Farmer Success story: అనంతపురం జిల్లా రైతులు కూరగాయల సాగువైపు మళ్లుతున్నారు. తక్కువ ఖర్చు, శ్రమ తక్కువగా ఉండటంతో పాటు ప్రతి రోజు ఆదాయం పొందే అవకాశం ఉండటంతో రైతులకు కూరల సాగు కలసివస్తోంది.
జిల్లాకు చెందిన రైతు మిడతల గోవిందప్ప అరెకరం విస్తీర్ణంలో కూరగాయలు పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో పందిరి విధానంలో బీర సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సాగుదారు. వేరుశనగ సాగుతో పోల్చుకుంటే బీర సాగు బాగుందని ప్రతి రోజూ ఆదాయం అందుతోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: డాబాపై కూరగాయల పెంపకం..
ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కూరగాయల్లో బీర ఒకటి. అధిక డిమాండ్ కలిగి ఉండటంతో పాటు తొందరగా చేతికందే పంట బీర. తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం పొందే అవకాశం ఉండటంతో అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి గ్రామానికి చెందిన రైతు విడత గోవిందప్ప అరెకరంలో బీర సాగు చేస్తున్నారు.
20 వేల రూపాయల పెట్టుబడితో బీరసాగు చేశారు ఈ రైతు. శాశ్వత పందిరిని ఏర్పాటు చేసుకుని బీర పండిస్తున్నారు. నీటి సరఫరా కోసం డ్రిప్ పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పందిరి సాగుతో మొక్కలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా నాణ్యమైన బీర చేతికందుతోందని రైతు తెలిపారు. పంట వేసిన 35 రోజులకే కోతకు వస్తుందని అలా 90 రోజుల పాటు ప్రతి రోజూ కాయల దిగుబడి అందుతుందని రైతు తెలిపారు.
పంట విక్రయించేందుకు మార్కెట్‌పై ఆధారపడకుండా పొలం పక్కనే టోల్గేట్ ఉండటంతో అక్కడ చిన్న షాపును ఏర్పాటు చేసుకుని బీరను విక్రయిస్తున్నారు. కిలో40- 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం బీర సాగుతో వస్తోందని రైతు మిడతల గోవిందప్ప తెలిపారు. చలి కాలంలో తప్ప మిగిత అన్ని సీజన్లలో బీర సాగు చేసుకోవచ్చునని రైతు సూచిస్తున్నారు.
Also Read: మిశ్రమ సాగుతో అధిక ఆదాయం పొందుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి..