Mango Farmers: ప్రతికూల వాతావరణంతో పూతకు రాని తోటలు, అకాల వర్షాలతో కోలుకోలేని దెబ్బశాపంగా మారిన మబ్బులు… పొగమంచు.
మామిడి సీజన్‌పై ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశే మిగిలేలా ఉంది
తోటలు పూతకు వచ్చి పిందెకట్టే సమయంలో వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్య మార్పులు రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డిసెంబరు ఆఖరు వారంలోనే పూర్తిస్థాయి పూతకు రావాల్సిన తోటలు ఇంతవరకు మొగ్గ కూడ కట్టక పోవడంతో దిగుబడిపై గుబులుపట్టుకుంది. చలితీవ్రతలో హెచ్చుతగ్గులు, అకాల వర్షాలు, రోజుల తరబడి మబ్బులతో పాటు పొగమంచు (మూడం) కమ్ముకొని ఉండటం, చీడపీడల దాడి లాంటి పరిణామాలతో పూత వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. ఆలస్యంగా పూతవచ్చినా అది పిందెకట్టదని చెబుతున్నారు.
రైతులు నవంబరు నుంచే వేల రూపాయల పెట్టుబడులు పెట్టి తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టారు. దున్నడం, ఎండు కొమ్మలు తొలగించడం, మందులు పిచికారి చేయడం, ఎరువులు వేయడంలాంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతికూల పరిస్థితులతో మామిడి రైతులు నిరాశలో మునిగిపోగా, ఈ పాటికే అడ్వాన్సుగా లక్షలు చెల్లించి తోటలు లీజుకు తీసుకున్న గుత్తేదారులు లబోదిబోమంటున్నారు.
జిల్లాలో 22 వేల ఎకరాల్లో సాగు
మామిడికి మంచిర్యాల జిల్లా పెట్టింది పేరు. జిల్లాలో వరి, పత్తి తరువాత ప్రధాన పంట మామిడే. జిల్లాలో 22 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఎక్కువ శాతం నెన్నెల, జైపూర్, చెన్నూరు. తాండూర్, మందమర్రి, కోటపల్లి, బెల్లంపల్లి మండలాల్లోనే ఉన్నాయి. దేశంలో లభించే అన్ని రకాల మామిడి పండ్లు ఇక్కడ లభ్యమవుతాయి. ఇక్కడి మామిడి కాయలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మామిడి పంటపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది నిరాశలో ఉన్నారు.
5 ఏళ్లుగా నష్టాలే
మామిడి రైతుల పరిస్థితి యేటేటా దిగజారిపోతోంది. ఒకప్పుడు మంచి దిగుబడితో ఆదాయం పొందిన రైతులకు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అతివృష్టి, అనావృష్టి, గాలిదుమారాలు, వడగళ్లవానలు, చీడపీడలు, తెగుళ్ల కారణంగా ఐదేళ్లుగా మామిడి రైతులు వరుస నష్టాలను చవిచూస్తున్నారు. ఈ ఏడు సైతం పంట వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు.
Also Read: భారత్ ఉత్పత్తులు మామిడి, దానిమ్మ అమెరికాకు ఎగుమతి
ప్రతికూల వాతావరణం…. చీడపీడల దాడి
మామిడికి వాతావరణం ప్రతికూలంగా ఉంది. చలితీవ్రత, రోజుల తరబడి మబ్బులు పట్టి ఉండటం, అకాల వర్షాలు లాంటి అంశాలు మామిడి పూతపై ప్రభావం చూపిస్తున్నాయి. మామిడి చెట్లు ఇప్పటికే పూర్తిస్థాయి పూతకు రావాల్సి ఉండగా.. ఈ సారి ఆలస్యం అయ్యేలా ఉంది. ఫిబ్రవరి రెండో వారంలోగా పూతకు వచ్చే అవకాశం ఉందని అధికారులంటున్నారు.
దీనికి తోడు రోజుల తరబడి మబ్బులు పట్టి ఉండటంతో తెగుళ్లు, చీడపీడల ఉధృతి పెరిగిపోయింది. తోటల్లో తేనెమంచు, బూడిద తెగుళ్ల, రసంపీల్చే పురుగులు కనిపిస్తున్నాయి. ఆకుమచ్చ, పూతమాడు, నల్లమచ్చ తెగుళ్ల ఉనికి ఉంది. బల్లిపాతర (బూజు) అధికంగా ఉందని రైతులంటున్నారు. ఈ తెగుళ్ల వల్ల దిగుబడిపై ప్రభావం పడుతుంది. పూత ఆలస్యంగా వచ్చినపుడు కాయ పెరుగుదల దశలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి పొడి వాతావరణం ఉంటుంది. రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టపరిచే అవకాశం ఉంటుందని నిఫుణులంటున్నారు.
Also Read: మామిడి తోటలలో కోత అనంతరం యాజమాన్య పద్దతులు