Success Story Of lady Farmer Haritha: పెంచికల పాడు గ్రామానికి చెందిన హరితది చిన్న కారు రైతు కుటుంబం. 17 ఏళ్ల వయసులోనే అత్తారింట్లో అడుగిడింది. భర్త ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తోంది. అందరి మాదిరిగానే హరిత కుటుంబం కూడా రసాయన వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వ్యవసాయం ద్వారా వచ్చే చాలీ చాలని ఆదాయం వ్యవసాయ ఖర్చులకు, కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. చేసేదేమి లేక డ్రైవింగ్ లో అనుభవం కలిగిన హరిత భర్త విశ్వనాథ రెడ్డి డ్రైవరుగా పని చేస్తూ కొంత ఆదాయం పొందగలుగుతున్నాడు. హరిత కుటుంబం తమకు గల రెండు ఎకరాల పొలంలో పత్తి పండిస్తున్నారు. ఒకే పంట వేయడం వల్ల ఎప్పుడు ఎంత ఆదాయం వస్తుందో తెలియని అయోమయ స్థితి. వే డినీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు డ్రైవింగ్ వల్ల వచ్చే ఆదాయం కూడా కొంత పొలానికి వినియోగిస్తున్నారు. సహజ సిద్ధంగా రైతు పంటలో లాభం వచ్చినా రాకపోయినా పొలంనే నమ్ముకొని జీవిస్తుంటాడు. పొలం మాత్రం విక్రయించడు . అదే పంథాలో హరిత కుటుంబం అప్పుల జోలికి వెళ్లకుండా 1 లేదా 2 పంటల్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు . వ్యవసాయం తో పాటు 2 ఎద్ద్దుల్ని కూడా పోషిస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండెకరాల పొలం కలిగి ఉన్నా, డ్రైవింగ్ ద్వారా ఆదాయం వస్తున్నా , ఎద్దులను పోషిస్తున్నా హరిత కుటుంబంలో ఎలాంటి ఎదుగు బొదుగూ లేకుండా కాలం గడుస్తోంది. ఆర్థికంగా ఎలా ఎదగాలో అర్థం కాని పరిస్థితి లో వారు ఉన్నారు.
ప్రకృతి వ్యవసాయంలో అడుగు..
ఈ నేపథ్యంలో హరిత ప్రకృతి వ్యవసాయం పై గ్రామంలో APCNF సిబ్బంది చేస్తున్న ప్రచార కార్యక్రమాలను గమనిస్తూ వచ్చింది. ప్రకృతి వ్యవసాయం విధానం లో కలిగే ప్రయోజనాలను నిశితంగా పరిశీలిస్తూ వస్తోంది. గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ పొలాలను కూడా సందర్శించింది. డిగ్రీ దాకా చదువుకొన్న హరిత ప్రకృతి వ్యవసాయం గురించి పూర్తి తెలుసుకోగలిగింది. ప్రకృతి వ్యవసాయ విధానంలోని అంతరార్థం గ్రహించింది. ఎట్టకేలకు పెట్టుబడి తగ్గడం తో పాటు అనేక ఇతర ప్రయోజనాలు కలిగించే ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయం తీసుకొంది. హరిత ప్రకృతి వ్యవసాయం వైపు ఆకర్షితం కావడానికి 5 నెలల సమయం పట్టింది.
కానీ ఈ విషయంలో హరిత ఇంట్లో గెలవడానికి కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. భర్తను ఒప్పించడం హరితకు అంత సులభం కాలేదు. చివరకు తన భర్త ఒప్పుకోక పోయినా ఒక ఎకర పొలంలో ప్రకృతి వ్యవసాయం చేయడం ఆరంభించింది. మిగిలిన ఎకరా పొలంలో నీకు నచ్చిన పద్ధతిలో చేసుకోమని అల్టిమేటమ్ జారీ చేసింది. పోటీగా భర్త మిగిలిన ఎకరం పొలంలో రసాయన వ్యవసాయన్నే కొనసాగించాడు .
ఆచరించిన పద్దతులు
2022 జులై నెలలో పత్తి ప్రధాన పంటగా వేసిన హరిత సరిహద్ధు పంటగా జొన్న వేసింది. అంతర పంటలుగా నువ్వులు , పెసలు , అలుసంద, గోంగూర, ఆవాలు, బంతి పూలు వేశారు. పంటతో పాటు 400 కేజి ఘన జీవామృతం వేశారు. ప్రకృతి వ్యవసాయ ప్రోటోకాల్స్ ప్రకారం ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం వేశారు. పచ్చ దోమ నివారణ కోసం 4 సార్లు నీమాత్రం చేశారు. బీజామృతం తో విత్తన శుద్ధి కూడా చేశారు. హరిత కేవలం 13 వేల రూపాయల ఖర్చుతో ఎకరా పొలంలో 5.5 క్వింటాళ్ల పత్తి దిగుబడి సాధించగా హరిత భర్త 22 వేల రూపాయల ఖర్చుతో కేవలం 4 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి సాధించాడు. హరితకు ఖర్చు తగ్గి దిగుబడి పెరగగా భర్త చేసిన రసాయన వ్యవసాయానికి ఖర్చు పెరిగి దిగుబడి తగ్గింది. హరిత పత్తి పంటలో అధిక దిగుబడి సాధించడమే గాకుండా అంతర పంటల ద్వారా కూడా లబ్ది పొందింది. అంతర పంటల ఉత్పత్తులను గృహ అవసరాల కోసం వినియోగించింది.
ఈ ఏడాది ఇద్దరూ కలిసి ప్రకృతి వ్యవసాయం చేయాలని సంకల్పించారు. ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చి 1 ఎకరాలో ఆగస్టు 13, 2023 న 5 ప్రధాన పంటలు కంది, పెసర, మినుము, అలుసంద, జొన్న వేశారు. బయోడైవర్శిటీ కింద 20 రకాల అంతర పంటలను వేశారు. కేవలం 8600 రూపాయల ఖర్చుతో 49570 రూపాయల ఆదాయం సమకూరింది. తమ పొలంలో లభించే కంది పొట్టును మల్చింగ్ కోసం వినియోగించారు. ఈ ఏడాది (2024) ఫిబ్రవరి నెలలో రబీ డ్రై సోయింగ్ లో 20 రకాల పంటలు వేశారు. 3 పర్యాయములు ద్రవ జీవామృతం స్ప్రే చేశారు. తాజా గా ఏప్రిల్ 2024 లో మెంటార్ తో కలిసి నీటి సౌలభ్యం ఉన్న నాగలాపురం గ్రామంలో ఒక ఎకరా పొలం కౌలు కు తీసుకొన్నారు. అందులో ఒక్కొక్కరు 10 సెంట్ల విస్తీర్ణంలో ప్రయోగాత్మక నమూనా తో పాటు మిగిలిన విస్తీర్ణంలో ఏటీఎం మోడల్ వేయాలని నిర్ణయించుకొన్నారు.
ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగిన ప్రయోజనాలు
ప్రకృతి వ్యవసాయం వల్ల హరిత పొలంలో వానపాముల సంఖ్య పెరిగింది. నేల గుల్లబారి మృదువుగా తయారవడంతో తక్కువ వర్షపాతంలో కూడా మొలకలు వస్తున్నాయి. మొక్కల పెరగుదల బాగా కనిపిస్తోంది. హరిత పాటించిన ప్రకృతి వ్యవసాయ విధానాల వల్ల కలిగిన ప్రయోజనాలను గమనించి విశ్వనాథ రెడ్డి కూడా భార్య అనుసరిస్తున్న విధానాన్నే పాటించాలనే నిర్ణయానికి వచ్చేశాడు. ఈ ఏడాది నుంచి (2023) తను కూడా కూడా ప్రకృతి వ్యవసాయమే చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. హరిత ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆశించిన క్రమంలో తొలుత ఇబ్బందులు ఎదుర్కొన్నా భర్తను పూర్తిగా ప్రకృతి వ్యవసాయం వైపు తీసుకురావడంలో భర్తపై విజయం సాధించిందని చెప్పవచ్చు.
ముగింపు
“మొదట్లో తోటి రైతులు మా వ్యవసాయ పద్ధతులను చూసి హేళన చేసేవారు. కానీ మా పొలంలో, కుటుంబంలో వచ్చిన మార్పులను చూసి తోటి పొదుపు మహిళలు కూడా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల మాకు ఆర్థిక ప్రయోజనాలు కలగడమే గాకుండా నేల సారూప్యంలో కూడా తేడా కనిపిస్తోంది. నేల మృదువుగా మారడం వల్ల తేలికపాటి వర్షాలకు కూడా విత్తనం మొలకెత్తుతుంది. ఏక పంట విధానానికి స్వస్తి చెప్పి అనేక పంటలు వేయడం వల్ల నష్టం వస్తుందనే భయం లేదు. ప్రస్తుతం మా రెండు ఎకరాల పొలంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. రైతుల సంక్షేమమే గాకుండా సమాజం, వాతావరణం ఆరోగ్యంగా ఉండాలి అంటే అందరూ ప్రకృతి వ్యవసాయం చేయాలి” అని హరిత తన అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.
పేరు : హరిత
భర్త పేరు : విశ్వనాధ్ రెడ్డి
వయస్సు : 30
మొత్తం భూమి : 2 Acres
ప్రకృతి వ్యవసాయ విస్తీర్ణం : 2 Acres
వ్యవసాయం ఎప్పటినుంచి చేస్తున్నారు : 2012
ప్రకృతి వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు : 2019
RBK & గ్రామం పేరు : పెంచికలపాడు
చదువు : డిగ్రీ
నేల రకం : నల్ల రేగడి
నీటి వసతి: లేదు – వర్షాధారం
మండలం: గూడూరు
జిల్లా: కర్నూలు