Seed setting in Sunflower: వేరుశనగ నూనె, నువ్వులనూనె కంటె కూడ ప్రొద్దు తిరుగుడు నూనె శ్రేష్ఠమైనది. దీని నుండి వనస్పతి కూడ తయారు చేస్తారు. వార్నిష్, సబ్బు, కలప పరిశ్రమల్లో కూడ ఈ నూనెను విస్తారంగా ఉపయోగిస్తున్నారు. నూనె తీసిన తర్వాత వచ్చే పిండి పశువుల దాణాగా ఉపయోగపడుతుంది. సువాసన కలిగిన లినోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండి, లినోలినిక్ ఆమ్లం లేక పోవటం వలన ప్రొద్దుతిరుగుడు పంట చాలా ఆదరణలోకి వచ్చింది. దీని నూనె గుండెపోటుగల వారికి మంచిది. మన రాష్ట్రంలో ఈ పంటను 4.18 లక్షల ఎకరాల్లో పండిస్తూ 3.32 లక్షల టన్నుల దిగుబడి సాదిస్తున్నాం. సగటు ఉత్పాదకత హెక్టారుకు 794 కిలోలు.
వాతావరణ పరిస్థితులు: పంటపూత దశలో అధిక వర్షపాతం, అధిక చలి, మంచు మరియు అధిక ఉష్ణోగ్రత (40 డిగ్రీల సెంటిగ్రేడు కంటే ఎక్కువ) వున్నపుడు గింజ కట్టడానికి సరిపడినంత పుప్పొడి ఏర్పడక తాలు గింజలు ఏర్పడతాయి. ఈ సమస్యను అధిగమించడానికి పంటను సరైన సమయంలో విత్తుకోవాలి.
పూవులోని గింజల మధ్య ఆహారానికి పోటీ: పూవులో ముందుగా ఏర్పడిన బయటవైపు గింజలు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన పూవు మధ్యభాగంలో గింజలు ఏర్పడవు. దీనినే “సెంట్రల్ స్టెరిలిటి” అని అంటారు. పెద్ద పూవులున్న రకాల్లో ఈ విధంగా గింజ కట్టకపోవడం 20 నుండి 40 శాతం దాకా వుంటుంది. అందువలన పువ్వు సైజు మధ్యస్థంగా వుండే రకాలను ఎంపిక చేసుకోవాలి..
అధిక మొక్కల సాంద్రత: మొక్కల సాంద్రత అధికంగా వున్నపుడు అతి చిన్న పూలు ఏర్పడడం, ఏర్పడిన పూలలో తాలు గింజలు రావడం జరుగుతుంది. నీటి పారుదల క్రింద ఎకరానికి 2 కిలోలు సరిపోతుంది. విత్త దూరము 45×30 సెం.మీ తేలిక లల్లో, నల్లరేగడి నేలల్లో 60×30 సెం.మీ (ఎకరానికి 22,000 మొక్కలు) వుండేలా విత్తుకోవాలి.
Also Read: పొద్దుతిరుగుడు సాగులో సమస్యల పరిష్కార మార్గాలు
పోషకాల లోపం:గింజలు ఏర్పడినా గింజల్లో పప్పు అభివృద్ధి సరిగా జరుగక తాలు గింజలు ఏర్పడతాయి. దీని నివారణకు భూసార పరీక్ష ఫలితాలను బట్టి పోషకాలను సరైన మోతాదులో అందించాలి. గింజలో నూనె శాతం మరియు గింజల బరువు పెరగటానికి తప్పనిసరిగా ఎకరానికి 10-20 కేజీల గండకం వాడాలి. అలాగే బోరాన్ సూక్ష్మ పోషక లోపము వలన గింజ కట్టడం తగ్గి తాలు గింజలు రావడానికి ఆస్కారం వుంటుంది.
అందుకుగాను 2 గ్రాముల బోరాక్స్ పొడిని లీటరు నీటికి చొప్పున కలిపి పైరు పూత దశలో ఆకర్షక పత్రాలు తెరుచుకున్నపుడు ఎకరానికి 200 లీటర్ల మోతాదులో మందు ద్రావణం పిచికారీ చేయాలి. దీనివల్ల పుప్పొడి ఎక్కువగా ఉత్పత్తి అయి ఎక్కువ సమయం వుండి పరపరాగ సంపర్కం బాగా జరుగుట వలన గింజ బాగా కడుతుంది.
నీటి ఎద్దడి: ప్రొద్దు తిరుగుడులో మొగ్గతొడిగే దశ, పూవు వికసించేదశ మరియు గింజకట్టే దశలను కీలకదశలుగా పరిగణిస్తాము. ప్రధానంగా ఈ దశల్లో నీటి ఎద్దడి ఏర్పడటంవల్ల తాలు గింజలు ఏర్పడతాయి. కాబట్టి ఈ కీలక దశల్లో తప్పని సరిగ నీటి తడులివ్వాలి. అదే సమయంలో పొలంలో నీరు నిల్వవుండకుండా చూడాలి.
చీడపీడల ఉధృతి: చీడ పీడల వలన కిరణజన్య సంయోగక్రియ జరగడానికి అవసరమైన పరిమాణంలో పత్రహరితం లేక గింజ సరిగా కట్టకపోవడం, తాలు గింజలు ఏర్పడటం జరుగుతుంది. అందువలన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టి చీడపీడల ఉధృతిని నియంత్రించాలి.
పరపరాగ సంపర్క లక్షణం: ప్రొద్దుతిరుగుడు పంటలో గింజకట్టడం, పరపరాగ సంపర్కం వలన జరుగుతుంది. ఈ పనిని తేనెటీగల వంటి కీటకాలు సమర్ధవంతంగా నిర్వహిస్తాయి. పుష్పించే దశలో తేనెటీగల సంఖ్య తక్కువగా వున్నపుడు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మెత్తటి గుడ్డతో పూలను సున్నితంగా రుద్దుట వలన పరపరాగ సంపర్కం బాగా జరిగి గింజ బాగా కడుతుంది.
Also Read: పొద్దుతిరుగుడు లో నీటి యాజమాన్యం