RGUKT బాసరలోని ఆర్జీయూకేటీ క్యాంపస్.. టెక్నాలజీని ఔపోసన పడుతున్న విద్యార్థుల్లో కొందరు కొత్త పంథాను ఎంచుకున్నారు. కళాశాల ప్రాంగణాన్ని వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. హలం పట్టి పొలం దున్నుతున్నారు. మదిలో గొప్ప ఆశయంతో ఉన్న నవయువతులంతా మడిలో నడుం వంచి పనుల్లో నిమగ్నమవుతున్నారు. వ్యవసాయ ఉపకరణాలు తయారు చేసి.. వాటి పనితీరును స్వయంగా తెలుసుకోవడానికి సాగుబాట పట్టారు.
అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుకు చేరువ చేయాలనుకున్నారు బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్) విద్యార్థులు. ‘టెకీస్ ఫర్ కర్షక్’ పేరుతో ప్రయోగాత్మక ప్రక్రియను ప్రారంభించారు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినులు, విద్యార్థులు ఈ యజ్ఞంలో భాగమయ్యారు. క్యాంపస్‌లో ఉన్న ఖాళీ స్థలాన్ని సాగుకు అనుకూలంగా మార్చారు. తమ సృజనాత్మకతకు.. పరిజ్ఞానాన్ని జోడించి అధునాతన పరికరాలు రూపొందించారు. పాడీ డ్రయ్యర్, ఫర్టిలైజర్ డ్రాపర్, సీడ్ షెల్లింగ్ మెషిన్ తదితర పరికరాలతో సాగుబడిలోకి దిగారు.
అరక పట్టగానే విద్యార్థినులంతా పల్లె పడుచులుగా మారిపోయారు. కొంగు నడుముకు చెక్కుకున్నారు. నారు పోశారు. నీరు పెట్టారు. అయిదెకరాల భూమిలో అయిదారు రకాల పంటలు పండించారు. వరి, పాలకూర, బచ్చలికూర, కొత్తిమీర తదితర పంటలు సాగు చేశారు. తాము రూపొందించిన పరికరాల పనితీరును ప్రత్యక్షంగా పరీక్షించారు. వీరి కృషి ఫలించింది. ఊహించనంత పంట పండింది. సమీప గ్రామాల్లోని రైతులను క్యాంపస్‌కు పిలిపించారు. తాము సాగు చేసిన విధానం గురించి వారికి బోధిస్తున్నారు. పరికరాల పనితీరును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన రైతన్నలు.. ఈ ఆడపిల్లల అకుంఠిత దీక్షకు జేజేలు పలుకుతున్నారు. చదువుకు సార్థకత చేకూరుస్తూ.. అన్నదాతకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
అంతఃప్రజ్ఞ పేరుతో గతనెలలో మూడు రోజులపాటు క్యాంపస్‌లో టెక్ ఫెస్టివల్-2020 నిర్వహించారు అధికారులు. విద్యార్థులు తయారుచేసిన వ్యవసాయ పరికరాల పనితీరును పరిశీలించటానికి, సాగులో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను ప్రత్యక్ష్యంగా తెలుసుకోవటానికి ఉద్దేశించిన ఈ పోటీల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం అయిదు ఎకరాల భూమిని ఇంజినీరింగ్ వారికి ఏడు భాగాలుగా, పీయూసీ వారికి రెండు భాగాలుగా పంచి సాగుపోటీని ప్రారంభించారు.