Markup: రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం మరియు వారికి అవసరమగు ఎరువులను సరఫరా చేయడమే మార్కెఫెడ్ ముఖ్య ఉద్దేశం. మార్కెఫెడ్ సౌజన్యంతో ఏర్పడిన మార్కప్ సంస్థ ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతు పండించే ప్రతి ఉత్పత్తిని కొనుగోలు చేసేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు మంత్రి కన్నబాబు. మార్కప్ సంస్థ ఏర్పాటుతో రైతులకు మరింత మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన.
మార్కెఫెడ్ సౌజన్యంతో మార్కప్ ఏర్పాటు చేసి రిటైల్ రంగంలోకి ప్రవేశించామని తెలిపారు మార్కెఫెడ్ చైర్మన్ నాగిరెడ్డి. పాక్స్ , డిసిఎంఎస్ , ఎంప్లాయిస్ కూపెరటివ్ సొసైటీస్ , రైతు బజార్లు , డ్వాక్రా , ఎఫ్ పి ఓ లు వంటి సంస్థల ద్వారా క్రయ విక్రయాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్కప్ సంస్థ కేవలం రైతులు , ప్రజల సంక్షేమం కోసమే రిటైల్ రంగంలో దిగింది. రైతుల ఆర్థిక ప్రయోజనాలను మరింత పెంచేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అయన చెప్పారు. నాణ్యమైన, న్యాయమైన ధరతో మార్కప్ సంస్థ వినియోగదారులకు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నాం.
బియ్యం, కంది, పెసర, శెనగ, మిర్చి, పసుపు, చిరుధాన్యాలు తదితర ఉత్పత్తులు రైతుల నుంచి కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయిస్తాం. రైతు ఉత్పత్తులకు మంచి ధర తో పాటు వినియోగదారులకు కూడా తక్కువ ధరలో మరియు నాణ్యమైన ఉత్పత్తులు అందనున్నాయి. ఈ కార్యక్రమంలో మార్కెఫెడ్ చైర్మన్ నాగిరెడ్డి , ఎమ్మెల్సీలు తలశిల రఘురాం , లేళ్ల అప్పిరెడ్డి , ఉన్నతాధికారులు మధుసూదన్ రెడ్డి , అరుణ్ కుమార్ , ఇంతియాజ్ , అహ్మద్ బాబు , శ్రీధర్ ఇతరులు పాల్గొన్నారు.