ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టిని ముంబై లోని ఎస్ బీ ఐ కేంద్ర కార్యాలయంలో సోమవారం ( డిసెంబర్ 2 న) ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆల్దాస్ జానయ్య కలిశారు. త్వరలో జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవంలో పాల్గొనవలసిందిగా ఉపకులపతి ఆల్దాస్ జానయ్య శెట్టిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్ బి ఐ చైర్మన్ రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సిఎస్ఐ ఆర్ నిధుల ద్వారా అడ్వాన్స్ డు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాబ్ తో పాటు ఆధునిక వ్యవసాయ ల్యాబ్ ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించడానికి సానుకూలత వ్యక్తం చేశారు. డిసెంబర్ 20, 21 తేదీల్లో జరిగే విశ్వవిద్యాలయ వజ్రోత్సవాల్లో ఎస్ బీ ఐ తరఫున ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొనే విధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలలో గడిపిన రోజులని ఉపకులపతితో పంచుకున్నారు.
ఉపకులపతి ఆల్దాస్ జానయ్యతో పాటు డీన్ ఆఫ్ అగ్రికల్చర్ జెల్లా సత్యనారాయణ ఎస్ బీ ఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టిని ముంబైలో కలిశారు.
Leave Your Comments