Weather Information: భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం..జరుగుతున్న అభివృద్ధి తో పాటుగా జనాభా కూడా అంతే వృద్ధి రేటుతో క్రమంగా పెరుగుతున్నది. పెరుగుతున్న ఆ జనాభాకి కూడా సరిపడు మోతాదులో అహరోత్పత్తి లో పెరుగుదల ఉంటేనే ఆ అభివృద్ధి సుస్థిరం అవుతుంది. అందుకుగాను వ్యవసాయపరంగా పంటలకు కావాల్సిన అనుకూల పరిస్థితులను సృష్టించడం ( ఉదాహరణకి గ్రీన్ హౌస్ వంటి వాటిలో కృత్రిమ వాతావరణ నిర్వహణ ) లేదా ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణముగా చేయాల్సిన వ్యవసాయ పనులను ముందే అనుకోవడం (రూపొందించుకోవడం) చాలా కీలకమైనది.
ఇందుకుగాను వాతావరణ విభాగం వారు జాతీయ ,రాష్ట్ర స్థాయిలో ఆయా నియమిత కాలానికి సంభందించి తరచుగా వాతవరణ సూచనలు చేస్తూనే ఉంటారు..ఏ రోజు వర్ష సూచన ఉంది , ఎంత ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయి , గాలుల తీవ్రత ఎలా ఉండబోతుంది వంటి అంశాల గురించి కీలక సమాచారాన్ని అందిస్తాయి..సాధారణంగా ఈ సూచనలు రేడియో ల ద్వారా , వార్తాపత్రికల ద్వారా, టీవీ ల ద్వారా అందిస్తాయి…కానీ ఈ మధ్య కాలంలో మొబైల్ అనేది అధిక సంఖ్యలో రైతులకి అందుబాటులో ఉండడం వల్ల వారి అరచేతిలోనే వ్యవసాయ వాతావరణ సమాచారం వారికి అందుబాటులో ఉండేలా భారత వాతావరణ శాఖ కొన్ని మొబైల్ యాప్స్ (Apps) ని రూపొందించింది.
Also Read: రైతుసోదరులకు వాతావరణాధారిత సలహాలు మరియు సూచనలు
మేఘాదూత్ యాప్: ఈ యాప్ ని అభివృద్ధి చేయడంలో సంయుక్తముగా కృషి చేసింది IMD , ICAR , IITM , భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ . ఈ అప్ కి కావాల్సిన సమాచారం రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని ఆగ్రోమేట్ ఫీల్డ్ యూనిట్స్ , జిల్లా వ్యవసాయ వాతావరణ విభాగం వారు జిల్లా ల వారీగా పొందుపరుస్తారు. ఈ యాప్ ని రైతులు స్మార్ట్ ఫోన్ లో డౌన్లోడ్ చేస్కొని ,వివరాలను నమోదు చేసుకొని , మొబైల్ నెంబర్ తో సైన్ ఇన్ అవ్వాలి. ఈ యాప్ లో హిందీ , ఇంగ్లీష్ తో పాటుగా మన తెలుగులో కూడా సమాచారం ఉంటుంది.దీనిద్వారా రైతులు వారి వారి ప్రాంతాల్లో గల వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
మౌసమ్ యాప్: IMD మరియు భూ మంత్రిత్వ శాఖ వారు ఈ యాప్ ని రూపొందించారు. దీని ద్వారా ప్రస్తుత మరియు భవిష్యత్తు ( ఏడు రోజుల ముందుగా ) వాతావరణ సూచనలు తెల్సుకోవచ్చు. తమ తమ ప్రాంతాల్లో వర్షం , ఉరుములు లేదా ఇతర వాతావరణ పరిస్థితులను అంచనా వేసి తెలియజేస్తుంది. ఈ యాప్ స్పష్టముగా రాడార్ చిత్రాలనుండి సమాచారాన్ని గ్రహించి , వాతావరణ పరిస్థితులను తెలుపుతుంది.
దామిని యాప్: ఈ యాప్ ని అభివృద్ధి చేసిన వారు IITM , ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ . ఇది 20-40 కి.మీ ల పరిధిలో సంభవించే ఉరుములు , పిడుగులు , మెరుపుల సూచనలను GPS నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. పిడుగు పాటు సమాచారం 3 గంటల ముందుగానే తెలియజేస్తుంది.
రెయిన్ అలారం యాప్: ఈ యాప్ ద్వారా ఆయా ప్రదేశంలోని వర్షపాతం , మంచు సూచనలను ముందుగానే అందిస్తుంది. ఇది రాడార్ డేటా ఆధారంగా ఫలానా ప్రాంతంలో ముందుగానే వర్షసూచన అందిస్తుంది.
కావున రైతులు వారి మొబైల్ ఫోన్లలో ఈ విధముగా యాప్ లని డౌన్లోడ్ చేస్కొని వాతావరణ పరిస్థితులపై ముందస్తు అవగాహన తెచ్చుకొని , ప్రతికూల వాతావరణంలో పంటలకు ఏర్పడే నష్టాలను తగ్గించి , అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంది.
Also Read: బోడకాకరతో ఆరోగ్య ప్రయోజనాలు