Intercropping: సమగ్ర సస్యరక్షణ లో పాటించే పద్దతుల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి అంతర,ఎర మరియు కంచె పంటల పద్ధతులు. సాధారణంగా వ్యవసాయంలో ఆశించే రోగాలు , పురుగులను ఎదుర్కోవడానికి వాటిని రసాయనిక (పురుగు,తెగుళ్ల)మందులు వాడడం అనేది అందరూ సాధారణంగా చేస్తున్నదే. అయితే వాటిని సమూలంగా నిర్మూలించడంలో భాగంగా రసాయనిక మందుల వాడకం వల్ల పర్యావరణంలో పురుగు మందుల అవశేషాలు (వాటి తాలూకూ ప్రభావం) అలాగే ఉండి పోవడం వల్ల అది కాలుష్యానికి దారి తీయడమే కాక , పంటకు పనికొచ్చే, మేలుచేసే మిత్రపురుగులు కూడా చనిపోతున్నాయి.
అందువలన వాటిని చంపడమే పరిష్కారం కాదు కనుక వాటి దృష్టిని మనం పండించే పంట మీద నుండి పక్కకి మరల్చడం , వాటి బెడద ఉండకుండా చేస్కోవడం ఈ పై విధానాల ప్రధాన ఉద్దేశ్యం.
1.అంతరపంటలు:
రెండు పంటలను ఒకే పొలం లో మనం నిర్ణయించుకున్న నిష్పత్తిలో , ఒక క్రమ పద్ధతిలో వేయడాన్ని అంతరపంట విధానం అంటారు. ఈ విధానం లో మనం ఎక్కువ పరిమాణం లో పండించే పంట ప్రధాన పంట కాగా , చీడపీడలను అదుపులో ఉంచడానికి వేసే తక్కువ పరిమాణపు పంట అంతరపంట అవుతుంది. ప్రధాన పంట ను ఏ పురుగులైతే ఆశిస్తామో ఆ పురుగులను తట్టుకునే సహజశత్రువులని వృద్ధిచేసే అంతరపంటలను వేయాలి.
పంటల్లో చీడపీడల ప్రభావాన్ని తగ్గించే కొన్ని అంతర పంటలు:
ప్రత్తిలో అంతరపంటగా 2 లేదా 3 వరుసల పెసర ,బొబ్బర , మినుము ,సోయాచిక్కుడు వేయడం వల్ల ప్రత్తిని ఆశించే రసం పీల్చే పురుగులని తినడానికి ఉపయోగపడే అక్షింతల పురుగులు , సాలీళ్ళు వృద్ధి చెందుతాయి.
ప్రత్తి లో కంది పంటని 4:1 /6:1/ 8:1 నిష్పత్తిలో వేయడం వల్ల మిత్రపురుగులసంఖ్య పెరిగి వాతావరణ ఒడిదుడుకుల నుండి కొంత రక్షణ లభిస్తుంది.
వేరుశెనగలో అలసంద, పొద్ధుతిరుగుడు పంటవల్ల ఆకుముడత పురుగు ఉధృతి తగ్గుతుంది. పొద్దుతిరుగుడులో వేరుశెనగ 2:4 నిష్పత్తిలో , పొద్దుతిరుగుడు లో కంది 2:1 నిష్పత్తిలో వర్షాకాలంలో సాగుచేస్తే పొగాకు లద్దె పురుగు ఉధృతి కొంతవరకు తగ్గించవచ్చు. ఆముదం మరియు కంది 1:1 నిష్పత్తిలో , ఆముదం మరియు గోరుచిక్కుడు /అలసందలు/మినుము/వేరుశెనగ 1:2 నిష్పత్తిలో సాగు చేసినట్లయితే దాసరిపురుగు,పచ్చదీపపు పురుగు ,కాండం మరియు కాయతొలిచే పురుగుల ఉధృతి తగ్గించవచ్చు.
Also Read: అంతర పంటల సాగుతో ప్రయోజనాలు
ఎరపంటలు (ఆకర్షించే పంటలు):
కొన్ని రకాల పంటలు కొన్ని పురుగులను విపరీతంగా ఆకర్షిస్తాయి.ఆ పంటలను ప్రధానపొలంలో వేస్తే పురుగు రాకను , ఉనికిని వెంటనే గుర్తించవచ్చు. అటువంటి పంటలను ఎరపంటలు లేదా ఆకర్షక పంటలు (Trop Crop) అంటారు. ఎరపంటలు వేయడం వల్ల ప్రధానపంటపై పురుగుల ఉధృతి తగ్గి ,పురుగుమందులు వాడాల్సిన ఆవశ్యకత , ఖర్చు తగ్గుతుంది.
కొన్ని ముఖ్యమైన పంటల్లో ఎరపంటలు:
ప్రత్తి, వేరుశెనగ పంటల్లో ఆముదపు పంట ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులని సులభంగా నివారించవచ్చు. క్యాబేజీ లో సాధారణముగా వాచ్చే డైమండ్ బ్యాక్ మాత్ నివారణకి ఆవాలు వేయాలి. వేరుశెనగ లో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉధృతిని నివారించవచ్చు. ప్రత్తిలో బెండవేసి పచ్చపురుగు , పచ్చదోమ , తలనత్త పురుగులని అరికట్టవచ్చు. అలసందలో ఆవాలు వేసి గొంగలిపురుగు , పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు. వరిపొలం గట్లమీద బంతి మొక్కలను నాటి నులిపురుగుల ఉధృతి తగ్గించవచ్చు.
కంచె పంటలు (రక్షక పంటలు):
పొలం లో ప్రధాన పంట చుట్టూ లేదా గట్ల వెంబడి కొన్ని సాళ్లలో ఎంపిక చేసి వేసే పైర్లను కంచె పంటలు (Border Crop) అంటారు. పురుగులు ,తెగుళ్ల బీజాలు పక్కపొలం నుండి రాకుండా ఇవి అడ్డుకుంటాయి. ఒక పొలం నుండి మరొక పొలానికి రాకుండా ఇవి అడ్డుకుంటాయి. ఈ విధంగా చీడపీడల నియంత్రణ జరుగుతుంది. జరుగుతుంది. ఇలా పెంచాలనుకునే పంటలు చేనులోని ప్రధాన పంటలకంటే ఎత్తు పెరిగేవి గా ఉండాలి. జొన్న ,సజ్జ, మొక్కజొన్న పంటలు సాధారణముగా రక్షక పంటలుగా ఉపయోగపడతాయి.
వివిధ పంటల్లో వేసే కంచె పంటలు:
- ప్రత్తిచేను చుట్టూ కంచెగా సజ్జ,జొన్న,మొక్కజొన్న పేర్లను 3-4 వరుసల్లో వేస్తే బయటి పురుగులు రావడాన్ని ఆపవచ్చు. ఇవి మిత్రపురుగుల అభివృద్ధి కి , ప్రత్యేకించి అల్లిక రెక్కల పురుగుల సంతతి వృద్ధి చెందుతుంది.
- మిరపలో జొన్న ,మొక్కజొన్న లను 2-3 సాళ్లలో కంచె పంటగా వేసుకోవడం వల్ల పేనుబంక , తద్వారా ఆశించే వైరస్ తెగుళ్ల తాకిడి తగ్గుతుంది.
- వేరుశెనగల్ జొన్న ,సజ్జ కంచె పంటలుగా వేస్తే రసం పీల్చే పురుగులు ,తిక్కా ఆకుమచ్చ తెగులు ఉధృతి తగ్గుతుంది.
- కంచె పంటలను మినుము,పెసర వంటి పైర్లలో కూడా వేసి వెర్రి తెగులు ను వ్యాప్తి చేసే పేనుబంక, తెల్లదోమ, తామర పురుగుల వంటి రసం పీల్చే పురుగుల ఉధృతి మరియు వలసలను నిరోధించవచ్చు.
- అదే విధంగా మొక్కజొన్న పొలాల చుట్టూ 4 నుండి 5 వరుసల ఆముదపు పంటని దగ్గరగా (45×30 సెం. మీ) వేసినట్లయితే అడవి పందుల భారీ నుండి పంటను కాపాడుకోవచ్చు.అలాగే రైతులకు ఆముదం పంటద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది.
Also Read: అంతర పంటల వైపు రైతు చూపు ? ప్రయోజనాలేంటి ?