animal husbandry: పాలకు స్థిరంగా గిరాకీ ఎప్పటికి ఉంటూనే ఉంటుంది. కానీ పశువుల పెంపకం అంత సులభం అయితే కాదు. పశువుల పెంపకంపై ప్రేమ, శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతే విజయం తథ్యం. మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటే డెయిరీ ఫారాన్ని లాభదాయకంగా నిర్వహించుకోవచ్చు. అందులో ముర్రా గేదె ఒకటి. ముర్రా గేదె ధర సాధారణంగా 80 వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ గేదె రోజుకు 12-14 లీటర్ల పాలు ఇవ్వగలదు. ముర్రా జాతికి చెందిన చాలా చిన్నవి 1 నుండి 4 లక్షల వరకు ఉండగా, కొన్నింటికి 50 లక్షల వరకు ఖర్చవుతుంది. దీని జనాదరణ దృష్ట్యా, హర్యానా ప్రభుత్వం దీనిని మరింత ప్రోత్సహించాలనుకుంటోంది.
వ్యవసాయాన్ని మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతులు జీరో బడ్జెట్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్లాలన్నారు మనోహర్ లాల్ ఖట్టర్. ఈ ఏడాది బడ్జెట్‌లో సేంద్రియ వ్యవసాయం కోసం ఒక్కొక్కటి 25 ఎకరాల్లో 100 క్లస్టర్లను ప్రకటించారు. ఈ సాగులో రైతులకు నష్టం జరిగితే మూడేళ్లపాటు ప్రభుత్వం ఈ లోటును తీరుస్తుంది. ఇక పశువుల పెంపకం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ముర్రా జాతి గేదెలను ప్రోత్సహించాలని, ఇది పశువుల పెంపకందారుల ఆర్థిక లాభం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు.
గతంలో హర్యానాలోని హిస్సార్ జిల్లాకు చెందిన ఓ గేదె రోజుకి ఏకంగా 32 లీటర్ల పాలు ఇచ్చి, ప్రపంచరికార్డు నమోదు చేసింది. సరస్వతి అనే ఈ ముర్రా జాతి గేదె ఒక్క విడతలోనే 32.066 లీటర్ల పాలు ఇచ్చింది. గతేడాది పాకిస్థాన్ కు చెందిన ఓ గేదె స్థాపించిన రికార్డును సరస్వతి తిరగరాసింది. సరస్వతి వయసు ఏడేళ్లు. అధిక పాలను ఇస్తున్న ఈ రకం జాతిపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలను సీఎం సంబంధిత అధికారులను కోరారు. వ్యవసాయం అంటే ధాన్యాలు మాత్రమే కాదని పశువుల పెంపకంతోనూ రైతులు లాభాలను ఆర్జించవచ్చునని స్పష్టం చేశారు.