.
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగాల్సిన అవసరం ఉన్నది .. తెలంగాణలో రైతులకు చిన్న కమతాలు ఉన్నాయి కాబట్టి వారు స్వంతంగా యంత్రాలను కొనుగోలు చేస్తే పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగిపోతాయి. అందుకే క్లస్టర్ల వారీగా అవసరం అయ్యే వివిధ యంత్రాల వినిమయం గుర్తించి ఆయా యంత్రాలను ఉపయోగించే వారికి శిక్షణ ఇచ్చి వారి సేవలను రైతులు పొందేవిధంగా చేయాలని భావిస్తున్నాం అని తెలిపారు. మల్బరీ సాగును పెద్ద ఎత్తున పెంచాలి .. పట్టుపురుగుల పెంపకం ద్వారా నెలనెలా ఆదాయం వస్తుందని అన్నారు.
మండలానికి లేదా, పలు గ్రామాలకు కలిపి ఒక కేంద్రం ఏర్పాటు చేసి ట్రాక్టర్లు, సాగులో అవసరమయిన పరికరాలు, స్ప్రింక్లర్లు, విత్తనాలు నాటే యంత్రాలు, మందులు పిచికారి చేసే యంత్రాలు, వాటిని ఉపయోగించే వారు అందుబాటులో ఉంచేలా ఊబర్, ఓలా తరహా సేవలు అందుబాటులోకి తేవాలనే యోచన ఉన్నదని అన్నారు. ఈ తరహా సేవలకు ముందుకు వచ్చే వారికి, దళితబంధు పథకం కింద ఈ సేవలు చేస్తామనే వారికి ప్రభుత్వం తరపున అన్నిరకాల సహకారం అందిస్తాం అని సభాముఖంగా వెల్లడించారు.
Also Read: Prime Minister’s Awards for Excellence 2022: గడ్చిరోలి అగరబత్తి ప్రాజెక్ట్ కి ప్రధానమంత్రి బహుమతి