Natural Farming: దేశంలో గతేడాది నుంచి కేంద్ర ప్రభుత్వం సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం దేశంలో సాంప్రదాయ దేశీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే. ఇందుకోసం ప్రభుత్వం పరంపరగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) ఉప పథకంగా 2020-21 నుంచి భారతీయ సహజ వ్యవసాయ విధానాన్ని (బీపీకేపీ) అమలు చేసింది. దీని కింద ఇప్పటి వరకు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోని లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో సహజ వ్యవసాయం జరుగుతోంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశంలో 4 లక్షల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సహజ వ్యవసాయం జరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 409400 హెక్టార్లలో సహజ వ్యవసాయం జరుగుతోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాచారం ఇచ్చారు. సహజ వ్యవసాయం 8 రాష్ట్రాలలో విస్తరించి ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి. అదే సమయంలో ఈ రాష్ట్రాల్లో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రూ.4980.99 లక్షల నిధిని కేటాయించారు.
కాగా దేశంలో సహజ వ్యవసాయ విస్తీర్ణం త్వరలో 9న్నర లక్షల హెక్టార్లకు చేరుకోనుంది. ప్రస్తుతం దేశంలో సహజ సాగు విస్తీర్ణం 4 లక్షల హెక్టార్లకు పైగా ఉండగా, త్వరలోనే ఈ విస్తీర్ణం 9న్నర లక్షల హెక్టార్లను దాటనుంది. ఈ సమాచారాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా రాజ్యసభలో తెలిపారు. 2021-22 సంవత్సరంలో దేశంలోని 3 రాష్ట్రాల్లో 5.68 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సహజ వ్యవసాయం చేసేందుకు ఆమోదం లభించిందని తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 1.5 లక్షల హెక్టార్లు, రాజస్థాన్‌లో 3.8 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 0.38 లక్షల హెక్టార్లలో సహజ వ్యవసాయానికి అనుమతి లభించింది.