Farmer Success Story: చదివింది పిహెచ్డి విదేశాల్లో మంచి ఉద్యోగం వచ్చింది. కానీ కన్నవారిని ఉన్న ఊరును విడిచిపెట్టి ఉండలేక చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సొంతూరుకు చేరుకున్నాడు. వ్యవసాయం మీద మక్కువతో పంటల సాగుపైన ఆసక్తి పెంచుకున్నాడు. బీడువారిన భూముల్లో సేంద్రియ విధానాలను అనుసరించి పండ్ల తోటలను పెంచుతూ ఔరా అని అనిస్తున్నాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు జయరాం. ఎకరం 60 సెంట్ల విస్తీర్ణంలో 150 రకాల పండ్ల మొక్కలతో పాటు అరుదైన మొక్కలను పెంచుతూ ప్రయోగాల సాగుకు పెద్దపీట వేశాడు ఈ రైతు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ప్రస్తుతం ఉపాధికి వ్యవసాయమే ఉత్తమ ఎంపిక అవుతోంది. ఉన్నత చదువులు చదువుకున్న యువకులు సైతం అధిక సంఖ్యలో వ్యవసాయం వైపు వచ్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంటల సాగు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జయరాం కూడా అలాంటి వారిలో ఒకరు. పిహెచ్డి వరకు చదువుకున్న జయరాం విదేశాల్లో మంచి ఉద్యోగం ఉన్నా సొంతూరులో వ్యవసాయం చేయాలన్న మక్కువతో స్వగ్రామమైన సోంపేట మండలం జీడిపుట్టుగ గ్రామానికి చేరుకున్నాడు. సారవంతమైన నేలలకు బదులు వ్యవసాయాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న జయరాం బీడువారిని భూమిని ఎన్నుకుని సేద్యం మొదలు పెట్టాడు. అందరిలా అక్కడ సాగులో ఉన్న పంటలను పండించాలనుకోలేదు జయరాం. ప్రయోగాల సాగుకు శ్రీకారం చుట్టాడు. ఎకరం 60 సెంట్ల విస్తీర్ణంలో సుమారు 150 రకాల పండ్లతో పాటు ఇతర అరుదైన మొక్కలను పెంచుతూ ఔరా అని అనిపిస్తున్నాడు. మొదట అందరూ బీడు భూముల్లో పంటలు పండవని తెలిపినా మొండి పట్టు వీడలేదు ఈ రైతు.
Also Read: యంగ్ పాడి రైతు ‘శ్రద్ధ‘ సక్సెస్ స్టోరీ
స్థానిక వాతావరణానికి అనుకూలమైన పంటలు ఏమిటో గుర్తించి వాటిని దేశ విదేశాల నుంచి తెప్పించాడు. కాలిఫోర్నియా నుంచి బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, రాస్బెర్రీ మొక్కలను దిగుమతి చేసుకున్నాడు. స్థానికంగా లభించే పండ్ల మొక్కలతో పాటు బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ నుంచి వివిధ రకాల అరుదైన మొక్కలను సేకరించాడు. తన పొలంలో నాటాడు. మూడేళ్లుగా చేస్తున్న ఈ ప్రయోగాల సాగు సత్ఫలితాలను అందిస్తోందని రైతు చెప్పుకొస్తున్నాడు. పూర్తి సేంద్రియ విధానాలను అనుసరిస్తున్నానని చెబుతున్న ఈ రైతు రానునన్న రోజుల్లో మరిన్ని రకాల మొక్కలను పెంచుతానని తెలిపారు. జయరాం సాగు విధానాల గురించి తెలుసుకున్న రైతులు వ్యవసాయ క్షేత్రానికి వచ్చి పంటల తీరును పరిశీలిస్తున్నారు. జయరాం చేస్తున్న ప్రయోగాత్మక సాగు వారిని ఆకర్షిస్తోంది. ఉద్దానం ప్రాంతంలో ఇన్ని రకాల పంటలను బీడువారిన భూముల్లో పండిస్తుండటం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు. వ్యవసాయం దండగ అనే వారికి జయరాం ఓ స్పూర్తిగా నిలుస్తున్నాడు.
Also Read: నల్లమందు నుంచి నిమ్మగడ్డి సాగు – యాదవ్ స్టోరీ