Cattle Management in Summer:ఈ సారి వేసవి పగటి ఉష్ణోగ్రతలు సరాసరి 400 నుండి 430 సెం. మించి నమోదు అవుతున్నాయి. వేసవికాలంలో ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు వీచడం వలన ఉష్ణతాపానికి గురై జీవాలు తీవ్ర అనారోగ్యానికి, అసౌకర్యానికిలోను కావడమే కాకుండా వడదెబ్బకు గురవుతూ ఉంటాయి. గొర్రెల కంటే మేకలు ఉష్ణతాపానికి ఎక్కువగా గురవుతాయి. మేకలు నలుపు వర్ణంలో ఉండటం వలన నలుపు వేడిమిని ఎక్కువగా తీసుకోవడం వలన ఈ ప్రభావము ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గొర్రెల కాపలదారులు వేసవికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, జీవాలు అనారోగ్యానికి గురికాకుండా వడదెబ్బబారిన పడకుండా సంరక్షించుకోవచ్చు.
జీవాలలో ఉష్ణోగ్రత ప్రభావం వలన వచ్చు లక్షణాలు:
జీవాల శరీర ఉష్ణోగ్రత సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత కన్నా మించి వాతావరణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు వేడి తాపానికి గురవుతాయి. దీని వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. నోటినుండి చొంగకారుతుంది. జీర్ణక్రియకు నెమరువేయడానికి కావలిసిన ఎంగిలి లభించదు. ముట్టే ఎండిపోవడం, చర్మం సున్నితత్వం కోల్పోయి మందంగా అవడం గమనించవచ్చు. దాహం అధికంగా ఉండటంతో ఎక్కువనీరు తాగుతాయి. తాగిన నీరు చెమట రూపంలో బయటకు వచ్చి లవణాలు నష్టపోయి జీవక్రియలు మందగిస్తాయి. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల మూత్రం తక్కువగా పోస్తుంది. శ్వాస,గుండె, నాడీ వేగం
పెరుగుతుంది.
అంతేగాక మేత సరిగా తినక పోవడం వలన శరీరంలో గ్లూకోజ్ నిలువలు తగ్గిపోతాయి. జీవాలు క్రమంగా నిరసించి, బలహీనంగా మారతాయి. జీవాలు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. జీర్ణక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, ఆహరం తక్కువగా తీసుకోవడం వలన చనిపోవడం జరుగుతుంది.
వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన ఇతర వ్యాధులు, పరాన్నజీవులు ఆశించే అవకాశం పెరుగుతుంది. పునరుత్పత్తి సామర్థ్యం మందగించును. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న జీవాలు మురికి గుంటలలో ఉన్న నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు సంభవిస్తాయి.
అధిక వేడివల్ల హార్మోన్ల ఉత్పతి సమతుల్యత లోపించడం వల్ల పునరుత్పత్తి కుంటుపడుతుంది.చూడి జీవాలలో గర్భస్రావాలు సంభవించే అవకాశాలున్నాయు. పునరుత్పత్తి సక్రమంగా ఉండదు.
ఆరు బయట మేపే జీవాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు:
- జీవాలను మేపు కొరకు ఎండవేళల్లో కాకుండా ఉదయంపూట 6 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు మేత కొరకు బయటకు పంపడం మంచిది. కాబట్టి మధ్యాహ్నం వేళ జీవాలను బయట తిప్పకుండా చెట్ల క్రిందకు తీసుక పోవాలి. లేదా నీరు పారుదల ప్రాంతాల దగ్గరగా ఉన్నట్లయితే చల్లగా ఉండును మరియు దాహం వేసిన వెంటనే నీరు త్రాగడానికి సిద్ధంగా ఉంటాయి.ఈ విధంగా చేస్తే జీవాలు వడదెబ్బకు గురికాకుండా కాపాడవచ్చు.
- ఎక్కువ దూరాలను నడపకుండా మేత దొరికే ప్రదేశాలను ఎంచుకోవాలి. ఎక్కువ దూరం నడిపిస్తే నీరసించే అవకాశం ఉంది.
- ఎండవేడివల్ల జీవాలు ఎక్కువగా మేత తినలేదు. వేసవితాపంతో జీర్ణక్రియ, సన్నగిల్లుతుంది. అందువల్ల మందలో అటువంటి జీవాలను గుర్తించి సులువుగా జిర్ణించుకునే పిండి పదార్థాలయిన గంజి, జావా లాంటి పదార్థాలు మధ్య మధ్యలో ఇవ్వడం మంచిది.
- జీవాలను దగ్గరలో ఉన్న చెట్ల నీడ క్రింద ఉంచి పచ్చిమేత, దాణా, నీటిని అందించాలి. పశుగ్రాసాలను సాగు చేసుకున్నట్లయితే ఎండాకాలంలో కూడా జీవాలకు పచ్చిమేతను మేపవచ్చు. జీవాలకు పచ్చిమేతతో పాటు సమీకృత దాణాను మేపాలి. మాగుడుగడ్డి (సైలేజ్) లభ్యమయితే మేతగా ఇవ్వాలి.
- ఎండాకాలంలో ముఖ్యముగా ఆరు బయట మేత తో పాటు సైలేజి/పాతర గడ్డి లేదా పచ్చగడ్డిలో అధికముగా పోషక విలువలు ఉండే గడ్డిజాతులను అందించాలి.
- మేత దొరకనప్పుడు వేరే ప్రదేశాలకు వెళ్ళాలంటే వాహనము ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ దూరం ఉండే ప్రదేశాలకు తీసుక పోవలసి వస్తే ప్రయాణ మధ్యలో రెండు గంటల కొకసారి నీటిని ఏర్పాటు చేయాలి. అంతేగాక పై కప్పుగా తడికలను లేదా గాలి బాగా వచ్చే గుడ్డలను వాడాలి.
- జీవాలకు దాణా నీటితో కలిపి రాత్రి మరియు తెల్లవారక ముందే ఇవ్వాలి. అందుబాటులో ఉండే సమీకృత దాణా ఇవ్వడంవలన తక్కువ మోతాదులో అన్ని పోషకాలను సమకూర్చవచ్చు. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది.
- సాధారణంగా ఎండాకాలంలో జీవాలు ఎక్కువ నీళ్ళు తాగి తక్కువ మేతను తీసుకుంటాయి. కాబట్టి ఇచ్చే పోషక విలువలు మేతను ఎంచుకోవాలి.
- జీవాలకు అందించే మేత లేదా దాణా లో పొటాషియం మరియు సోడియమ్ మోతాదును పెంచాలి. ఎందుకంటె చెమట మరియు ముత్ర విసర్జన ద్వారా ఈ మూలకాలు బయటకు వెళతాయి. దీని కోసమని ఉప్పును కలపడము వలన ఉపయోగము ఉంటుంది.
- ఇది అత్యంతముఖ్యమయిన పని.జీవాలు మేత తిని వచ్చే దారిలో , వాకిట దగ్గర , చెట్ల క్రింద తొట్టెలను ఏర్పాటు చేసి పరిశుభ్రమయిన నీటిని అందించాలి.
- జీవాలకు సుబాబుల్ అవిశె మొదలగు పశుగ్రాసపు చెట్లను పెంచి వాటి ఆకులను మేతగా ఇవ్వాలి.
- మేకలు చర్మం నలుపు రంగులో ఉండడం వలన ఎక్కువ వేడిని పీల్చుకుంటాయి. దాని వలన శరీరము త్వరగా వేడెక్కుతుంది.వేడి ఎక్కువయినపుడు అవి చెట్ల క్రిందకు వెళ్లి పడుకోవడము నకు సహకరించాలి.
Also Read: దేశీ ఆవు, జెర్సీ అవుకు తేడా ఏంటి?
పాకలలో మేపే జీవాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు:
- జీవాలను ఎండ తీవ్రత నుండి రక్షించడానికి అనుకూలంగా ఉండే గృహవసతిని కల్పించాలి.
- పాకలలో గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించడానికి వీలుగా పాకల ఎత్తు సుమారుగా 10 అడుగులు ఉండాలి. సూర్యరశ్మి నేరుగా పడకుండా దీర్ఘఅక్షం తూర్పుపడమరలుగా నిర్మించుకోవాలి.
- పాకలకు ఇరువైపులా ఉండే పక్కగోడలను పూర్తిగా కట్టకుండా 2-4 అడుగుల ఎత్తు వరకు నిర్మించాలి. పాకలకు ఇరుపక్కలలో నీడనిచ్చే చెట్లను పెంచాలి. సుబాబుల్, అవిశె మొదలగు పశుగ్రాసపు చెట్లను పెంచినట్లయితే నీడనివ్వడమే కాకుండా ఎండాకాలంలో జీవాలకు గ్రాసంగా కూడా ఉపయోగపడతాయి.
- జీవాలు పాకలలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే తట్టుకోలేవు కాబట్టి పాకలలో శీతల స్థితి ఉండేటట్లు తగు ఏర్పాట్లు చేసుకోవాలి. పాకలలో ఉష్ణోగ్రతలను తగ్గించడానికి పాకలను ఇరువైపులా గోనె పట్టాలను వేలాడదీసి నీటితో రెండు మూడు సార్లు తడపాలి. పాకలలో గాలి పంకాలను, కూలర్లను అమర్చడం ద్వారా పాకలలో ఎండవేడిని తగ్గించవచ్చు.వీలైతే పాకలలో నీటిషవర్స్, ప్ప్రింక్లర్లు మొదలగు వాటిని అమర్చి నీటి తుంపరలు జీవాల శరీరంపై పడేటట్లు చేసినట్లయితే పాకలలో ఉష్ణోగ్రతను తగ్గించి శీతలస్థితిని కల్పించడం ద్వారా జీవాలకు సౌకర్యవంతంగా ఉంటుంది.
- పాకల పై కప్పుభాగాన్ని తాటి ఆకులతో లేదా గడ్డితో కప్పినట్లయితే పాకలలో ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. పైకప్పుభాగం రేకులతో ఉన్నట్లయితే ఎండాకాలంలో రేకులపై 8-10 సెం.మీ. మందంతో గడ్డిని పరచి మధ్యాహ్నం వేళల్లో రోజుకు రెండుమూడు సార్లు నీటితో తడుపుతుండాలి.
- రైతు ఆర్దిక స్థోమత మరియు జీవాల సంఖ్యను బట్టి పాకల్లో ఫ్యాన్లను లేదా తుంపర్లను వెదజల్లే యంత్రాలను కూడాఏర్పాటుచేసుకోవచ్చు. కప్పుపై భాగంపై తెల్లని రంగు వేయించడం వల్ల సూర్యకిరణాలు పరివర్తనం చెందుతాయి
- పాకలలో వడగాడ్పుల తీవ్రతను తగ్గించడానికి పాకకు ఇరువైపులా పరదాలను కట్టి నీటితో తడుపుతుండాలి. జీవాలను ప్రతిరోజు రెండుసార్లు శుభ్రమైన చల్లటి నీటితో కడగాలి. శుభ్రమైన చల్లని తాగునీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.
- వేసవి తాపంతో జీర్ణక్రియ, సన్నగిల్లుతుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలయిన గంజి, జావా లాంటి పదార్థాలు ఇవ్వడం మంచిది
- జీవాలను పాకలో ఉంచి పచ్చిమేత, దాణాను మేపాలి. పశు గ్రాసాలను చిన్న ముక్కలుగా కత్తిరించి మేపాలి. నీటి వసతి ఉన్నట్లయితే హైబ్రీడ్ నేపియర్ బహువార్షిక పశుగ్రాసాలను, జొన్న పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. పశుగ్రాసాలను సాగు చేసుకున్నట్లయితే ఎండాకాలంలో కూడా జీవాలకు పచ్చిమేతను మేపవచ్చు. మాగుడుగడ్డి (సైలేజ్) లభ్యమయితే మేతగా ఇవ్వాలి.
- ఎండాకాలములో ముఖ్యముగా వట్టిగడ్డికి బదులు సైలేజి/పాతర గడ్డి లేదా పచ్చగడ్డి లో అధికముగా పోషక విలువలు ఉండే గడ్డిజాతులను జీవాలకు అందించాలి. ఎండుమేతలైన వరిగడ్డి, మొక్కజొన్న చొప్ప, జొన్న, సజ్ఞ చొప్పలను యూరియా ద్రావణంలో సుపోషకం చేసి మేతగా మేపాలి. సుపోషకం చేసిన ఎండుగడ్డిని జీవాలు ఇష్టంగా తిని తేలికగా జీర్ణం చేసుకుంటాయి.
- ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలి. పచ్చిగడ్డిని ఉదయం సమయాలలో ఎండుగడ్డిని రాత్రిసమయాలలో విభజించి ఇవ్వాలి. దాణ నీటితో కలిపి రాత్రి మరియు తెల్లారక ముందే ఇవ్వాలి. అందుబాటులో ఉండే సమీకృత దాణ ఇవ్వడంవలన తక్కువ మోతాదులో అన్ని పోషకాలను సమకుర్చవచ్చు. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది. దాణా , చెక్క, వట్టి గడ్డి మరియు శనక్కాయ కట్టలు పెట్టడము వలన శరీరములో వేడి పెరుగుతుంది.అందువలన వాటిని కొంతమేరకు తగ్గించాలి.
- పాలిచ్చే జీవాలలో రోజుకి ఆహారాన్ని 5-8 కేజీలకు మించకుండా చూసుకోవాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి పది లీటర్ల నీటిని అందించాలి. రెండు రోజులకొకసారి 250 గ్రాముల గ్లూకోస్ ను మరియు ఓ.ఆర్.యస్. ఎలేక్త్రోలైట్లను పౌడర్‌లను నీటిలో అందించాలి.
- జీవాలలో పచ్చిమేతతో పాటుగా సమీకృత రాణా మిశ్రమాన్ని ఖనిజలవణ మిశ్రమాన్ని కలిపి మేపాలి. మేత అందుబాటులో లేనప్పుడు పంట అవశేషాలైన జొన్న మొక్కజొన్న చొప్ప కందికట్టెలు, పొద్దుతిరుగుడు కట్టెలు, పత్తి కట్టెలు మొదలగు వాటితో అందుబాటులో ఉన్న జొన్న గింజలు, మొక్కజొన్న గింజలు, వేరుశనగ చెక్క పత్తిగింజల చెక్కలతో కలిపి సంపూర్ణ సమీకృత ఆహారాన్ని తయారు చేసుకొని మేపాలి.
- మేతను గాని లేదా దాణాను గాని ఒకేసారి ఎక్కువ మోతాదులో ఇవ్వడము చేయకూడదు. అలా ఇచ్చినపుడు పొట్టలో ఎక్కువగా వేడి వచ్చి జీవాలు ఇబ్బంది పడతాయి.రోజులో 4-5 సార్లు సరఫరా చేస్తే శరీర లోపల ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుంది.
- సాధారణంగా ఎండాకాలంలో ఎక్కువ నీళ్ళు తాగి తక్కువ మేతను తీసుకుంటాయి. కాబట్టి ఇచ్చే మేతలో పోషక విలువలు ముఖ్యంగా మాంసకృత్తులు, విటమిన్లు ఖనిజలవణాలు, శక్తి, కొవ్వు పదార్థాలు తగుపాళ్లలో ఉండేటట్లు చూడాలి.
- జీవాలకు అందించే మేత లేదా దాణా లో పొటాషియం మరియు సోడియమ్ మోతాదును పెంచాలి. ఎందుకంటె చెమట మరియు ముత్ర విసర్జన ద్వారా ఈ మూలకాలు బయటకు వెళతాయి.దీని కోసమని ఉప్పును కలపడము లేదా ఉప్పు రాళ్ళను వాడకము వలన ఉపయోగము ఉంటుంది.
జీవాల ఆరోగ్య సంరక్షణ:
- ఎండకాలంలో అధిక ఉష్ణోగ్రతల వలన జీవాలు వడదెబ్బకు గురవుతుంటాయి. వడదెబ్బకు గురి అయిన జీవాలలో శరీర ఉష్ణోగ్రత పెరగడం, చెమట ఎక్కువగా బయటకి రావడం, దాహం అధికంగా పెరగడం, మేత సరిగా వ్నేయకపోవడం, శ్వాస కష్టంగా ఉండడం గమనించవచ్చు.
- వడదెబ్బకు గురి అయిన జీవాలను గుర్తించి వెంటనే చికిత్స చేయించాలి. వడదెబ్బకు గురి అయిన జీవాలను చల్లటి ప్రదేశంలో ఉంచాలి. తేలికగా జీర్ణమయ్యే జావ, గంజిలో ఉప్పును తగిన మోతాదులో కలిపి ఆహారంగా ఇవ్వాలి. డెక్రోస్ సైలైన్ ద్రావణాన్ని రక్తనాళములోని, విటమిన్ ‘‘ఎ’’, ‘‘డి’’ ఇంజక్షన్లు, విటమిన్ ‘‘సి’’., ‘‘బి’’ కాంప్లెక్స్ ఇంజక్షన్లు ఇప్పించాలి. ఎలేక్ట్రోలైట్లు కలిగిన (ఎలక్ట్రో బూస్ట్ పౌడర్) ఒక లీటరు ద్రావణాన్ని తాపాలి. రోజుకు నలబై లీటర్ల నీటిని త్రాగించాలి. ఫైటో కూల్ ద్రావణాన్ని అనే రోజుకు 10 మిల్లిల చొప్పున త్రాగించాలి.
- ఆంత్రాక్స్, బొబ్బ వ్యాధులు సోకకుండా మార్చి మాసంలో వ్యాధినిరోధక టీకాలను, గొంతువాపు, జబ్బవాపు వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తగా ‘మే’ లో టీకాలను ఇప్పించాలి.
- జీవాలను ఈదించడానికి నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి. లేదా పారే నీటిలో ఈదించాలి. ఈ విధంగా చేయడం వలన అధిక ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం కలిగించవచ్చు.
- జీవాలు అధిక ఉష్ణోగ్రతకు తట్టుకోలేవు. అధిక వేడిమి మూలంగా జీవాలు ఆయాస పడడం, మేత సరిగ్గా తినకపోవడం పాల ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి జీవాలను పాకలలోనే ఉంచి మేత, పరిశుభ్రమైన చల్లటి తాగునీటిని అందుబాటులో ఉంచాలి.
- పాకలలో ప్రతి పశువుకు కావాల్సిన స్థలాన్ని కేటాయించి జీవాలను కిక్కిరిసి ఉంచకూడదు. పాకలను, పరిసరాలను ప్రతి రోజు శుభ్రపరచాలి. పెంటిక కుప్పలను పాకలకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలి.
- అంతర పరాన్నజీవుల నిర్మూలనకు నట్టల నివారణ మందులు క్రమం తప్పకుండా త్రాగించాలి.బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు బ్యూటాక్స్ మందు తగుపాళ్ళలో నీటిలో కలిపి జీవాల శరీరంపై పిచికారిచేయాలి లేదా డిప్పింగ్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి. పరిసరాలనుపరిశుభ్రంగా ఉంచాలి.
- పోషక లోపాన్ని సరిదిద్దేందుకు ఉప్పు గడ్డలు అని పిలువబడే మినరల్ మిక్చర్ సాల్ట్ లిక్స్ను పాకలో వేలాడదీయాలి
- దాహంతో ఉన్నజీవాలు మురుగునీరు త్రాగటం వల్ల పారుడు వంటి జీర్ణకోశ రోగం వచ్చే అవకాశం ఉంది కావున ఎల్లవేళల మంచి చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంచాలి.నీరు తాగే తొట్టెలను పరిశుభ్రంగా ఉంచాలి.
- వేరే రకానికి చెందినా జీవాల జాతులకు నీళ్ళలో అదనంగా పోషకాలు, మూలకాలను, ఒత్తిడిని తగ్గించే ఫైటో కాల్ లేదా రేస్తోబాల్ హొమియోపతీ ద్రావనాలను నీటిలో కలపాలి.
- అలాగే జీవాలలో తీవ్ర ఉష్ణోగ్రత కనపరచినపుడు అయోడిన్ సూది మందును వాడాలి అది అవటు గ్రంధి పై పనిచేసి థర్మో రెగ్యులేటర్ పనిని ఉత్తేజ పరుస్తుంది
- జీవాలు బాగా లేనపుడు వెంటనే సంబంధిత పశువైద్యాధికారిని సంప్రదించాలి.
- గొర్రెల కాపలదారులు ఎండాకాలంలో ముందుగానే పై జాగ్రత్తలు పాటించడం వలన జీవాల ఆరోగ్యంకాపాడటంతోపాటు, దిగుబడి తగ్గకుండా, ఆర్దికంగా నష్టంవాటిల్లకుండా చూడవచ్చు.
డా. జి. రాంబాబు, పశువైద్యాధికారి, కడప, ఫోన్ : 94945 88885
Also Read: దేశీ జాతి ఆవుల్లో రకాలు మరియు పాల సామర్ధ్యం
Leave Your Comments