Bio Fertiliser to Improve Soil Fertility: ప్రకృతిలో ఉన్న కొన్ని సుక్ష్మజీవులు తమ జీవన చర్యల ద్వారా స్వతంత్రంగా కానీ మొక్కలతో కలిసి కానీ పంట మొక్కలను కావాల్సిన పోషకాలను వాతావరణం నుంచి కానీ నేల నుంచి కానీ గ్రహించి మొక్కకు అందిస్తాయి. ఇలా మొక్కల్లోను పోషక పదార్థాలను విడుదల చేసి పంట మొక్కలకు అందుబాటులోకి తెచ్చే జీవులను జీవన ఎరువులని అంటారు.
వ్యవసాయంలో అధిక మొత్తంలో ఈ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం వల్ల భూమిలోపల, ఉపరితలం పైనున్న పర్యావరణం కాలుష్యం అగుటయే గాక రైతుకు పెట్టుబడి విషయంలో అధికమైన భారం కూడా పడుచున్నది. ఈ నేపధ్యంలో మన వ్యవసాయ రంగములో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి ఎంతో ముఖ్యమైనదిగా జీవన ఎరువులు భుసార అభివృద్ధిలో కీలకమైన ప్రకృతి సమతుల్యం, వాతావరణ కాలుష్య నివారణ ప్రాతిపదికగా ఉన్న నూతన వ్యవసాయ విధానంలో జీవన ఎరువుల వాడకం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జీవన ఎరువులు అనగా భూమిలో నానాటికి తగ్గుముఖం పడుతున్న సుక్ష్మజీవులతో మొక్కలకు పోషక పదార్థాలను మరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోనులను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం.
జీవన ఎరువుల్లో రకాలు: ఇవి రెండు
1. నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు.
2. భాస్వరం ఎరువును వినియోగంలోకి తెచ్చి మొక్కకు అందించే సూక్ష్మజీవులు.
నత్రజనిని స్థిరీకరించే విధానాన్ని బట్టి నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులను రెండు రకాలుగా వర్గీకరించారు.
1. స్వతంత్రంగా నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు.
2. మొక్కతో కలిసి నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు
స్వతంత్రంగా నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు:
1. నీలి ఆకుమచ్చ నాచు 2. అజటో బ్యాక్టర్ 3. అజోస్పెరిల్లమ్
Also Read: Biofertilizers: జీవన ఎరువులు
1. నీలి ఆకుమచ్చ నాచు:
ఇది వరి మాగాణులకు అనువైన ఎరువు ఇది నీటిలో అభివృద్ధి చెందుతుంది. ఈ ఎరువు మట్టితో కలిపి ఎండిన మట్టి గడ్డల (పెళ్లల) రూపంలో లభ్యమవుతుంది. వరి నాటిన 7 నుంచి 10 రోజులలోపు నీలి ఆకుపచ్చ నాచు ఎరువు ఎకరాకు 4 నుంచీ 6 కిలోలు పోలంలో నీటిలో చల్లాలి. ఎరువు మోతాదు ఎక్కువైనా పర్వాలేదు. నాచు వేసిన తరువాత పొలంలో నిరుంచాలి. ఐ నాచును మూడు సిజన్ల పాటు క్రమం తప్పకుండా వేస్తె ఆ తరువాత పంటలకు కూడా ఉపయోగ పడుతుంది. వారికీ పండిరచే యాజమాన్య పద్ధతుల వల్ల గాని, క్రిమి సంహారక మందుల వాడకం వల్లగానీ నాచు పెరుగుదలకు హాని ఉండదు.
2. అజటో బ్యాక్టర్:
అజటో బ్యాక్టర్ ప్రత్తి, వరి, పొగాకు, చెరకు, జొన్న, మేరప, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, ఆవాలు, కూరగాయలు, పండ్లు, పూలతోటలకు ఉపయోగపడుతుంది. ఎకరాకు 400 గ్రా. నుంచీ ఒకకిలో అజటో బ్యాక్టర్ ఎరువును విత్తనంతో బాటు వాడాలి. నాటే ముందు నాచు వేళ్ళను కల్బరు కలిపిన ద్రావణంలో ముంచి నాటాలి. దీనివలన నత్రజని ఎరువు వినియోగ 15 శాతం తగ్గుతుంది. పంట దిగుబడి 15 శాతం పెరుగుతుంది.
3. అజోస్పెరిల్లమ్:
ఈ ఎరువు చెమ్మగా ఉన్న పొడి రూపంలో లభిస్తుంది. ఇది ముఖ్యంగా చెరకు, వరి, రాగి, మొక్కజొన్న, పశుగ్రాసపు పంటలకు ఉపయోగపడుతుంది. ఎకరాకు 200 గ్రాముల ఎరువును 10 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల గడ్డి కలిపి పైరు వేసేముందు కలియదున్నాలి. నాటే మొక్కలకు ఎరువు ద్రావణం తయారు చేసి నారు వేళ్ళు ముంచి నాటాలి. అజోస్పెరిల్లమ్ వినియోగం ద్వారా 15 నుంచి 30 శాతం వరకు నత్రజనినిచ్చే రసాయన ఎరువులపై ఖర్చు ఆదా అవుతుంది.
మొక్కతో కలిసి నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు:
పప్పుదినుసు పంటలు, వేరుశనగ లాంటి పైర్ల మొక్కలను భూమి నుంచి లాగి చూస్తే వాటి వేర్లు మీద బుడిపెలు కనిపిస్తాయి. ఈ బుడిపెలలో రైజోబియం అనే బ్యాక్టీరియా సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి మొక్క అందించే ఆహారం తీసుకొంటూ అందుకు ప్రతిఫలంగా వాతావరణంలో లభించే నత్రజనిని మొక్కలకు ఉపయోగపడేలా తయారు చేసి మొక్కలకు అందజేస్తాయి. రైజోబియం జీవన ఎరువుల సేద్యం కుటుంబానికి చెందినదే.
పెసర, కంది, మినుము, శనగ లాంటి పప్పు ధాన్యాలకు, వేరుశనగ, సోయాచిక్కుడు లాంటి నూనెగింజల పంటలకు బఠాణి, చిక్కుడు లాంటి కూరగాయల పంటలకు పిల్లిపెసర, ఉలవలు, బర్సీం వంటి పశుగ్రాస పంటలకు లాభసాటిగా వాడవచ్చు. ఈ రైజోబియం బ్యాక్టీరియా ఒక పైరుకు తయారు చేసిన కల్చరు మరో పైరుకు పనికి రాదు.200 గ్రా. కల్చరు ప్యాకెట్ వరకు కావలసిన విత్తనాలకు పట్టించడానికి సరిపోతుంది.
బెల్లం పాకం తయారు చేసి చల్లార్చి అందులో 200 గ్రాముల రైజోబియం కల్బరు వేసి విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి 24 గంటలలోగా విత్తుకోవాలి. విత్తనం వేసేటప్పుడు ఆఖరి దుక్కిలో ఎకరాకు 50 కిలోల డైఅమ్మోనియం ఫాస్పేట్ ఎరువు వేయడం వల్ల రైజోబియం సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడుతుంది. రైజోబియం కల్చరు వాడడం వల్ల 25 శాతం నత్రజనిని ఇచ్చే రసాయన ఎరువులు వాడకం తగ్గించవచ్చు.
అజోల్లా:
రైజోబియంకు పప్పుదినుసులకు ఉన్న సంబంధమే అజోల్లా, బ్లూ గ్రీన్ అల్గేకు కుడా ఉంది. అజోల్లా పెరుగుదల నీలి ఆకుపచ్చ నాచు నత్రజని స్థిరీకరణ శక్తి మీద ఆధారపడి ఉంటుంది అయితే నీలి ఆకుపచ్చ నాచులో ఉన్న చాలా రకాల్లో ఒక రకమే అజొల్లాలో బతుకుతుంది. ఇక గాలిలోని నత్రజనిని, బొగ్గు పులుసు వాయువును పోషక పదర్థాలుగా మార్చగల ఏకైక జీవులు అజోల్లా జీవన ఎరువు మాగాణి వరిలో వాడడం వల్ల వరి పంట దిగుబడులు 20 శాతం వరకు పెంచవచ్చు.
మైకోరైజియా తనకు కావలసిన ఆహార పదార్థాన్ని స్వయంగా తయారు చేసుకోలేక మొక్కలతో మైత్రి ఏర్పరచుకుంటుంది. మొక్కలు తయారు చేసుకున్న పదార్థాలను మైకోరైజియా గ్రహించి తిరిగి మొక్కకు నేలలో ఉన్న భాస్వరాన్ని స్వీకరించి అందిస్తుంది. మైకోరైజియా ఆశించిన వేర్లను మైకోరైజియా వేర్లు అంటారు. మైకోరైజియా అన్ని పంట మొక్కల వేర్లలో ఉంటుంది. భాస్వరం వినియోగానికి ప్రాముఖ్యం ఉన్నప్పటికీ చాలా పరిమితంగా ఉంది. రైతులు ఈ జీవన ఎరువులతో లాభాల గురించి అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరం.
పొటాషియం మొబిలైజర్స్:
ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పోటాషియంను అందుబాటులోకి తెస్తుంది. ఇవి ఇటీవలికాలంలోనే పరిగణలోనికి తీసుకొనబడినది. వీటిలో ముఖ్యంగా ‘‘ప్రటూరియా ఆక్శానియా’’ అనే బ్యాక్టీరియా పొటాషియం మొబిలైజర్స్గా ఇవ్వబడుచున్నది. దీనితో పాటు కొన్ని ‘‘బాసిల్లస్’’ జాతులు కలిపి మిశ్రమంగా తయారు చేయుచున్నారు.
జింక్ సాల్సుబలైజర్:
ఈ జీవన ఎరువు కొన్ని బాసిల్లస్ స్పీసీస్ ఉపయోగించి మధ్యకాలంలో చాలా ప్రైవేటు సంస్థలు తయారు చేయుచున్నవి. దీని ప్రభావం వరి, మొక్కజొన్న వంటి పంటలపై కొంత మేరకు చూడవచ్చును.
మొక్క పెరుగుదలను అభివృద్ధి పరచే జీవన ఎరువు (పి.జి.పి.ఆర్.):
ఈ జీవన ఎరువుఒక మిశ్రమ సముదాయంతో కూడుకున్నది. ముఖ్యంగా బాసిల్లస్ జాతి బ్యాక్టీరియాలను మరియు సూడోమోనాస్ జాతి బ్యాక్టీరియాలను ఒక మిశ్రమంగా తయారుచేసి పి.జి.పి.ఆర్. జీవన ఎరువుగా అందించుచున్నారు. మొక్కకు పోషకాలు అందించుటతో పాటు ఈ జీవన ఎరువులు రోగ నిరోధక శక్తిని పెంపొందించును. మొక్కల పెరుగుదలకు ఉపయోగపడితే హార్మోన్లను, విటమిన్‌లను. భూమిలోని మొక్కలకు, తెగుళ్ళు కలుగజేసే శీలీంధ్రాలను పెరగకుండా అరికట్టును. వాటిలో కొన్నింటిని జీవ నియంత్రణ కారులుగా నిర్దేశించడమైనది.
ద్రవ్య రూపములో నున్న ఈ జీవన ఎరువుల వలన లాభములు:
1. ఎక్కువ కాలము అనగా సంవత్సరము (365 రోజులు) నిల్వ ఉండును.
2. గడువు తేది వరకు అధిక సంఖ్యలో బ్యాక్టీరియా ఉండును.
3. ఇతర బ్యాక్టీరియా కలుషితము ఉండదు.
4. తేలికగా ఎక్కువ భూమి విస్తీర్ణమునకు తక్కువ సమయంలో ఉపయోగించవచ్చును.
5. తేలికగా పంట యొక్క వ్రేళ్ళ చుట్టూ ఉన్న వాతావరణంతో సమన్వయ సంభంధము ఏర్పరచుకొని అధిక సంఖ్యలో పెరుగును.
6. ఈ బ్యాక్టీరియా యొక్క అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ ఒడిదుడుకులు తట్టుకొని పెరుగును.
7. ఈ టెక్నాలజీ ద్వారా తేలికగా ఎక్కువ పొలమునకు తక్కువ సమయంలో జీవన ఎరువులను నేరుగా మొక్క వ్రేళ్ళ దగ్గర చేరునట్లు వేయవచ్చును.
జీవన ఎరువుల వల్ల ఉపయోగాలు:
1. జీవన ఎరువులు వాతావరణంలోని నత్రజనిని స్తిరికరిస్తాయి. నేలలోని భాస్వరాన్ని అందుబాటులోకి తెస్తాయి.
2. హార్మోన్లు, విటమిన్లు, ఎంజైములు లభ్యమవుతాయి. ఫలితంగా మొక్క పెరుగుదల చురుకుగా ఉంటుంది.
3. నేలల నుండి సంక్రమించే తెగుళ్ళను నియంత్రిస్తాయి.
4. ఉపయోగకరమైన సూక్ష్మజీవులు గణనీయంగా పెరుగుతాయి.
5. నేల భౌతిక లక్షణాలు మెరుగు పాడడం వల్ల వేర్లకు గాలి, నీరు బాగా లభ్యమవుతాయి.
6. రైతులకు ఎరువు ఖర్చు తగ్గుతుంది. ఎరువుల దిగుమతికయ్యే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.
7. పరిసరాల అనుకూలత, వాతావరణ మిత్రత్వం కలిసి ఉంటాయి.
8. కాలుష్యం ఉండదు, నేలకు పంటకు ఎట్టి హాని కలుగదు.
9. నత్రజని, భాస్వరం, జీవన ఎరువులు రెండూ కలిసి వాడితే అధిక ప్రయోజనం ఉంటుంది.
జీవన ఎరువుల వాడకంలో మెళకువలు:
1. జీవన ఎరువు ప్యాకెట్ ఎండ వేడి తగలని చల్లని నీడ ప్రదేశంలో నిల్వ చేయాలి.
2. రైతు వాడే జీవన ఎరువు ప్యాకెట్ ఆ పంటకు సరైనదై ఉండవలెను.
3. ఉపయేగించే జీవన ఎరువు ప్యాకెట్ పై ఉన్న గడువు తేది లోపల మాత్రమే ఉపయోగించవలెను.
4. రసాయనములతో విత్తన శుద్ధి చేసుకొనేటప్పుడు విధిగా 24-48 గంటల వ్యవధి ఉండాలి.
5. రసాయన ఎరువులతో కలిపి జీవన ఎరువులు వాడరాదు.
6. సమర్థవంతంగా పని చేయుటకు నాణ్యతగల కల్చర్‌ను వాడుకోవాలి.
7. పైరుకు నిర్దేశించిబడిన జీవన ఎరువును ఇవ్వాలి.
8. సేంద్రియ ఎరువుతో జీవన ఎరువు కలిపిన వెంటనే పంటకు అందించాలి.
శ్రీ.కె.రామసుబ్బయ్య, డా. టి. మహేష్ బాబు
ఏరువాక కేంద్రం, అనంతపురం, ఫోన్ : 90008 61690
Also Read: Biochar: సేంద్రీయ వ్యవసాయంలో బయోచార్ పాత్ర