Coriander భారతీయులు వంటకాల్లో విరివిగా వాడే ఆకుకూరల్లో కొత్తిమీర ఒకటి. కూరల్లో సువాసన కోసం ఎక్కువగా దీనిని వినియోగిస్తారు. శీతాకాలంలో కొత్తిమీర సాగుకు అనుకూలం.
మహిళలు ఇంటి వద్దనే కుండీలల్లో కూడా దీనిని పెంచుకుంటుంటారు. అయితే ఇటీవలి కాలంలో కొత్తిమీరకు ఆహారపదార్ధాల్లో వినియోగించటం పెరిగిన నేపధ్యంలో మార్కెట్లో దీనిని మంచి గిరాకీ పలుకుతుంది. ఈనేపధ్యంలో రైతులు చాలా మంది కొత్తి మీర సాగువైపు దృష్టిపెడుతున్నారు. కొత్తి మీర సాగులో సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టి తెగుళ్ల నుండి పంటను కాపాడుకుంటే మంచి ఫలసాయం లభిస్తుంది.
రసం పీల్చే పురుగుల నివారణ: కొత్తిమీర మొక్కల పెంపకంలో చీడ పీడల విషయానికొస్తే, రసం పీల్చే పురుగులు రావడానికి అవకాశం ఉంటుంది. మనం గమనించుకుని 12, 15 రోజుల మధ్యలోనే ఒకసారి 30 పీపీఎం వేప నూనె 5 మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవడం ద్వారా ముందు జాగ్రత్తగానే మనకు రసం పీల్చే పురుగులు రాకుండా ఉంటాయి.
తెల్ల దోమల నివారణ: తెల్ల దోమ గనుక ఎక్కువగా ఉంటే పసుపు జిగురు అట్టలు ఏర్పాటు చేస్తే తెల్ల దోమలు పసుపు జిగురు అట్టలకు అతుక్కుపోతాయి. దాంతో కొంత వరకు తెల్లదోమ ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా తగ్గి మనం కొత్త మీరను కాపాడుకుని మంచి నాణ్యమైనటువంటి ఆకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
బూజు తెగులు, వడ తెగులు నివారణ: మొక్కలకు బూజు తెగులు సోకితే డీనోక్యావను మొదటి తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ఒకసారి అలాగే పది రోజుల తరువాత మరోసారి పిచికారీ చేయాలి. వడ తెగులు వచ్చినట్లయితే హెక్టారుకు 5 కిలోల సూడోమోనాస్, ఫ్లోరిసెన్స్తో ఈ తెగులును నియంత్రించొచ్చు. ఒక వేళ గింజకు కొత్తిమీర మొక్క గింజ కట్టిన తరువాత బూజు తెగులు సోకితే 20 రోజుల తరువాత 500 గ్రాములు చొప్పున కార్చండిజం పిచికారీ చేసి నివారించొచ్చు.
మాగుడు తెగులు నివారణ: కొత్తిమీర మొక్కల పెంపకం సమయంలో మాగుడు తెగులు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఒక లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఆకు మచ్చ తెగులు నివారణ: ఆకు మచ్చ తెగులు ఎక్కువగా వస్తుంది కనుక దీనికి ఒక గ్రాము కార్చండిజమ్ను లీటరు నీటికి చొప్పున లేదా మాంకోజెట్ అయితే 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపిగాని వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు గనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఆకు మచ్చ తెగులును సమర్ధవంతంగా నివారించొచ్చు.
పేను బంక నివారణ: కొత్తిమీర మొక్కల పెంపకంలో తెగులు, పురుగులు నివారణకు సరైన చర్యలు తీసుకోవడం తప్పనిసరి. పేను బంక నివారణకు లీటరు నీటికి 2 మిల్లీ లీటర్ల మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ పిచికారీ చేయాలి.