వార్తలు

Weather Apps For Farmers: రైతుసోదరులకు వాతావరణాధారిత సలహాలు మరియు సూచనలు

3
Agriculture Climate
Agriculture Climate
Weather Apps For Farmers: దేశంలో ఉన్న వ్యవసాయదారులకు వాతావరణ ఆధారిత సలహాలు మరియు సూచనలు నేరుగా తెలియజేయాలనే ఉద్దేశంతో వివిధ పంటలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించి, అధిక దిగుబడులను సాధించడం కోసం, రైతులకు సలహాలు, సూచనలను అదించడం కోసం, భారత వాతావరణ సంస్థ, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ, భారత శాస్త్ర సాంకేతిక విభాగం  మరియు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా జాతీయ మధ్యతరహా వాతావరణ సూచనలు (Weather Forecasts) అనే పధకాన్ని దేశవ్యాప్తంగా 1993 లో సంవత్సరంలో ఎంపిక చేసిన కేంద్రాలలో ప్రారంభించారు.
Weather Apps For Farmers

Weather Apps For Farmers

ఈ పధకం ద్వారా రైతులు రాబోయే 5 రోజుల్లో వాతావరణ పరిస్థితులను, వివిధ పంటలలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ముందుగానే తెలుసుకోవచ్చు. అదేవిధంగా రైతులకు మరింత ఉపయోగకరంగా ఉండేటట్లుగా అనంతపురం జిల్లా రైతులకు అనంతపురం కేంద్రంగా అత్యల్ప వర్షపాత మండలానికి వాతావరణాధారిత వ్యవసాయ సలహలను అందించే పథకాన్ని జూన్‌, 1996 నుండి ప్రారంబించారు.
ముఖ్య విధులు:
* ముందస్తు వాతావరణ సమాచారాన్ని (రాబోవు ఐదు రోజులకు) మరియు వాతావరణాధారిత వ్యవసాయ సలహాలను జిల్లాకు మరియు బ్లాక్స్‌ కు ప్రతి మంగళ మరియు శుక్రవారము అందచేయటం.
*వాతావరణ హెచ్చరికలు, ప్రకృతి వైపరీత్యాల గురించి రైతులకు తమ మొబైల్‌ఫోన్‌కు అందించడం
*రైతులకు వాతావరణాధారిత వ్యవసాయ సలహాలపై అవగాహన సదస్సులను నిర్వహించడం మరియు వాటి ప్రభావం యొక్క అభిప్రాయాలను సేకరించడం.
*వాతావరణాధారిత వ్యవసాయ సలహాల ప్రభావాన్ని అధ్యయనం చేయడం.
* వాతావరణ పరిస్థితులను అనుసరించి వివిధ వ్యవసాయ మరియు ఉద్యాన పంటల్లో యాజమాన్య పద్దతులను (విత్తే సమయం, విత్తన మోతాదు, పంట రకాలు, పంట మార్పిడి, కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, కీటకాలు, తెగుళ్ళ సస్యరక్షణ మరియు పంట కోత సమయం) గురించి తెలియజేయడం.
Agriculture Climate

Agriculture Climate

వాతావరణాధారిత వ్యవసాయ సూచనలు:
* రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించిన తరువాత, 60-75 మి.మీ వర్షం పడినట్లయితే వర్షధార పంటలను విత్తుకోవాలి.
* జూన్‌ 1 తర్వాత 60-75 మి.మీ. వర్షం పడినట్లయితేనే వర్షధార పంటలను విత్తుకోవాలి.
*ఎరువులు వేసే ముందు నేలలో తగినంత పదును ఉండాలి లేదా 20-25 మి.మీ. వర్షపాతం కురిసిన తర్వాత మత్రమే ఎరువులు వేసుకోవాలి.
* విత్తిన 48 గంటల లోపల పొలంలో తగిన తేమ చూసుకుని కలుపు మందును పిచికారీ చేయాలి.
* కలుపు మందులు మరియు క్రిమి సంహారక మందులు పిచికరీ చేసిన తర్వాత కనీసం 4-6 గంటలు వర్షం లేకుండా ఉండాలి.
*గాలి వేగం 15 కి.మీ. కంటే ఎక్కువ ఉంటే క్రిమి సంహారక మందులు మరియు  కలుపు మందులు పిచికారీ చేయరాదు.
*మేఘావృతమైన వాతావరణం ఉండి వర్షసూచన ఉంటే క్రిమిసంహారక మందులు పిచికారీ చేయరాదు.
*వాతావరణంలో అధిక తేమ, అధిక వర్షాల వంటి మర్పులునప్పుడు శిలీంధ్ర నాశినిలు వాడి తెగుళ్లను నివారించుకోవాలి.
* బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు పంట ఎదుగుదల, దశను బట్టి 2 శాతం యూరియా ద్రావణం, పొటాషియం నైట్రేటు లేదా మల్టీ-కె లాంటి పోషకాలను రెండు మూడు దఫాలుగా పిచికారీ చేయాలి.
* వర్ష సూచన ఉన్నచో నీటి తడులు ఇవ్వడం ఆపాలి.
* వరి నాటిన 4-5 రోజుల వరకు పిలకలు తొడిగే దశలో 2 సెం. మీ. నీరు పెట్టాలి.
*వరిలో అంకురం దశ నుంచి గింజ గట్టిపడే వరకు 5 సెం. మీ. లోతు నీరు పెట్టాలి.
* మొక్కజొన్నలో జల్లు మరియు పీచు దశలలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
* పత్తిలో విత్తిన 15 రోజులకు, అటు తర్వాత పూత దశకు వచ్చే ముందు వర్షాలు లేనట్లుయితే ఒకసారి నీరు కట్టాలి. పూత దశ నుంచి కాయ పెరిగే వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
* అనంతపురం జిల్లా వాతావరణ, వర్షపాత విశ్లేషణ ప్రకారం, వర్షాధార వేరుశనగ విత్తుకోవడానికి జూలై మాసం (1-31) అనువైన సమయము. రైతులు ముందుగా జూన్‌ నెలలో లేదా ఆలస్యంగా ఆగష్టు నెలలో పంట విత్తుకోవడం వలన కీలకదశలైన ఊడలు దిగే దశ, కాయ ఏర్పడే దశ, గింజ ఏర్పడే  దశల్లో సరిపడా వర్షపాతం లభించక పంట నీటి ఎద్దడికి గురై, దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఎక్కువ. కావున రైతులు వర్షాధార వేరుశనగ జూలై మాసంలో విత్తుకోవడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చును.
*వేరుశనగలో పూత దశ, ఊడలు దిగే సమయం, కాయ ఊరే సమయం, మరియు గింజ కట్టే దశలలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
* ప్రొద్దు తిరుగుడులో  మొగ్గ తొడుగు, పూత మరియు గింజ కట్టే దశలలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
*అపరాలలో పూత ముందు మరియు గింజ కట్టే దశలలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
* వివిధ పంటలలో అధిక దిగుబడులు సాదించడానికి పంట కీలక దశల్లో ఎర్ర చల్కానేలల్లో సుమారు 50 మి. మీ. మరియు నల్ల రేగడి నేలలకు 60 మి. మీ. చొప్పున నీరు ఇవ్వాలి.
ఇటివల కాలంలో సాంకేతిక, కమ్యునికేషన్‌ రంగాలలో వచ్చిన అభివృద్ధితో, ప్రజా జీవనంలో స్మార్ట్‌ ఫోన్‌ అమితమైన పాత్రను పోషిస్తున్నది. స్మార్ట్‌ ఫోన్‌ అప్లికేషన్‌ ద్యారా, ఎటువంటి సమాచారానైనా క్షాణాలలో అందరికి తెలియజేసే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని  రైతులు సకాలంలో వాతావరణ సూచనలను పొందడానికి మేఘడూట్‌, ధమిని మరియు వ్యవసాయ వాతవరణం లాంటి మొబైల్‌ఆప్‌ను  గూగుల్‌ ప్లే స్టోర్‌ నుండి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీని వలన రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం గురించి తెలుసుకొని పంటలకు యాజమాన్య పద్ధతులను పాటించడం సులభతరం అవుతుంది.
వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను రైతులకు త్వరితగతిన అందించడానికి, ఆచార్య ఎన్‌. జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధనా స్థానం,  అనంతపురములోని, అఖిల భారత సమన్వయ వ్యవసాయ వాతావరణ పధకం శాస్త్రవేత్తలు ‘‘వ్యవసాయ వాతవరణం’’ అనే ఆప్‌ తయారు చేయడమైనది. దీని ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు సంబందించిన రైతులు నేటి వాతావరణ సమాచారం, వాతావరణ సూచనలు,  వ్యవసాయ వాతావరణ సలహాలు, వాతావరణ  హెచ్చరికలు, గడచిన వాతావరణ సమాచారం మరియు ప్రశ్నలు/సమాధానాలు  కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను రైతులు ఉచితంగా డౌన్లోడ్‌ చేసుకొనవచ్చును.  రిజిష్టర్‌ చేసుకున్న రైతులు తమ సందేహాలకు సమాధానాలు కూడా తెలుసుకోవచ్చు.
ఈ విధంగా తయారు చేసిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను రైతులకు వ్యవసాయ వివిధ ప్రసార మాధ్యమాల ద్యారా జన బాహుళ్యంలోకి తీసుకెళ్లడానికి ఆకాశవాణి, దూరదర్శన్, వార్తా పత్రికలు, అంతర్జాలం, వాట్స్ యాప్ గ్రూపులు, వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు నేరుగా అందజేయడం జరుగుతుంది.
డా . కె. అశోక్‌ కుమార్‌, సీనియర్‌ శాస్త్రవేత్త (వ్యవసాయ వాతావరణ విభాగం) 
డా . జి.డి. ఉమాదేవి, రీసెర్చ్‌ అసోసియేట్‌ (వ్యవసాయ వాతావరణ విభాగం)
కె.వి.యస్‌. సుధీర్‌,  శాస్త్రవేత్త (వ్యవసాయ వాతావరణ విభాగం)
డా . బి. సహదేవరెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త అధిపతి                
వ్యవసాయ పరిశోధన స్థానం, అనంతపురం
Leave Your Comments

Care During Application of Chemical Fertilizers: రసాయన ఎరువుల వాడకంలో జాగ్రత్తలు

Previous article

Summer Crops: వివిధ వేసవి పంటలలో  విత్తన ఎంపిక – అనంతర చర్యలు

Next article

You may also like