Mango మన రాష్ట్రంలో మామిడి షుమారుగా 7,64,495 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయబడుతూ 24,45,824 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి చేయబడుతుంది. మామిడిని ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చిత్తూరు, కడప, అదిలాబాదు మరియు నల్లగొండ జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తారు. దేశపు ఉత్పత్తిలో షుమారు 24 శాతం వాటా మన రాష్ట్రానిదే.
మామిడి రకాలు: దాదాపు భారతదేశంలో 1000 మామిడి రకాలు ఉన్నాయి. అయితే వీటిలో దాదాపు 20 రకాలను మాత్రమే వాణిజ్య స్థాయిలో పండిస్తున్నారు. భారతదేశంలోని మామిడి యొక్క వాణిజ్య రకాలు దేశంలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైనవి.
అంతరకృషి:
మామిడి తోటల యాజమాన్యంలో అంతరకృషి చాలా ముఖ్యమైనది. తోటలో ఎప్పుడూ కలుపు లేకుండా జాగ్రత్తపడాలి. ఏడాదిలో కనీసం రెండుసార్లు పొలాన్ని దున్నుకోవాలి. తొలకరి వర్షాలు పడగానే, మొదటిసారి నేలలో పదును చూసుకొని వరుసల మధ్య దున్నాలి. ఇందువలన కలుపు నివారణ, నేలలోని పురుగుల గుడ్లు, నిద్రావస్థలో ఉన్న పురుగులు, హాని చేసే శిలీంధ్రాలు నశిస్తాయి. భూమి గుల్ల బారటం వలన ఎక్కువగా నీరు ఇంకుతుంది. నేల యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. వర్షాకాలం చివరిలో (సెప్టెంబరు) రెండోసారి పొలాన్ని దున్నుకోవాలి.
పచ్చిరొట్ట ఎరువులు (పిల్లిపెసర, మరియు జనుము ఎకరానికి 15 నుండి 20 కిలోలు చొప్పున) జూలై మాసంలో వి విత్తాలి. వీటిని నాటిన 45 రోజులకు కత్తిరింపులు పూతకు రాక ముందే నేలలో కలియదున్నాలి. అంతరకృషి వలన తోటలో గడ్డి/గరిక పెరగదు. దీని వలన నీటిని నిల్వ చేసుకొనే గుణం పెరగడం ద్వారా అతి వేడి సమయంలో అంటే ఎండాకాలంలో కూడ చనిపోకుండా చెట్లు ఉంటాయి. రసాయన పద్ధతిలో కలుపు నివారణకు, భూమిలో తేమ ఉన్నప్పుడు లీటరు నీటికి 10 మి.లీ, గ్లైఫోసేట్ +10గ్రా, అమ్మోనియం సల్ఫేట్ లేదా యూరియా కలిపి నాజిల్కు డోమ్ లేదా గరాటు వంటిది పెట్టి మామిడి మొక్కల మీద పడకుండా పిచికారి చేయాలి. తొలకరి వర్షాలు పడిన వెంటనే లీటరు నీటికి కాయలను, ఎ. కు 1 మి.లీ ఆక్సిఫ్లోరోఫెన్ 23.5% ద్రావకం పిచికారి చేస్తే కలుపు మొలవకుండా నివారించవచ్చును.