తెలంగాణవార్తలు

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు

0

Weather Report : తేది 15.06.2024 (శనివారం) నుంచి 19.06.2024 (బుధవారం) వరకు

గ్రామీణ కృషి మౌసమ్ సేవ పథకం భారత వాతావరణ శాఖ, న్యూఢిల్లీ వారి
సహకారంతో వాతావరణ సలహాలను రాజేంద్రనగర్ లోని వ్యవసాయ వాతావరణ విభాగం అందించింది.ఆ వివరాలు ..

రాబోవు ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ (జూన్ 14 మధ్యాహ్నం 1  గంట ఆధారంగా):
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు ఐదు రోజుల్లో జూన్ 15 నుంచి జూన్ 19 వరకు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి.పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు,ఈదురు గాలుల (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.

వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు
రాష్ట్రంలోకి జూన్ 3వ తేదీన ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు జూన్ 12వ తేదీన రాష్ట్రమంతటా విస్తరించాయి.తేలిక పాటి నేలల్లో 50 నుంచి 60 మి.మీ.బరువు నేలల్లో 60 నుంచి 75 మి.మీ వర్షపాతం నమోదైన తరువాత లేదా నేల 15-20 సెం.మీ. లోతు తడిసిన తరువాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు,మొక్కజొన్న,జొన్న,కంది, పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి.
ఉరుములు,మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగలు, చెరువులు,నీటి కుంటలకు దూరంగా ఉండాలి.రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ జిల్లాలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు.పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు.
కొత్తగాపండ్లతోటలుపెట్టడానికిగుంతలుతవ్వుకోవాలి.వేరుశనగ,సోయాచిక్కుడు,జొన్న,పెసర,కంది,మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి.

వరిలో:
నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి రకాల (140-145 రోజులు) నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం.వరిలో 3 గ్రా. కార్బండాజిమ్ మందును కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.రైతులు తెలంగాణ సోన (RNR 15048) వరి విత్తనాన్ని జూన్ నెలలో నారుమడి పోసుకోకూడదు.వరి సాగు చేసే రైతులు వరిగట్లను శుభ్రంగా ఉంచుకోవాలి లేనట్లయితే గట్లమీద ఉండే కలుపు మొక్కలపైన కాండం తొలుచు పురుగు,అగ్గి తెగులు నివసించి వరి పంటను ఆశిస్తుంది.వరి మొక్కలను పోలిన ఊద,ఓడిపిలి గడ్డిజాతి కలుపు మొక్కల నివారణకు 7.5మి.లీ. సైహలోపాప్ పి- బ్యుటైల్ మందును 5లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వయస్సు గల వరి నారుమడిలో పిచికారి చేయాలి.
పత్తి:
పత్తి పంటను జులై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు.పత్తి వర్షాధార పంట కావున రైతులు వారికి అనుకూలమైన బిటి రకాలను బోదెలు,కాలువల పద్దతిలో విత్తుకోవాలి.ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా ఈ కాలువల ద్వారా నీటిని తీసివేయవచ్చు .
మొక్కజొన్న:
మొక్కజొన్న పంటను జులై 15 వరకు మధ్య,దీర్ఘకాలిక (90-100 రోజులు,100-120 రోజులు) రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకోవచ్చు.మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని,ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు,కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి.పంట విత్తిన 15రోజుల వ్యవధిలో కత్తెర పురుగు నివారణ చర్యలు చేపట్టాలి.
జొన్న:
జొన్న పంటను జూన్ 30వ తేదీ వరకు విత్తుకోవచ్చు. ఏకపంటగా లేదా కందితో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.
కంది:
కంది పంటను జులై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు.ఎకపంటగా లేదా పత్తి.మొక్కజొన్న,జొన్న,సోయాచిక్కుడు,పెసలు, మినుములతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.
పెసర, మినుము:
పెసర,మినుము పంటలను జులై 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు.వీటిని ఎకపంటగా లేదా పత్తి,కందితో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.వరి సాగు చేసే పొలాల్లో, ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాలలో పెసరను పైరుగా లేనిచో పచ్చి రొట్టగావిత్తుకోవాలి.
సోయాచిక్కుడు:
సోయాచిక్కుడు పంటను జులై మొదటి వారం వరకు విత్తుకునేందుకు అనుకూల సమయం.నీటి వసతి గల తేలికపాటి నేలల్లో కూడా సోయాచిక్కుడు సాగుచేయవచ్చు.ఎత్తు మడులు,కాలువల పద్ధతిలో విత్తుకున్నట్లయితే విత్తన మోతాదు తగ్గటంతోపాటు సరైన సాంద్రతలో మొక్కలు ఉండి,సాగు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు వస్తాయి.ఈ పద్ధతిలో భూమిలో ఎకువ తేమ నిలువ ఉండి పంట నీటి యద్దడిని తట్టుకుంటుంది.అదేవిధంగా ఎక్కువ నీటిని పొలం నుంచి తీసివేయటానికి కాలువలు ఉపయోగపడతాయి.
బత్తాయి, నిమ్మ:
కొత్తగా తోటలు పెట్టె రైతులు 60 సెం.మీ. పొడవు,వెడల్పు,లోతు గుంతలు తీసి,దానిలో 5కిలోల పశువుల ఎరువు,1కిలో సింగిల్ సూపర్ ఫాస్పేట్,100గ్రా. క్లోరిపైరిఫాస్ పొడి మందులను పై మట్టికి కలిపి గుంతలను నింపుకోవాలి. నాణ్యమైన మొక్కలు నాటుకోవాలి.

డా. పి.లీలా రాణి,ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ ) ,
వ్యవసాయ వాతావరణ విభాగం ,రాజేంద్రనగర్

Leave Your Comments

వర్షాధార పంటలు సాగుచేసే రైతులు ఈ సూచనలు పాటించండి !

Previous article

సోయాపాలను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా ?

Next article

You may also like