Integrated Plant Protection in Chilli Crop: ప్రపంచ వ్యవసాయ మార్కెట్ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పుల దృష్ట్యా ఇతర దేశాలతో పోటీ పడాలంటే మన రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులతో సాగు చేసి ఎగుమతులకు అనువైన నాణ్యమైన మిరప పండించాలి. తగ్గిన సేంద్రియ ఎరుపుల వాడకం, అధిక మోతాదులో రసాయన ఎరువుల వాడకం, అవసరానికి మించి, విచక్షణా రహితమైన పురుగు మందుల వాడకం వంటివి మిరప పంట నాణ్యతకు ప్రధాన అవరోధాలుగా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో వచ్చే పురుగులు, తెగుళ్ల యాజమాన్యం వంటి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి.
మిరప పంటను ఆశించే పురుగులు:
రసం పీల్చు పురుగులు: తామర పురుగులు ఆకు అడుగు భాగంలో గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు అంచుల వెంబడి పైకి ముడుచుకు పోతాయి. దీనినే పై ముడత అంటారు. తామర పురుగులు లేత కాయల్ని గీకటం వల్ల కాయల మీద చారలు చారలుగా (పొలుసు) ఏర్పడుతుంది.
తెల్ల నల్లి పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసం పీల్చడం వల్ల ఆకులు వెనుకకు ముడుచుకుపోయి, తిరగ వేసిన పడవ ఆకారంలో కనిపిస్తాయి.దీనినే కింద ముడత అంటారు. దీని వల్ల ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చ రంగులోకి మారతాయి.
పేనుబంక పురుగులు ఆకులు, లేత కొమ్మలను ఆశించి, రసం పీల్చడం వల్ల మొక్కల పెరుగుదల తగ్గి గిడసబారతాయి. ఈ రసం పీల్చు పురుగులు నేరుగా మొక్కలకు నష్టం కంటే ప్రమాదకరమైన వైరస్ తెగుళ్ళను వ్యాప్తి చేయడం ద్వారా ఎక్కువ నష్టాన్ని కలుగ చేస్తాయి.పేనుబంక ఎక్కువగా ఆశించటం వల్ల ఆకులు, కాయలు పైన నల్లటి మసి పూసినట్లు మారిపోతాయి.
సమగ్ర యాజమాన్యం:
* కిలో విత్తనానికి 8 గ్రా.ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ది చేసి విత్తుకోవాలి. ముడత ఆశించని ఆరోగ్యవంతమైన నారును మాత్రమే నాటుకోవాలి.
* సాధ్యమైనంత వరకు నారుమడిలో గాని, ప్రధాన పంటలోగాని పిఫ్రోనిల్ గుళికలు, వేప పిండి సిఫారుసు మేరకు వేసి పై ముడతను, పేనుబంక పురుగులను అరికట్టాలి.
* నాటే ముందు నారుని 10 లీ. నీటికి 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి.
* రసం పీల్చే పురుగులను సమర్ధవంతంగా నివారించాలంటే పురుగు మందులు ఆకుల అడుగు భాగాన బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
* పొలం చుట్టూ రెండు, మూడు వరుసల్లో జొన్న,మొక్కజొన్న వంటి రక్షక పంటలను వేసినట్లయితే రసం పీల్చే పురుగులు నియంత్రణలో ఉంటాయి. మిత్ర పురుగుల సంఖ్య కూడా పెరుగుతుంది.
* 5% వేప గింజల కాషాయం లేదా వేప నునేను పురుగు మందులలో కలిపి పిచికారి చేయడం వల్ల పురుగులను సమర్థంగా నివారించవచ్చు.
* తామర పురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
* తెల్లనల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రా./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
* పై ముడత, కింది ముడత రెండు ఉన్నప్పుడు డైఫెంథియురాన్ 1.5 గ్రా. లేదా క్లోరోఫెనఫైర్ 2 మీ.లీ. లేదా స్పైరోమెసిఫిన్ 0.8 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
* పేను నివారణకు ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా.లేదా థయోక్లోప్రిడ్ 0.6 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రెడ్ 0.3 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
Also Read: Horticulture: ఉద్యాన పంటల సాగుదార్లకు శాస్త్రవేత్తల సూచనలు
పూతపురుగు: పూత పురుగు మొగ్గ దశలో ఆశిస్తే పూత ఎండి, రాలిపోతుంది. ఈ పురుగు ఆశించటం వల్ల దాదాపుగా 40% వరకు పూత రాలిపోతుంది. పిందె దశలో ఆశిస్తే, కాయలు వంకర్లు తిరిగి గిడసబారతాయి. కాయలు గిడసబారి ఆకృతి మారిపోయి వంకరలు తిరిగి ఉండటం వల్ల నాణ్యత కోల్పోయి మార్కెట్ ధర పలకదు. ఈ పురుగు నివారణకు వేపనూనె 10000 పి.పి.యం. 3 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రనిలిప్రోల్ పిచికారి చేయాలి.
కాయతొలుచు పురుగులు: మిరపను ప్రధానంగా పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, పచ్చరబ్బరు పురుగులు ఆశిస్తాయి. పురుగుల ఉధృతి ఎక్కువైనప్పుడు పంట నష్టం ఎక్కువగా ఉంటుంది.
* పురుగుల ఉధృతి తగ్గించడానికి మిరపను మొక్కజొన్న,సోయాచిక్కుడు, మినుము,పెసర పంటల్లో పంట మార్పిడి చేయాలి.
*ఆముదం, బంతి వంటి ఎరపంటలను పొలంలో అక్కడక్కడా నాటుకోవాలి. కలుపు లేకుండా చూడాలి.
* ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చి, పురుగు ఉనికిని, ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
* ఎదిగిన లార్వాలను, గుడ్ల సముదాయాన్ని గమనించి, ఏరి నాశనం చేయాలి.
* ఎకరానికి 10-15 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసినట్లయితే పక్షులు గొంగళిపురుగలను ఏరుకొని తింటాయి.
* 0.75 మి.లీ. నోవాల్యురాన్ లేదా 0.25 మి.లీ. స్పైనోసాడ్ లేదా 2 మి.లీ. క్లోరోఫెనఫైర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వేరు పురుగు: మొక్కల మొదళ్ళ వద్ద తవ్వి చూసినట్లయితే వేరుపురుగును గమనించవచ్చు. వేరు పురుగు ఆశించటం వల్ల మిరప తోటల్లో గుంపులుగా మొక్కలు చనిపోవడం గమనించవచ్చు. వేరు పురుగు నివారణకు కార్బోఫ్యురాన్ గుళికలను ఎకరాకు 10-12 కిలోలు వేప పిండితో కలిపి వేయాలి.
డా వి.యుగంధర్, డా.ఇ.చండ్రాయుడు,
కృషి విజ్ఞాన కేంద్రం,
కళ్యాణ దుర్గం,
ఫోన్:9676123407
Also Read: Minister Atchannaidu: పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు