TS Agri Minister: బోయిన్ పల్లి మార్కెట్ లో నిర్వహించిన కార్యక్రమంలో మార్కెటింగ్ ఉద్యోగులకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అవార్డులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్లు లక్ష్మణుడు, రవికుమార్ లు పాల్గొన్నారు.
ఉద్యోగులలో స్ఫూర్థి నింపేందుకే అవార్డులు ప్రతిభను గుర్తించి, గౌరవించి, ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం అని నిరంజన్ రెడ్డి గారు అన్నారు. ఒక మెట్టు ముందున్న వాళ్లను అభినందిస్తున్నాను. మిగతావారు ఆ మెట్టును అందుకునేందుకు కృషిచేయాలి అని చెప్పారు.
Also Read: Garlic Harvesting: వెల్లుల్లి కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
వ్యవసాయం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర రైతాంగం బాగుండాలి, వారు పండించిన పంటలు కొనే మార్కెటింగ్ శాఖ అద్భుతంగా ఉండాలి అని సభాముఖంగా తెలియచేసారు. వ్యవసాయం విస్తరణ జరిగి, పంటల సాగు పెరిగి, గణనీయంగా ఉత్పత్తులు మార్కెట్ కు తరలివస్తే ఆ దృశ్యం చూస్తేనే కడుపు నిండుతుందని ఆయన భావోద్వేగాన్ని బయటపెట్టారు.
పంటలు పండించడానికి వ్యవసాయశాఖ ఎంత కసరత్తు చేస్తుందో, రైతాంగానికి ఎంత చేయూతను, వ్యవసాయ విజ్ఞానాన్ని అందిస్తుందో .. వచ్చిన పంటను కూడా మార్కెటింగ్ చేసే గణనీయమైన పాత్ర మార్కెటింగ్ శాఖ పోషిస్తున్నదని అన్నారు. మార్కెటింగ్ శాఖ తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేస్తుండడం అభినందనీయం. కరోనా సమయంలో మార్కెటింగ్ శాఖ ఇళ్ల వద్దకే కూరగాయలు, పండ్లు రవాణా చేసి సామాన్యులకు నిత్యావసరాలు అందుబాటులో ఉంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయం తెలుసుకుని అభినందించారు.
కోహెడలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయి అతిపెద్ద అధునాతన మార్కెట్ నిర్మాణం జరగబోతుందని చెప్పారు. మన వద్ద ప్రమాణాలు బాగుంటే రైతులు ఉత్పత్తులను ఎక్కడి నుండయినా తెచ్చి ఇక్కడనే అమ్ముకుంటారు. అందుబాటులో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ సమీపాన ఉన్నందున కోహెడ మార్కెట్ కు మంచి భవిష్యత్ ఉన్నదన్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను సమర్దవంతంగా నిర్వహించడంపై దృష్టిసారించాలి. మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం. ఉద్యోగుల నియామకాల కోసం నా వంతు సహకారం అందిస్తానన్నారు.
ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖలో తొలిసారి ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు అవార్డులు ఇచ్చారు. 10 విభాగాల నుండి 43 మందిని అవార్డులకు ఎంపిక చేసారు. మూడు అవార్డులు గెలుచుకున్న సూపరింటెండెంట్ ఫర్హానాను నిరంజన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు.
Also Read: Seed Treatment in Groundnut: వేరుశనగలో విత్తనశుద్ధితో తెగుళ్ళకు చెక్