Integrated Pest Management: ప్రస్తుతం రాష్ట్రం లో సాగుచేస్తున్న అన్ని రకాల వ్యవసాయ మరియు ఉద్యానవన పంటలకు సర్వసాధారణంగా రసం పీల్చు పురుగులు (ఉదాహరణకి పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, తామరపురుగులు, పిండినల్లి మొ౹౹ అలాగే కాయతోలుచు పురుగులు (ఉదాహరణకి పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు ,వంగలో అయితే కొమ్మ మరియు కాయ తొలిచే పురుగులు) ఆశించి దిగుబడుల్లో చాలా వరకు నష్టం జరుగుతుంది.
వీటిని అదుపు చేయడానికి రైతులు విచక్షణ లేకుండా ,విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల చాలా పురుగుల్లో పురుగు మందుకి నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా పురుగు ఉధృతి తగ్గకపోవడం , అధిక మోతాదుల్లో రసాయనిక మందుల అవశేషాలు మొక్కల మీద , వాటి ఉత్పత్తులైన కూరగాయలు , పండ్ల మీద ఉండడం వల్ల వాటిని మనం ఆహారంగా స్వీకరించి అనేక రోగాలకు గురవుతున్నాం. అలాగే వాతవరణంలో కూడా సమతౌల్యం తగ్గి పర్యావరణం దెబ్బతింటుంది..
కావున రైతులు పర్యావరణానికి, నేలకు హాని కలగకుండా ఉండాలంటే జీవ నియంత్రణ వంటి సమగ్ర సస్యరక్షణ పద్ధతుల వైపు నడవాల్సిందే….
ఇందులోభాగంగా జీవ నియంత్రణ పురుగు మందులు అయిన అజాడిరక్టిన్(1500 PPM), బవేరియా బసియానా , బాసిల్లస్ తురింజిఎన్సీస్, న్యూక్లీయర్ పాలి హెడ్రోసిస్ వైరస్ ద్రావణం , మెటారైజియం వంటివి వాడవచ్చు.
భౌతిక పద్ధతులు:
- పసుపు, నీలి, తెలుపు రంగు జిగురు అట్టలను వాడి అన్ని రకాల పంటలని ఆశించే రసం పీల్చుపురుగులను అదుపులో ఉంచవచ్చు.
2. పసుపు రంగు అట్టలకి పచ్చదోమ ,తెల్లదోమ , పేనుబంకలు అకర్షితమయి అట్టకి ఉన్న జిగురుకి పట్టుకొని చనిపోతాయి.మ్ముఖ్యంగా కూరగాయల పంటల్లో ఎకరాకు 20-25 అట్టలని పంట కంటే కొంచెమ్ ఎత్తులో రెండు వైపులా అమర్చాలి.
3. నీలి రంగు జిగురు అట్టల కి తామరపురుగులు , ఎర్ర మరియు తెల్ల నల్లి ఆకర్షించబడతాయి. వీటికోసం కూడా ఎకరాకు 20-25 అమర్చుకోవాలి.
4. ఈ జిగురు అట్టలను పంట వేసిన 15-20 రోజుల నుండి పంట తీసే వరకు అన్ని పంటల్లో వివిధ దశల్లో వాడుకోవచ్చు.
5. ఈ జిగురు అట్టల ధర ఒక్కొక్కటి 10 నుండి 12 రూపాయలు మాత్రమే.
Also Read: యాసంగి ఆరుతడి పంటలలో లద్దె పురుగులు యాజమాన్యం
లింగాకర్షక బుట్టలు:
వివిధ పంటలనాశించే కాయతొలుచుపురుగుల నివారణకు ఈ లింగాకర్షక ఈ బుట్టలను వాడతారు. కీటకాన్ని బట్టి లింగాకర్షణ బుట్టలో వాడే ఎర (రసాయనం) మారుతుంది. కానీ బుట్టలను అన్ని రకాల పంటలకి మార్చి మార్చి వాడవచ్చు.
ఈ ఎరబుట్టలను 21 రోజులకొకసారి మార్చి వాడితే బుట్టలకు మగపురుగుల్ని ఆకర్షించే సామర్థ్యం పెరుగుతుంది.
ఈ లింగాకర్షక బుట్టలను పురుగులు ఆశించే దశనుండి పంటను కోసే వరకు ఉపయోగించాలి.
- పురుగుల ఉధృతి ని పరిశీలించడానికి ఎకరాకు 4-5 బుట్టల్ని అమర్చాలి.
2. పురుగుల 50-60 % నివారణకి ఎకరాకు 100 -120 బుట్టలు అమర్చుకోవాలి.
3. బుట్టల ఎత్తు పంట ఎత్తు పెరిగేకొద్దీ పెంచుకోవాలి.
4. ఒక్కొక్క లింగాకర్షక ఎర బుట్ట ధర 30-35 రూపాయలు మాత్రమే.
5. బుట్టలో పడిన పురుగుల్ని రోజూ గమనించి ఒక దగ్గరకి చేర్చి గోతి తీసి పూడ్చాలి.
6. వరుసగా 3 రోజులు 8-10 పురుగులు బుట్టల్లో కనబడితే పురుగు ఉధృతి ఆర్థిక నష్ట పరిమితిని దాటినట్లు గుర్తించి , తొలిదశలో మిత్రపురుగులకి హాని కలిగించని పురుగు మందులని వాడి , ఆ తరువాత రసాయన పురుగుమందులని పిచికారీ చేయాలి.. వీటి పిచికారీ ని కూడా ఉదయం 7-9 గంటలు మరియు సాయంత్రం 4-6 గంటల లోపే చేసుకోవాలి.
పంట పేరు- లింగాకర్షక బుట్టల ద్వారా నియంత్రించబడే పురుగు:
ప్రత్తి — గులాబీరంగు పురుగు
వేరుశెనగ—-పొగాకు లద్దె పురుగు
కంది—-మరూక మచ్చల పురుగు,శనగపచ్చ పురుగు
వరి—-కాండం తొలిచే పురుగు
ఆముదం—-పొగాకు లద్దె పురుగు,నామాల పురుగు
మిరప,టమాటా,ఉల్లి—–పొగాకు లద్దె పురుగు,శనగ పచ్చ పురుగు.
Also Read: కూనారం వరి సాగు మెళకువలు