Minister Niranjan Reddy: 2014, 2019 బిజెపి మేనిఫెస్టోలో 60 ఏళ్లు పైబడిన రైతులకు, చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్ స్కీం తీసుకువస్తామని అన్నారు. కానీ ఏడేళ్లయినా దాని ఊసే లేదని విమర్శించారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్రం ప్రధానమంత్రి క్రిషి సంచయ్ యోజన కింద ఉద్యానపంటలలో సూక్ష్మసేద్యం పథకానికి కేవలం 33 శాతమే సబ్సిడీ ఇస్తున్నది కానీ తెలంగాణ ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం , ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీ ఇస్తున్నదని గుర్తు చేశారు మంత్రి.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్ధిక బడ్జెట్ పై (Union Budget 2022) మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్రం సబ్సిడీని పెంచాల్సిన అవసరం ఉన్నది. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలోహామీ ఇచ్చింది. గత ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఎన్ని సార్లు లేఖలు రాసినా, డిమాండ్ చేసినా స్పందన లేదు. పైగా మాట తప్పిన సర్కార్ 2014 నుండి వ్యవసాయానికి ఆదునిక సాంకేతికతను జోడిస్తామని, పంటరకాల అభివృద్దిని చేస్తామని చెబుతూ వస్తున్నారు. ఏడేళ్ల తర్వాత కూడా అదే మాటలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.
కేంద్ర విధానాలు ఇలా ఉంటే రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేది ఎప్పుడు ?
గత ఏడాది దేశంలో ఉత్పత్తి అయిన వడ్లు, గోదుమ పంటల సేకరణకు రూ.2.37 లక్షల కోట్లు రైతులకు చెల్లించినట్లు కేంద్రం బడ్జెట్ నివేదికలో వెల్లడించింది. ఇది దేశంలో పండే పంటలలో కేవలం వరి, గోధుమలకు దక్కింది 30 – 35 శాతమే. అంటే మిగతా పంటలకు మద్దతుధర దక్కడం లేదని కేంద్రమే ప్రకటించినట్లయిందని ఎద్దేవా చేశారు. నవంబరు 19న వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన ప్రధాని మోడీ ఎంఎస్ పీ పై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. బడ్జెట్ లో దాని ప్రస్తావన లేదు. రైతులు డిమాండ్ చేస్తున్నట్లు మద్దతుధర చట్టబద్దం చేస్తామన్న మోడీ హామీ అటకెక్కినట్లేనా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం, ఆహారశుద్ధి పరిశ్రమలు ఇవన్నీ ఎప్పటి నుండో చెబుతున్న పాతముచ్చట్లే కానీ వాటికి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవు. దేశంలో ఆహారపంటల ఉత్పత్తి 2020 – 21 లో 30.86 కోట్ల టన్నులు ఉంటే ..ఉద్యానపంటల ఉత్పత్తి 31 కోట్ల టన్నుల పైనే . ఈ పరిస్థితులలో ఆహార పంటలతో పాటు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ ఈ దిశగా ఎలాంటి చర్యలు లేవని విచారం వ్యక్తం చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి.
Also Read: ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ వల్ల రైతులకు తక్కువ ధరకే ఎరువులు
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకు మద్దతు ఇవ్వాల్సిన పథకం ప్రస్తావన లేదు. నేచురల్ ఫార్మింగ్ ..కెమికల్ ఫ్రీ ఫార్మింగ్…. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆహార అవసరాలు తీర్చడానికి ఏమాత్రం వెంటనే ఉపయోగపడకపోవచ్చు. ఇదే రైతుల యొక్క పెట్టుబడులు పెంచే ఎరువులు, రసాయనాల ధరల పెంపుపై కేంద్రం ఏ మాత్రం స్పందించకపోవడం ఎరువుల సబ్సిడీ విధానానికి గండికొట్టడమేనన్నారు. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఆహారశుద్ధి పరిశ్రమలు భారీగా ప్రోత్సహిస్తామని ఇన్ని రోజులకు కేంద్రం ప్రకటించింది. కెసిఆర్ ప్రభుత్వం మూడేళ్లక్రితమే ఈ దిశగా అడుగులు వేసిందని తెలిపారు మంత్రి.
పంట రుణాలు సంస్థాగత రుణాలు భారీగా పెంచి అతి తక్కువ వడ్డీకి ఇవ్వాల్సిన కేంద్రం ఆ బాధ్యత నుంచి తప్పుకున్నట్లు కనిపిస్తున్నది. బడ్జెట్ లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రస్తావన లేదు. ఈ పథకం రైతులకు ఉపయోగకరంగా లేకపోవడంతో అనేక రాష్ట్రాలు అమలు చేయడం లేదు. రైతులకు ఉపయోగపడే ఒక మేలైన ప్రత్యామ్నాయ భీమా పథకాన్ని తీసుకురావడంలో కేంద్రప్రభుత్వం విఫలమయిందని కేంద్రాన్ని నిలదీశారు మంత్రి నిరంజన్ రెడ్డి.
వంటనూనెలు, పప్పుగింజల దిగుమతులు తగ్గించుకునేందుకు ఆయిల్ పామ్, ఇతర నూనెగింజల పంటల సాగుకు, పప్పు గింజల సాగుకు బడ్జెట్ లో ప్రత్యేక ప్రోత్సాహం కరువయింది. పంట ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి గానీ, పంట ఎగుమతులకు అవసరమైన మౌళిక సదుపాయాల ఏర్పాటుకు గానీ, పంట కోత అనంతర చర్యలపై ప్రత్యేకంగా ఎలాంటి సహకారం, ప్రోత్సాహం ఈ బడ్జెట్ లో కనిపించడం లేదు. పంటల వైవిధ్యీకరణ గురించి కెసిఆర్ ప్రభుత్వం ఎప్పటి నుండో రైతులను చైతన్యం చేస్తున్నది. నూనె, పప్పుగింజల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నదని అన్నారు మంత్రి.
9 లక్షల ఎకరాలలో ఉన్న ఆయిల్ పామ్ సాగును 70 లక్షల ఎకరాలకు తీసుకెళ్తామని కేంద్రం ప్రకటించింది. కెసిఆర్ ప్రభుత్వం దీనిని ముందే గుర్తించి 20 లక్షల ఎకరాలలో సాగుచేయాలని ప్రణాళిక రచించి ముందుకు సాగుతున్నది. దీనికి బడ్జెట్ లో కేంద్రం నుండి సహకారం అందుతుందని భావించాం కానీ ఆ పరిస్థితి కానరావడం లేదన్నారు. ఆయిల్ పామ్ సాగు, ఆహారశుద్ది పరిశ్రమలు, నూనెగింజలు, పప్పుగింజల సాగు వైపు కెసిఆర్ ప్రభుత్వం మూడేళ్ల క్రితమే దృష్టి సారించింది. తెలంగాణ విధానాలను కేంద్రం అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నా బడ్జెట్లో మాత్రం మొండిచేయి కనిపిస్తున్నదని సీరియస్ అయ్యారు మంత్రి నిరంజన్ రెడ్డి.
అయిల్ పామ్ సాగు అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టం కోరడం జరిగింది. సూక్ష్మ సేద్య పరిమితులు ఎత్తేయాలని కేంద్రాన్ని కోరినా బడ్జెట్లో దానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ రంగ వృద్ది రేటు స్థిరంగా ఏడేళ్లపాటు కనీసం 12 శాతం ఉండాలి. కానీ అది ఎప్పుడూ 4 శాతానికి మించడం లేదు. నిన్నటి ఆర్థిక సర్వే కూడా ఇదే విషయం స్పష్టం చేసింది. బడ్జెట్ లో వ్యవసాయరంగం, రైతుల పట్ల కేంద్రం విధానాలు సానుకూలంగా లేకపోవడంపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.
Also Read: 2022-23 కేంద్ర బడ్జెట్ పై రైతుల ఆశలు