వార్తలు

Groundnut Cutting: శనగ కోత నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

3
Groundnuts
Groundnuts
Groundnut Cutting: కడప జిల్లాలో రబీలో అధిక విస్తీర్ణంలో సాగుచేసే ముఖ్యమైన అపరాల పంట శనగ. పంట కోత నుంచి మళ్ళీ విత్తుకునే వరకు విత్తనాలను సంరక్షించుకోవడంలో విత్తన నిల్వ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో విత్తన మొలక శాతాన్ని, జీవశక్తిని, విత్తన ఆరోగ్యాన్ని చాలా జాగ్రతగా కాపాడాల్సి ఉంటుంది. నిల్వ సమయంలో విత్తనాలను అంతర్గతంగా బాహ్యంగా కీటకాలు, శిలీంధ్రాలు ఆశించి నష్టపరుస్తాయి. కనుక పంటను సరైన సమయంలో కోయడం ముఖ్యం. కోత సమయంలో అధిక తేమ ఉన్నట్లయితే శిలీంధ్రాలు మరియు కీటకాలు ఆశించే అవకాశం ఉంది. కావున, రైతులు పంట పక్వదశను గుర్తించి సకాలంలో పంటకోత చేసి కోతానంతరం, తదుపరి నిల్వ సమయలో తగు జాగ్రతలు పాటిస్తే అధిక నాణ్యవంతమైన పంట దిగుబడి పొందవచ్చు.
Groundnuts

Groundnuts

కోత మరియు నూర్పిడి: 
శనగ పంట సాధారణంగా పూతదశ నుండి 50-55 రోజులలో పరిపక్వతకు చేరుతుంది. కాయలు ఆకుపచ్చరంగు నుండి గోధుమ రంగుకు మారి, ఆకులు పసుపు బారి, పూర్తిగా రాలిపోయి, మొక్కంతా ఎండిపోతుంది. ఈ సమయంలో సకాలంలో కోత కోస్తే గింజ అధిక నాణ్యతను కలిగి  ఉంటుంది. పంటను కూలీలు/ కంబైండ్‌ హార్వెస్టర్‌తో కూడా కోయించవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ సామర్ధ్యం కొరకు యంత్రాల్ని వాడాలి. వాడేముందు యంత్రాల్ని శుభ్ర పరుచుకుంటే కల్తీల్ని నిరోధించవచ్చు. పంట కోసిన తరువాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలలో కాని, చేతితో గాని నూర్పుకోవచ్చు.
విత్తనం నిల్వచేయు సమయంలో చెడిపోవడానికి గల ముఖ్య కారణాలు:
* విత్తనంలో తేమ శాతం అధికంగా ఉండటం
* నిల్వ చేసిన గదిలో తేమ, ఉష్ణోగ్రత అధికంగా ఉండటం
* పూర్తిగా శుభ్రం చేయకుండా విత్తనాలను నిల్వచేయడం
*  నిల్వ సమయంలో వివిధ రకాలైన కీటకాలు మరియు బూజు తెగుళ్ళు ఆశించడం వలన విత్తన నాణ్యత మరియు మొలక శాతం తగ్గడం జరుగుతుంది.
Groundnut Cutting Machine

Groundnut Cutting Machine

కీటకాలు: 
నిల్వలో వివిధ కీటకాలు ఆశించి  గింజలోపల, వెలుపల భాగాలను నష్టపరుస్తాయి. వీటి వలన నాణ్యత పోషక విలువలు తగ్గి మార్కెట్‌ కి  పనికిరావు.
శనగ నిల్వలో పెంకుపురుగు అత్యధికంగా నష్టపరుస్తుంది. సాధారణంగా కాయ పరిపక్వత దశలోనే పంటపొలంలో పెంకుపురుగు ఆశించి గింజల ద్వారా నిల్వ చేసే గోదాములోకి ప్రవేశించి నష్టం కలుగజేస్తుంది. కాబట్టి కోత మొదలైనప్పటి నుండి నిల్వ చేసేంత వరకు తగిన జాగ్రతలు తీసుకోవాలి. పెంకుపురుగు గింజల పై  గుండ్రని, తెల్లని గ్రుడ్లను పెడుతుంది. ఈ గ్రుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు (గ్రబ్స్‌) గోధుమ రంగులో ఉండి గింజ లోపలి భాగాన్ని తినేసి రంధ్రాలను చేస్తాయి. ఇందులోనే గ్రబ్స్‌ కోశస్థ దశలోనికి మారి, అందులో నుండి తల్లి పురుగులు బయటకు వస్తాయి.

Also Read: పాడి పశువులకు పచ్చడి తయారీ- సైలేజ్

నివారణ: 
పురుగు ఆశించకుండా గోనె సంచులను 10 శాతం వేప ద్రావణం పిచికారీ చేసి వాడుకోవాలి లేదా 5 శాతం వేప కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనెసంచులను వాడాలి లేదా సంచుల పై డెల్టామిత్రిన్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి తరువాత ఆరబెట్టి నిల్వ ఉంచుకోవాలి. బస్తాలు నిల్వచేసే గది గోడలపైన, క్రింద 20 మి.లీ. మలాథియాన్‌ ద్రావణం లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గోదాములలో కాని, మనుషులు సంచారానికి దూరంగా ఉన్న రూములో నిలువ ఉంచినట్లైతే అల్యూమినియం ఫాస్ఫైడ్‌ (సెల్ఫాన్‌) టాబ్లెట్లను టన్ను విత్తనానికి 3గ్రా. (ఒక టాబ్లెట్‌) చొప్పున 5 రోజులు పాటు ఊదర పెట్టి తర్వాత గాలి తగలనివ్వాలి.
శిలీంధ్రాలు:
పంట ఉత్పత్తిని సరిగ్గా ఆరబెట్టకపోయినా లేదా నిల్వ సమయంలో ఉత్పత్తి చెమ్మగిల్లినా లేదా కీటకాలు, ఎలుకలు ఉన్నా వివిధ శిలీంధ్రాలు ఆశించి గింజల పై తెల్లటి, పచ్చని లేదా నల్లటి బూజుగా ఏర్పడతాయి. దీని వలన గింజలు నాణ్యత, రంగు, రుచిని కోల్పోతాయి. ఈ శిలీంధ్రాలు మైకోటాక్సిన్‌ అనే విషపూరిత రసాయనాలను గింజలలో విడుదల చేస్తాయి. ఈ గింజలు మనుషులు, పశువులకు హానికరమేకాక క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాదులకు దారీతీస్తాయి.
నివారణ: 
గింజలలో తేమశాతం 9 కన్నా ఎక్కువ ఉండకుండా ఆరబెట్టాలి. నిండిన బస్తాలు చెక్క బల్లలపై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి. విత్తనం కొరకు భద్రపరిచే గింజల్ని థైరామ్‌/ కాప్టాన్‌ 2.5 గ్రా. కిలో విత్తనానికి చొప్పున కలిపి అరబెట్టుకుని నిల్వ చేసుకోవాలి.
Penut Harvesting Machine

Penut Harvesting Machine

ఎలుకలు: 
ఎలుకలు నిల్వ చేసిన గింజల్ని తినడంతో పాటు వాటి విసర్జనలు, మూత్రంతో గింజల్ని మలినం చేస్తాయి. తద్వారా గింజల నాణ్యత తగ్గిపోయి తినడానికి పనికిరావు.
నివారణ: 
* గోదాములలో రంధ్రాలు లేకుండా మూసేయాలి.
* ఎరలు/బోన్లు సహాయంతో వాటిని నాశనం చేయాలి.
నిల్వ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
* గోదామును శుభ్రంగా ఉంచాలి.
* విత్తనం నిల్వ ఉంచే గోదాములలో పగుళ్ళు, రంధ్రాల్ని పూడ్చి సున్నం వేస్తే దాగి ఉన్న పురుగులు/ కీటకాలు చనిపోతాయి.
* పాత సంచులు వాడే ముందు 1 లీటరు నీటికి 100 మి.లీ. వేపద్రావణం కలిపి పిచికారీ చేసి వాడుకోవాలి లేదా 5% వేప కాషాయంలో ముంచి ఆరబెట్టిన తరువాత విత్తనాన్ని నింపుకోవాలి.
* నిల్వ ఉన్న పాత బస్తాలలో కలుపరాదు.
* నింపిన బస్తాలను నేల పైనే కాకుండా కొంచం ఎతైన చెక్క బల్లల పై ఏర్పాటు చేయాలి.
* రైతులు ఉత్పత్తి నిల్వ చేసేటప్పుడు, తగిన ధర రావడానికి గింజలలో తేమశాతం ఎప్పటికప్పుడు గమనించి మధ్యలో ఆరబెట్టకుంటూ గింజల్ని నిల్వ చేసుకున్నప్పుడు మార్కెట్‌కి అనువైన నాణ్యత ప్రమాణాలు క్షీణత ఉండకుండా రైతులు మార్కెట్‌ లో అధిక ధర లభించి నష్టం జరుగకుండా            ఉంటుంది.
కె. నీలిమ, యువ నిపుణులు (బయోటెక్‌ కిసాన్‌ హబ్‌ ), టి.స్వామి చైతన్య, శాస్త్రవేత్త (వాతావరణ విభాగం),
ఎస్‌. రామలక్ష్మి దేవి , శాస్త్రవేత్త (విస్తరణ విభాగం),  మరియు డా. ఎ. వీరయ్య, ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌, కే.వి.కే ఊటుకూరు, కడప.
Leave Your Comments

CM YS Jagan: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు- సీఎం జగన్‌

Previous article

Minimum Support Price: 14 పంటలను ఎంఎస్‌పితో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం హర్యానా

Next article

You may also like