Blackgram Cultivation: కలుపు మొక్కల వల్ల పైరుకు చాలా నష్టాలున్నాయి. ఇవి పైరుకు అవసరమైన అన్ని పోషకాలను, నీటిని, సూర్యరశ్మితో సహా తీసుకొని పైరును సరిగ్గా పెరగనీయవు. పురుగులు (26 శాతం), (తెగుళ్ళు 20 శాతం), ఎలుకలు(21 శాతం) మొదలగు వాటి ద్వారా కలిగే నష్టం కన్నా కలుపు మొక్కల (5-100 శాతం) వలన వివిధ పంటలలో ముఖ్యంగా ‘‘మాగాణి మినుము’’లో ఎక్కువగా ఉంటుంది. పంట సమయంలో లేదా పంటకాలములో సుమారుగా మూడవవంతు సమయంలో కలుపును నిర్మూలించగలిగితే పంట దిగుబడికి ఎటువంటి నష్టం వాటిల్లదు. మాగాణి మినుములో కలుపును నిర్మూలించవలసిన కీలక సమయం విత్తిన 30 రోజుల వరకు ఈ కీలక సమయంలో కలుపుని నిర్మూలించకపోతే పైరుకు ఈ కింది నష్టాలు కలుగుతాయి.

Black Gram Cultivation
ముఖ్యంగా..
1. పంట నాణ్యత, దిగుబడి తగ్గుతుంది. (50- 70 శాతం)
2. పోషక పదార్థాల నష్టం వాటిల్లుతుంది. మాగాణి మినుములో ఎకరాకు నత్రజని 8.4, భాస్వరం 2.8 మరియు 12 కిలోల పొటాష్ నష్టం వాటిల్లుతుంది.
3. చీడపురుగులకు, తెగుళ్ళకు మరియు సూక్ష్మజీవులకు ఆశ్రయాన్నిస్తుంది. ముఖ్యంగా పరాన్నజీవ జాతికి చెందిన బంగారుతీగ ఉన్న పొలంలో మినుము పండిరచడం కుదరక పంటమార్పిడి చేయవలసి ఉంటుంది.
వరికోత తరువాత నేలలో మిగిలి ఉన్న తేమ, భూసారాన్ని ఉపయోగించుకుని మినుము పెరుగుతుంది. రబీ మాగాణి మినుముసాగు ప్రత్యేకించి కోస్తా జిల్లాలలో వరికోయడానికి 2,3 రోజుల ముందు వరి పైరులో పొడి విత్తనం లేదా నానబెట్టిన మినుము చల్లి తరువాత వరికోస్తారు. ఈ పద్ధతిలో భూమిని తయారుచేయుట, ఎరువులు వేయుట, కలుపు తీయుట, అంతరకృషి చేయుట మరియు నీరు కట్టడం లాంటి పద్ధతులు వీలుకావు. మెట్ట మినుము కన్నా మాగాణి మినుములో కలుపు సాంద్రత ఎక్కువ. పైరు మొక్కల సాంద్రత తక్కువ. పంట చివరి దశ వరకు తేమ ఉండదు .
పైన విశదీకరించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని మంగాణి మినుములో ఇన్ని రకాలుగా నష్టాన్ని కలిగిస్తున్న కలుపు మొక్కలను రైతులు వివిధ పద్ధతుల ద్వారా నిర్మూలించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పవలసిన అవసరం లేదు.

Weed Management in Blackgram Cultivation
1. కలుపు రాకుండా పాటించవలసిన జాగ్రత్తలు:
* స్వచ్ఛమైన అధిక దిగుబడినిచ్చే సరైన వంగడాలను, సరైన మోతాదులో సకాలంలో విత్తుకోవాలి.
* పంట మార్పిడిని పాటిస్తే మంచిది .
* వ్యవసాయ పనిముట్ల ద్వారా కలుపు విత్తనాలు వ్యాప్తి చెందకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
2. కలుపు వచ్చిన తరువాత పాటించవలసిన నివారణ చర్యలు:
వరి పనలు తీసే సమయంలో మినుము మరియు కలుపు రెండూ మొలచి ఉండడం వలన కలుపు మొలవక ముందే వాడే రసాయనాలను వాడటం కుదరదు. ఇన్ని సమస్యలుండటం వలన మాగాణి మినుములో పంట దిగుబడి 50 శాతం వరకు తగ్గుతుందని పరిశోధనల అంచనా.
Also Read: మినుముల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఊద, గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు: (ఎకరాకు)
* 400 మి.లీ. క్విజలోపాప్ ఇథైల్ 5 శాతం ద్రావకం (లేదా)
* 250 మి.లీ. పెనాక్సాప్రాప్ ఇథైల్ 9 శాతం ద్రావకం (లేదా)
* 250 మి.లీ. ప్రొపక్విజపాప్ 10 శాతం ద్రావకం ఏదో ఒక దానిని 200 లీటర్ల నీటిలో కలిపి పంట విత్తిన 15-20 రోజుల తరువాత స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన 10 రోజులలో కలుపు చనిపోతుంది.

Black Gram Growing and Cultivation Practices
2. ఊద మరియు వెడల్పాటి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు: (ఎకరాకు)
* 20మి. ఇమిజాతాఫిర్ 10 శాతం ద్రావకం 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 15-20 రోజుల తరువాత పిచికారీ చేయాలి. లేదా 20-30 రోజుల తరువాత 300 సోడియం సాల్ట్ ఆఫ్ ఆసిప్లోరోఫెన్ 16. 57 ప్లస్ క్లాడినోపాప్ ప్రొపార్జిల్ 8 శాతం ద్రావకం 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
3. బంగారు తీగ ఎక్కువగా ఉన్నప్పుడు: (ఎకరాకు)
పొలంలో వరిపంటను తీసి వేసిన వెంటనే (లేదా) మరుసటి రోజు 15 నుండి 2 లీటర్ల పెండిమెధాలిన్ 30 శాతం ద్రావకం, 20 కిలోల పొడి ఇసుకలో కలిపి సాయంత్రం సమయంలో పొలంలో సమానంగా చల్లాలి. తరువాత 200 లీ. నీటిని పిచికారీ చేయాలి. దీనివలన 60-70 శాతం వరకు నిర్మూలించవచ్చు. లేదా 200 మి.లీ. ఇమిజితాఫిర్ 10 శాతం ద్రావకం 200 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి. తద్వారా 50-60 శాతం వరకు దీనిని నిర్మూలన చేయవచ్చు.
4. రంగం మినుము (పిచ్చి మినుము) ఎక్కువగా ఉన్నప్పుడు:
పైరు విత్తిన 25-30 రోజులప్పుడు లేదా కలుపు 4-5 ఆకులదశలో 400 మి.లీ. సోడియం సాల్ట్ ఆఫ్ అసిఫ్లోర్పెన్ 16.5 శాతం ప్లస్ క్లాడిన్పాఫ్ ప్రొపార్జిల్ 8 శాతం మిశ్రమాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఎక్కువ మోతాదులో స్ప్రే చేస్తే పైరు కొంచెం ఎర్రబడి పైరు పెరుగుదల వారం రోజులు ఆగుతుంది.
హెచ్. అరుణకుమారి, ఎ. శివకుమార్
Also Read: వేసవిలో మినుము సాగు-యాజమాన్య పద్దతులు