Pest Control Techniques: ప్రస్తుతం యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేయడం ఎంతో లాభదాయకం. తక్కువ నీరు మరియు ఎరువులతో అధిక దిగుబడులను సాధించడంతో పాటు మార్కెట్లో సంప్రదాయ పంటలకు మంచి డిమాండ్ ఉండడం వలన అన్నదాతలు మంచి లాభాలు పొందవచ్చు. ప్రస్తుత యాసంగి లో ఆరుతడి పంటలైన పెసర మినుము వేరుశనగ మరియు వేసవి పంటగా సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటలను పంట యొక్క తొలి దశ నుండి వివిధ రకాల లద్దెపురుగులు ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి కాబట్టి సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లు అయితే అధిక దిగుబడులను పొందవచ్చు.
శనగపచ్చ పురుగు: తల్లి పురుగు లేత చిగుళ్లపై పూమొగ్గలు, లేత పిందెలపై గుడ్లను విడివిడిగా పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన నార పురుగులు మొగ్గల్ని గోకి తింటూ తొలచి కాయలోకి తలని చొపించి మిగతా శరీరాన్ని బయట ఉంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి. వర్షం లేదా చిరుజల్లులు పడినప్పుడు లేదా రాత్రి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది.
నివారణ: ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పై స్పైనోశాడ్ 0.3 మిల్లీ లీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూ బెండామైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 యస్.సి 0.3 మిల్లీ లీటర్లు ఏదో ఒక దానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
పొగాకు లద్దె పురుగు:
పైరు తొలిదశలో లద్దెపురుగు ఆకులలో పత్రహరితాన్ని గీకి తినడం వలన ఆకులు తెల్లగా మారతాయి మరియు కాయలను తిని వేస్తాయి ఈ పురుగులు పగటివేళ మొక్కల అడుగున లేదా మట్టి పిల్లల కింద దాగి రాత్రిపూట మొక్కలను ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి.
నివారణ:
1. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి.
2. ఏరా పంటలుగా ఆముదం లేదా పొద్దుతిరుగుడు ముప్పై నుండి నలభై మొక్కలు ఉండేలా విత్తాలి.
3. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5 శాతం వేప గింజల కషాయం పిచికారీ చేసుకోవాలి.
4. ఎండిన ఎదిగిన లార్వాలను నివారించేందుకు నోవాల్యురాన్ 200 మిల్లీ లీటర్లు లేదా 40 మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి సరిపోయేలా 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
5. విషపు ఎర (వరి తవుడు 5 కిలోలు ప్లస్ బెల్లం అరకిలో మోనోక్రోటోఫాస్ 500 మిల్లీ లీటర్లు) ఎకరానికి పొలంలో సాయంత్రం వేళ మొదలు దగ్గర పురుగు నివారించుకోవాలి.
మారుకా మచ్చల పురుగు:
ఇటీవలి కాలంలో పెసర మినుము మరియు కంది పైర్లలో సుమారుగా మచ్చల పురుగు ఉధృతి ఎక్కువగా గమనిస్తున్నాం. దీనినే పూతపురుగు లేదా గూడుపురుగు అని కూడా అంటారు. గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్లపురుగులు వెంటనే పూమొగ్గలోకి చొచ్చుకుపోయి లేత భాగాలను తింటూ ఉంటాయి. మొదట ఒకటి రెండు దశలలో పూమొగ్గలోనే ఉంటూ తరువాత లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కలిపి గూడు చేసుకొని తినడం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. తొలిచిన కాయ రంద్రం దగ్గర లార్వా విసర్జితములు కనిపిస్తాయి. ఉదృతి అధికంగా ఉండి సరైన సమయంలో నివారించకపోతే దాదాపు 80 శాతం వరకు నష్టం కలుగుతుంది.
Also Read: సమస్యాత్మక సాగునీటి యాజమాన్యంలో జిప్సం బెడ్ ప్రాముఖ్యత
నివారణ:
1. పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి
2. లీటరు నీటికి 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె ఐదు మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు.
3. మొగ్గ పూత దశలో పిల్ల పురుగులు కనిపించినట్లయితే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు లేదా ధయోడికార్బ్ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
4. పంటలో గూళ్ళు కనిపించినట్లయితే క్వినాల్ఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేక నోవాల్యురాన్ ఒక మిల్లీ లీటర్లు ఏదో ఒక మందుతో తప్పనిసరిగా డైక్లోరోవాస్ మందు ఒక మిల్లీ లీటరు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
5. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు స్పైనోశాడ్ 0.3 మిల్లీ లీటర్లు లేక ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా ఫ్లూబెండిమైడ్ 0.2 మిల్లీ.లీటర్లు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
వేరుశనగ ఆకుముడత పురుగు:
పంట విత్తిన 15 రోజుల నుండి 45 రోజుల వరకు ఈ పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు రెండు నుండి మూడు ఆకులను కలిపి గూడు చేసి పచ్చదనాన్ని తినడం వలన ఆకులన్నీ ఎండి దూరం నుండి కాలిపోయినట్లు కనపడతాయి.
నివారణకు:
క్లోరిపైరిఫాస్ 500 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి.
నువ్వులలో బీహారీ గొంగళి పురుగు:
తొలిదశలో చిన్న గొంగళి పురుగులు గుంపులుగా ఆకులోని పత్రహరితాన్ని గోకితిని జల్లెడాకులుగా చేస్తాయి. ఎదిగిన గొంగళి పురుగులు ఇతర మొక్కలపైకి పాకుతూ మొగ్గలకు, పువ్వులకు మరియు కాయలకు రంధ్రాలను చేస్తూ విత్తనాలను తినేస్తాయి. పంటలో గుడ్లు లేదా గొంగళి పురుగులను గమనించిన వెంటనే ఆకులతో సహా తీసివేసి నాశనం చేయాలి. క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ 75 యస్పి 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఆకు ముడత మరియు కాయ తొలుచు పురుగు:
నువ్వు పంట తొలిదశలో చిన్న గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడుకట్టి లోపలినుండి ఆకులోని పచ్చని పదార్ధాన్ని గోకి తినడం వల్ల ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొలది ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసుకుని ఆకులను తింటాయి. మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పూతను, కాయల్లోని లేత గింజలను తింటూ పంటకు నష్టం చేస్తాయి.
నివారణ:
మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
డా.ఎస్.ఓం. ప్రకాష్ శాస్త్రవేత్త, (కీటక శాస్త్రం) డా.ఎం. ఉమాదేవి,
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస జగిత్యాల.
Also Read: అవిసె సాగులో ఎరువుల యాజమాన్యం
Leave Your Comments