Rainfed Crops: ప్రస్తుత వాతవరణ పరిస్థితులు వివిధ వర్షాధార పంటల్లో పలు రకాల పురుగులు,తెగుళ్లు ఆశించడానికి అనుకూలంగా ఉన్నాయి.రైతులు తమ పైర్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన నివారణ చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ లోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.పి.లీలా రాణి తెలియజేస్తున్నారు. వివిధ పంటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు క్లుప్తంగా..
పత్తి పంటలో:
వర్షాధార పత్తి పంటలో ఇటీవల కురిసిన వర్షాలను ఉపయోగించుకొని రెండవ దపా, మూడవ దఫా, నాల్గవ దఫా పైపాటు నత్రజని,పోటాష్ నిచ్చే ఎరువులను 40, 60, 80 రోజుల తర్వాత పంటకు అందించాలి. కొన్ని చోట్ల పత్తిలో రసం పీల్చే పురుగులు కూడా ఆశించాయి. వీటి నివారణకు పురుగుల ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు 5 మి.లీ. వేపనూనె, పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 1.5 మి.లీ. మొనోక్రోటోఫాస్ లేదా 0.2 గ్రా. ఎసిటామిప్రిడ్ మందు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పిండినల్లి నివారణకు పొలం చుట్టూ ఉన్న కలుపు మొక్కలను నివారించాలి. 3 మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా 2గ్రా.ఎసిఫేట్ +1మి.లీ. ట్రైటాన్ లేదా శాండోవిట్ లేదా 0.5 – 1 గ్రా. సర్ఫ్ పొడి చొప్పున లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి. ప్రస్తుత వాతవరణ పరిస్థితుల్లో పొగాకు లద్దె పురుగు ఆశించే వీలున్నందున దీని నివారణకు గుడ్లు, పిల్ల పురుగులను జల్లేడాకులతో సహా సేకరించి నాశనం చేయాలి. ముందు జాగ్రత్తగా 5శాతం వేపగింజల కషాయాన్ని పిచికారి చేయాలి. 0.5గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.3 మి.లీ. ఫ్లూబెండమైడ్ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పత్తిలో కాండం తొలుచు ముక్కు పురుగు నివారణకు 2.5మి.లీ. క్లోరోపైరిపాస్ లేదా 2మి.లీ. ప్రోఫినోఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
మొక్కజొన్నలో:
మొక్కజొన్నలో కాండం కుళ్ళు తెగులు ఆశించే అవకాశముంది.దీని నివారణకు 1గ్రా. కార్బండజిమ్ లేదా 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ చొప్పున లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడిచేటట్లు పిచికారి చేయాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు 0.4 మి.లీ. క్లోరంట్రానిలిప్రోల్ లేదా 0.5 మి.లీ. స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారి చేయాలి.
సోయాచిక్కుడు:
సొయాచిక్కుడులో పొగాకు లద్దె పురుగు ఆశిస్తోంది.దీని నివారణకు 1 మి.లీ. నొవాల్యూరాన్ లేదా 2.5 మి.లీ. క్లోరోపైరిఫాస్ లేదా 1.5 గ్రా. థయోడికార్బ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.సోయాచిక్కుడులో తెల్ల దోమ నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్/ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వేరుశనగ:
వేరుశనగలో కాండం కుళ్ళు తెగులు నివారణకు 2 మి.లీ. హెక్సాకోనజోల్ చొప్పున లీటరు నీటిలో కలిపి మొక్కలు భాగా తడిచేలాగా పిచికారి చేయాలి.
మిరప:
మిరపలో వేరు పురుగు నివారణకు 2.5మి.లీ. క్లోరోపైరిఫాస్ లేదా 1గ్రా. ఇమిడాక్లోప్రిడ్ + ఫిప్రోనిల్ చొప్పున లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేలా పిచికారి చేయాలి. తామర పురుగుల నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్ లేదా 2మి.లీ. ఫిప్రోనిల్ లేదా 0.3గ్రా. థయోమితాక్సం లేదా 1 గ్రా. డైఫెన్ థయోరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నల్లి (కింది ముడత) నివారణకు 0.4గ్రా. ఎమమేక్టిన్ బెంజోయేట్ లేదా 1.5గ్రా. డైఫెన్ థయూరాన్ లేదా 1మి.లీ. స్పైరోమెసిఫెన్ లేదా 0.34మి.లీ.ఫెన్ ప్రోపాత్రిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
టమాట – బీర:
టమాట నారుమళ్ళలో నారు కుళ్ళు తెగులు నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు సార్లు నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి. బీర పంటలో రసంపీల్చే పురుగుల నివారణకు 2మి.లీ. డైమిథోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. బీరలో ఆకుమచ్చ తెగులు నివారణకు 3గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి 10రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.