Cloned Buffaloes: కర్నాల్‌లోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్డిఆర్ఐ) శాస్త్రవేత్తలు క్లోనింగ్ (ఒకే రీతిలో సృష్టించడం) రంగంలో కొత్త విజయాన్ని సాధించారు. NDRIలో రెండు క్లోన్ చేయబడిన దూడలను (1 మగ & 1 ఆడ) తయారు చేశారు. ఇవి అధిక మొత్తంలో పాలను ఇచ్చే జన్యు సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ చర్య వల్ల దేశంలో పాల ఉత్పత్తి రెట్టింపు అవుతుందని, రైతుల ఆదాయం పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత ఈ టెక్నాలజీని రైతులకు అందజేయనున్నారు శాస్త్రవేత్తలు. కర్నాల్‌లోని నేషనల్ డైరీ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. క్లోనింగ్ రంగంలో ఇదొక ముందడుగు అని, శాస్త్రవేత్తల పరిశోధన సరైన దిశలో పయనిస్తున్నదని అన్నారు. ఇది కాకుండా భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో పశుపోషణకు ముఖ్యమైన స్థానం ఉందని ఆయన చెప్పారు. గేదె మొత్తం పాల ఉత్పత్తిలో 50% వాటాను అందిస్తుంది మరియు రైతుల జీవనోపాధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. క్లోన్ చేయబడిన జంతువుల నుండి వచ్చే వీర్యం పాల ఉత్పత్తిని రెట్టింపు చేస్తుంది.
గణతంత్ర దినోత్సవం రోజున పుట్టిన మగ దూడకు గంతంత్ర అని పేరు పెట్టారని, కర్నాల్ నగరం పేరు మీద ఆడ పిల్లకు కర్ణిక అని పేరు పెట్టారని డాక్టర్ చౌహాన్ చెప్పారు. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NDRI) 25కి పైగా క్లోన్ చేయబడిన జంతువులను ఉత్పత్తి చేసింది. వాటిలో 11 ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. క్లోన్ చేయబడిన 11 జంతువులలో ఏడు మగవి, మరియు వాటిలో మూడు స్పెర్మ్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. కాగా..ప్రస్తుతం క్లోన్ చేయబడిన జంతువుల మరణాల రేటును తగ్గించడంపై దృష్టి పెట్టారు శాస్త్రవేత్తలు. ఇది ఇప్పటికే 2010లో 1% నుండి దాదాపు 6%కి పెరిగింది.
ఎన్డిఆర్ఐ పరిశోధకుల కృషి దేశంలో పాల ఉత్పత్తిని పెంపొందించడంలో సహాయపడటమే కాకుండా, కృత్రిమ గర్భధారణ కోసం అద్భుతమైన నాణ్యమైన వీర్యం ఆవశ్యకతను తీర్చడంలో కూడా సహాయపడుతుందని ఎన్డిఆర్ఐ కర్నాల్ డైరెక్టర్ మన్మోహన్ సింగ్ చౌహాన్ అన్నారు.