Thailand Idle Cab: కోవిడ్ కారణంగా అందరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. కొవిడ్ ని అరికట్టే భాగంలో ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో కొందరు సమయాన్ని వృథా చేయకుండా ఇంటిని గ్రీనరీగా మార్చారు. పూలు, మొక్కలతో ఇంటిని తీర్చిదిద్దిన వారు కొందరైతే మరికొందరు ఇంట్లో సేంద్రియ పద్దతిలో కూరగాయలను పెంచడం ప్రారంభించారు. ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలను అందించే కూరగాయలను పెంచుతూ ఆదర్శంగా నిలిచారు.ఇలా కూరగాయల పెంపకంలో ఎంతో వినూత్నంగా ఆలోచించేవారిలో థాయిలాండ్ ప్రజలు కూడా ఉన్నారు. వారు అనుసరించిన పద్దతి చూస్తే ఇలా కూడా కూరగాయలను పండిస్తారా అన్న సందేహం కలుగుతుంది.
థాయిలాండ్ రైతులు విభిన్న పద్దతిలో కూరగాయలను పండించడం మొదలుపెట్టారు. కోవిడ్ కారణంగా ఆ దేశ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేసినప్పుడు ఆటో టాక్సీ డ్రైవర్ల కు ఎలాంటి గిరాకీ లేదు అని చెప్పాలి. దీంతో ఎంతో మంది టాక్సీ డ్రైవర్లు గ్రామాలకు వెళ్లి పోయారు. అయితే ఇందులో చాలామంది టాక్సీని ఇక్కడే వదిలేసి వెళ్లిపోవడం గమనార్హం. అయితే వదిలేసిన కార్లు తుప్పు పట్టి నాశనం అవుతాయని కార్లను ఏదైనా మంచి కోసం వాడాలని అక్కడి డ్రైవర్స్ కో ఆపరేటివ్ సోసిటీ భావించింది.
ఆ సంస్థ మట్టి నిలువ ఉండేలా చేసి కూరగాయలు పెంచడం మొదలు పెట్టింది. కార్లపై సాగు చేస్తున్న మొక్కలు చౌకవే. పెంచడమూ చాలా సులభమే. పండిన కూరగాయలను ఉద్యోగుల భోజనానికి వినియోగిస్తుంది ఆ సంస్థ. మిగిలిన కూరగాయలను మార్కెట్ కు తరలిస్తున్నారు. కార్లపై మిర్చి, వంకాయ, దోస, టమాటా, తులసి రకాలను పండిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇలా వదిలి వెళ్ళిన టాక్సీ లలో చాలా కార్లు పాడైపోయాయి అని అందుకే తాము మొక్కల పెంపకం చేపట్టినట్లు సదరు సంస్థ తెలిపింది. ఏమైనా ఐడియా మాత్రం భలే ఉంది అని అంటున్నారు నెటిజన్లు.