Farmer Success Story: రసాయనిక ఎరువులతో సాగు చేయడం పాత పద్దతి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ సాగుపై శ్రద్ధ చూపిస్తున్నారు రైతులు. భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని పోత్సహిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దీనికి కావాల్సిన సహాయ, సహకారాలు అందిస్తున్నాయి. ఇక రైతులు కూడా సేంద్రియ సాగుపై మొగ్గుచూపుతున్నారు. మనదేశంలో సేంద్రియ వ్యవసాయంలో మధ్యప్రదేశ్ ముందంజలో ఉంది. రైతులందరూ తమ భూమిలో కొంత భాగం సేంద్రియ వ్యవసాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించడంతో ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కువభాగం సేంద్రియ సాగు నడుస్తుంది. బేతుల్ జిల్లాలోని బఘోలి గ్రామానికి చెందిన జైరామ్ గైక్వాడ్ అనే రైతు సేంద్రియ సాగు చేస్తూ ఆదర్శ రైతుగా నిలిచాడు.
జైరామ్ గైక్వాడ్ కు సొంతంగా 30 ఎకరాల భూమి ఉండగా అందులో కేవలం 10 ఎకరాల భూమిని సేంద్రీయ వ్యవసాయం చేస్తూ ఏటా రూ.35 లక్షలు ఆర్జిస్తున్నాడు. ఇలా వ్యవసాయం చేస్తే లాభం లేదని భావించే ఇతర రైతులకు ఇదో చక్కటి ఉదాహరణ. మధ్యప్రదేశ్‌లో 17 లక్షల హెక్టార్లకు పైగా సేంద్రియ వ్యవసాయం జరుగుతోంది. ఇక్కడ దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది రైతులు అలాంటి వ్యవసాయం చేస్తున్నారు. అందులో ఒకరు జైరామ్ గైక్వాడ్.
జయరాం ఐదెకరాల్లో చెరకు, రెండెకరాల్లో వర్మీ కంపోస్టు యూనిట్, గోశాల, పేడ గ్యాస్ ప్లాంట్, ఒకటిన్నర ఎకరాల్లో ఆర్గానిక్ గోధుమలు, మిగిలిన ఒకటిన్నర ఎకరాల్లో ఆర్గానిక్ కూరగాయలు సాగు చేస్తున్నారు. అతని గోశాలలో 55 ఆవులు ఉన్నాయి, దాని నుండి అతనికి ప్రతిరోజూ 150 లీటర్ల పాలు లభిస్తాయి. వాటి నుంచి కూడా బాగానే సంపాదిస్తున్నారు. జైరాం తన కృషితో ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలిచారు.
మధ్యప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఆర్గనైజేషన్, భోపాల్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత గత 15 సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్లు జైరామ్ చెప్పారు. తాను చెరకుతో సేంద్రీయ బెల్లం తయారు చేస్తున్నానని, మార్కెట్లో కిలో రూ.60 ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఉదయం వచ్చిన పాలను మార్కెట్లో విక్రయించి సాయంత్రం పాల నుంచి మావా, పనీర్, పెరుగు, మత్త వంటి వాటిని తయారు చేసి విక్రయిస్తున్నాడు. దీంతో అతనికి మంచి ఆదాయం వస్తుంది.
తాను సేంద్రియ ఎరువుగా వర్మీ కంపోస్ట్‌ను కూడా తయారు చేస్తున్నానని, వాటి విక్రయం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నానని, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నానని గైక్వాడ్ చెప్పారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి శాఖ అధికారులతో మమేకమై వ్యవసాయ రంగంలో వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తన సొంత పనిని, పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ పోతున్నానని చెప్పారు.
ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా జైరాం దగ్గర మార్గనిర్దేశం చేసేందుకు రావడం ప్రారంభించారు. ఎందుకంటే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. సరైన పద్ధతిలో రసాయన రహిత వ్యవసాయం చేస్తే రైతుకు నష్టం ఉండదని గైక్వాడ్ నిరూపించారు.