Seed Cleaning in Chili Crop: వరి కి ప్రత్యామ్న్యాయ పంటలు పండిరచాలని అవగాహనతో ఈ ఖరీఫ్ లో ఇతర పంటల సాగు విస్తరించనుంది. దీనిలో మిరప ప్రధానమైనది. ఆంధ్రప్రదేశ్‌లో మిరపను 4.41 లక్షల హెక్టార్లలో సాగుచేస్తున్నారు. 5.14 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి,3468 కి./హె.తో భారతదేశంలోనే అత్యధిక ఉత్పాదకతతో ప్రధమ స్థానంలో ఉన్నది. అధిక వర్షాలు, వాతావరంలో అధిక తేమ కారణంగా వానాకాలంలో విత్తిన మిరపకు తెగుళ్లు మరియు వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది.
Also Read: Chilli cultivation: మిరప పంటకు కావాల్సిన అనుకూలమైన వాతావరణం
గత రెండు సంవత్సరాల నుండి వివిధ రకాల వైరస్ లు, తెగుళ్లు, రసం పీల్చు పురుగులు నారుమడి దశ నుండే నష్టపరుస్తున్నాయి. దీనికోసం విత్తన ఎంపిక, విత్తనశుద్ధి మరియు నారుమడి దశలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే ఆరోగ్యవంతమైన నారును పెంచడంతో పాటుగా మొలకలు నాటిన తర్వాత కూడా తక్కువ ఖర్చుతో మిరపను ఆశించే తెగుళ్ళు మరియు పురుగులను నివారించే అవకాశం ఉంతుంది. ఈ నేపధ్యంలో విత్తనశుద్ధి విధానం, నారుమడి దశలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు మరియు వివిధ పద్ధతుల్లో మిరప నారును పెంచే విధానాలను వివరించడం జరిగింది.
వివిధ చీడ పీడల నియంత్రణకు విత్తన శుద్ధి విధానం: చీడ పీడలు ఆశించని విత్తనం అధిక దిగుబడులకు మూలం. విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనం మరియు విత్తిన తరువాత నేల నుండి మొలకలకు సంక్రమించే తెగుళ్లు, చీడపురుగుల నుండి నారును సురక్షితంగా ఉంచడానికి సమర్ధవంతమైన పద్ధతి. మిరప విత్తనాలను తెగుళ్లు, చీడ పీడలు, వైరస్ కారకాలు ఆశించకుండా మూడు రకాలుగా విత్తనశుద్ధి చేసుకోవచ్చు.
మొదటగా వైరస్ తెగుళ్ళ నివారణకు 150 గ్రా. ట్రైసోడియం ఆర్థోపాస్ఫేట్ను ఒక లీటరు నీటిలో కరిగించి దీనిలో 20-25 నిమిషాలు నానబెట్టి తర్వాత నీటిని తీసివేసి మంచి నీటితో శుభ్రంగా కడిగి విత్తనాన్ని నీడలో ఆరబెట్టుకోవాలి. 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ కిలో విత్తనానికి ఏక రీతిగా కలపడం ద్వారా విత్తిన 20-25 రోజుల వరకు తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక వంటి రసం పీల్చే పురుగుల నుండి నారును రక్షించవచ్చు. విత్తనం ద్వారా వ్యాపించే బూజు తెగుళ్ళ నివారణకు 3 గ్రా. మాంకోజెబ్ లేదా దంప నారుమడి కోసం 1 గ్రా. కార్బండిజమ్ మందును కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.ట్రైకోడెర్మా విరిడె (5 గ్రా. కిలో విత్తనానికి) వంటి జీవ సంబంధ శిలీంధ్ర నాశకాలను ఎల్లప్పుడూ చివరగా మాత్రమే ఉపయోగించాలి.
సహజ సిద్ధంగా చీడ పీడలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. ప్రధాన పొలంలో నేరుగా విత్తడానికి ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. నర్సరీ లో నారు పెంచి ప్రధాన పొలం లో నాటుటకు సూటి రకాలకు 650 గ్రా, హైబ్రిడ్ రకాలైతే 75 నుండి 100 గ్రా. ల విత్తనం సరిపోతుంది. నారును వత్తుగా పెంచుకోకూడదు. ఒక సెంటు నారుమడికి 100 గ్రా. విత్తనం చల్లుకోవాలి.
మొక్క తొలి దశలో నారు కుళ్ళు తెగులు అధిక నష్టాన్ని కలుగ చేస్తుంది. ఇది ఆశించడం వలన విత్తనం మొలకెత్తదు లేదా మొలకెత్తిన విత్తనం మొదలు వద్ద కుళ్లిపోయి నారు దక్కదు. దీని నివారణకు వేప పిండిని, పూర్తిగా చివికిన పశువుల ఎరువును మాత్రమే వేసుకోవాలి. 15 సెం.మీ ఎత్తైన నారుమడిలో నారును పెంచుకోవాలి. నారుమడి ఎంచుకొన్న స్థలం ప్రతి సంవత్సరం మార్చుకొనుట ద్వారా భూమి ద్వారా సంక్రమించే శిలీంధ్ర వ్యాధుల నుండి నారుమడికి రక్షణ లభిస్తుంది. విత్తనంతో బాటు సెంటు నారుమడికి 80 గ్రా. ఫిప్రోనిల్ గుళికలను వాడి రసం పీల్చు పురుగులను నివారించవచ్చును. సెంటుకు ఒక కిలో వేప పిండిని వేయాలి. నారుమళ్ళలో విత్తనాలను 5-8 సెం.మీ. ఎడం, 1 సెం.మీ. లోతులో వరుసల్లో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన 9వ రోజు, 13వ రోజున కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపిన ద్రావణంలో నారుమళ్ళను తడపాలి. ఆరువారాల వయస్సుగల మొక్కలు ప్రధాన పొలంలో నాటుకోవాలి.
ఒక మీటరు వెడల్పు, 40 మీ. పొడవు, 15 సెం.మీ. ఎత్తుగల మడిలో ఒక ఎకరంలో నాటడానికి అవసరమైన నారు పెంచవచ్చు. ఎక్కువ నారును పెంచినపుడు, నేలను రెండు కంటే ఎక్కువ మడులుగా చేసి, మురుగు నీరు పోవుటకు వీలుగా 30 సెం.మీ. వెడల్పు గల మురుగు నీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ కాలువలను అవసరాన్నిబట్టి నీటిని తడుపుటకు బాటలు గాను, కలుపు ఏరివేతకు, సస్యరక్షణ చేపట్టుటకు వినియోగించవచ్చు.
ప్రోట్రేలలో మిరపనారును పెంచే విధానం: ప్రోట్రేల పద్ధతిలో పెంచిన నారు ఆరోగ్యంగా ఉండడమే గాక పెరుగుదల సమానంగా వుండి పంట ఒకేసారి కాపుకు వస్తుంది. దీనితో పాటు నారు దృఢంగా పెరగటంతో పాటు నారుకుళ్ళు మరియు వైరస్ తెగుళ్ళు ఆశించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక ఎకరా ప్రధాన పొలంలో నాటుటకు కావలసిన నారు కోసం 98 సెల్స్ కలిగినటువంటి 120 ట్రేలు సరిపోతాయి. ఒక్కో ప్రోట్రేను నింపుటకు దాదాపు 1.2 కిలోల కోకోపీట్ మిశ్రమం అవసరమవుతుంది. ఒక్కొక్క సెల్లో ఒక్క విత్తనం నాటుకొని కోకోపీట్‌తో కప్పుకోవాలి. ఈ విధంగా తయారుచేసుకున్న ట్రేలను ఒక దానిపై ఒకటి పేర్చుకొని పాలిథీన్ షీట్తో కప్పి ఉంచాలి.
ఆరు రోజుల తర్వాత మొక్క మొలకెత్తడం ప్రారంభమయ్యాక మొలకలను ఎత్తైన బెడ్లలోకి మార్చుకోవాలి. నీరును రోజ్ క్యాన్ లేదా మైక్రోజెట్స్ ద్వారా అందించవచ్చు.
ప్రోటీలను ఆరుబయట లేదా 50 శాతం నీడనిచ్చే షేడ్ నెట్లలో, 50/40 మెష్ ఉన్న కీటక నిరోధక నైలాన్ నెట్ ను, ప్రక్కలకు అమర్చుకోవాలి. ఇవి పురుగులకు నారుకు మధ్య అవరోధంగా పనిచేస్తుంది. ఆరు వారాల వయస్సు నారు ప్రధాన పొలంలో నాటుకొనుటకు సిద్ధం అవుతుంది.
జె. రాకేష్, కె. ప్రణయ్ కుమార్, డి. శివాని, టి. సృజన
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం
Also Read: Weed management in chilli : మిరప పంట లో కలుపు యాజమాన్యం