వార్తలు

Dairy Industry Establishment: పాడి పరిశ్రమ స్థాపనకు ముఖ్య సూచనలు

3
Dairy Industry Establishment
Dairy Industry Establishment
Dairy Industry Establishment: ‘‘కష్టే ఫలి’’ అన్నారు పెద్దలు. పాడి పరిశ్రమలో అయినా మరే పనిలో అయినా కృషి చెయ్యకుండా రాణించలేము.
  • ముఖ్యంగా పాడి పరిశ్రమ ఒక సున్నితమైన పరిశ్రమ. ఈ వ్యాపారం చేపట్టేవారు, నౌకర్ల పైన ఎక్కువగా ఆధారపడకుండా, స్వయంగా కష్టపడటానికి, పర్యవేక్షించటానికి, సమయాన్ని వెచ్చించటానికి సిద్ధంగా వుండాలి. పాడి పరిశ్రమ స్థాపనకు ఇదే తొలి సూచన.
  • రెండవది మార్కెటింగ్‌ అంటే పాలను అమ్ముకోటానికి గల అవకాశాలను పరిశీలించుకోవాలి. అలాగే ఆ ప్రాంతంలో పాల వినియోగానికి ఉన్న గిరాకీ (డిమాండ్‌) ని సరిగ్గా అంచనా వేసుకోవాలి. ఆవు పాలు లేదా గేదె పాలు, దేనికి ఆ ప్రాంతంలో ఆదరణ ఉందో గుర్తించాలి.
  • పాలను ఉత్పత్తి చేసిన ప్రదేశం నుండి అమ్ముకునే ప్రాంతాలకు చక్కటి రోడ్డు మార్గాలు, రవాణా సౌకర్యాలు ఉండాలి.
  • ఈ మూడు ప్రాథమిక అంశాలపైన, పాడిపరిశ్రమ ప్రారంభించేవారికి అంగీకారం, అవగాహనుండాలి.
Dairy Industry Establishment

Dairy Industry Establishment

పాడిపరిశ్రమను ఎవరెవరు చేపట్టవచ్చు? 
నిరుద్యోగ యువత, స్వయం సహాయ సంఘాల సభ్యులు, ప్రోగ్రెసివ్‌ ఫార్మర్స్‌, విశ్రాంత ఉద్యోగులు, ప్రగతిశీల రైతులు/ఔత్సాహికులు,  సహకార సంఘాలు, పిపిపి ద్వారా కార్పోరేట్‌ సంస్థలు, ఎన్‌జిఓ లు
పాడి పరిశ్రమలో మహిళలు:
ఒకటి రెండు పాడిపశువులతో, గృహావసరాలకు పాలను అమ్మటం నుండి, పెద్ద పెద్ద డైరీలను నిర్వహించటం వరకు మహిళలు ఈ రంగంలో రాణిస్తున్నారు. వ్యాపారాన్ని చక్కగా అభివృద్ధిచేసి, ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నవారు ఉన్నారు. పశువులను కడగటం, పాకల పరిశుభ్రత, పాలు పితకటం, పాలు అమ్మటం, గడ్డి కోసుకురావటం మొదలైన పనులు అన్నీ మహిళలు సహజంగానే నిర్వహిస్తూ ఉంటారు. పాడి పరిశ్రమలో ఇది వారికి కలిసొచ్చే అంశం. కాబట్టి ఉపాధిని పొందటానికి మహిళలు సైతం పాడిపరిశ్రమను నిస్సందేహంగా ఎంచుకోవచ్చు.
పాడి పరిశ్రమ ప్రారంభించటానికి కావలసిన సౌకర్యాలు – అవసరాలు
పాడి పరిశ్రమ ప్రారంభించటానికి ఈ క్రింది అవసరాలు, సౌకర్యాలు కావాలి. భూమి, పెట్టుబడి (సొంత డబ్బు లేదా రుణం), వసతి, మేపు సౌకర్యం,  యాజమాన్యం పైన అవగాహన, ఆచరణ, మేలు జాతి పశువులు

Also Read: మిద్దెతోటలో ఎండాకాలంలో ఏమి మొక్కలు పెంచుకోవచ్చో తెలుసుకుందాం 

1.భూమి:
  • పాడి పశువుల పెంపకానికి (పాడి పరిశ్రమ స్థాపించడానికి) విశాలమైన భూమి కావాలి. పాలు అమ్ముకొనే ప్రాంతానికి అతి దగ్గరగా ఉండే స్థలమై ఉండాలి. పాలు పితికిన గంటలోగా మహా అయితే రెండు గంటలలో వినియోగదారుడికి లేదా కొనుగోలు దారుడుకి పాలు చేరిపోయేలా ఉండాలి. అంతకు మించి ఆలస్యం అయితే పాలు చెడిపోతాయి. పశువులకు వసతితో పాటు, పశుగ్రాసాల సాగుకు కూడా స్థలం ఉండాలి.
  • డైరీలో లాభాలు, అనుభవం వచ్చిన తరువాత, డైరీని మరింత పెంచుకోవాలని అనిపించవచ్చు. అదికూడా దృష్టిలో పెట్టుకొని, ముందు చూపుతో, వీలైనంత ఎక్కువ స్థలాన్ని కేటాయించుకోవాలి.
  • కాస్త పెద్దడైరీలను నిర్వహించాలనుకునేవారు పశువులకే కాక, పనిచేసే వారికి కూడా వసతి అక్కడే ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అలాగే దాణా నిలువ చేసుకోటానికి, పరికరాలను ఉంచటానికి చిన్న చిన్న గదులు ఏర్పాటు చేసుకోవలసి వుంటుంది. వీటన్నిటికి కూడా స్థలం సరిపోవాలి.
  • పెద్దడైరీలను పక్కాగా శాస్త్రీయంగా నిర్వహించాలనుకుంటే, దూడలకి, చూలు పశువులకి, పెయ్యలకి, కోడెలకి, పాలిచ్చేవాటికి వట్టిపోయిన వాటికి, ఎడ్లకి, జబ్బు పడ్డవాటికి ఇలా ఒక్కో రకానికి ఒక్కొక్క షెడ్‌ విడివిడిగా నిర్మించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తరహా పాడి రైతులు, స్థలం సమకూర్చుకొనేటప్పుడు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.
  •  డైరీ ఉన్న స్థలంలో రోడ్లు, విద్యుత్‌ సరఫరా, నీటి సరఫరా, రవాణా సదుపాయాలు ఉండాలి. చికిత్సకు వైద్య కేంద్రాలు దగ్గరలో ఉండాలి. చెరువులు, కాలువలు దగ్గరలో వుంటే మరీ మంచిది. బోరు సౌకర్యం తప్పని సరి.
  • డైరీకి కేటాయించిన స్థలం చుటూ కంచె లేదా ప్రహరీగోడ వుండాలి. రెండు మూడు వరుసలలో సుబాబుల్‌ చెట్లు నాటాలి.
2. పెట్టుబడి: 
  • స్థలం కొనుగోలుకి (స్వంత భూమి లేని వారు), పశువుల కొనుగోలుకి, పశువులకు షెడ్‌, ఇతర గదుల నిర్మాణాలు, పరికరాలు – ఇలా అన్నింటికి కలిపి అయ్యే మొత్తం పెట్టుబడిని పాడి రైతు సొంత వనరుల నుండి కాని, బ్యాంక్‌ ఋణం ద్వారా కాని సమకూర్చుకోవాలి.
  • బ్యాంక్‌ ఋణం పొందే విధానం: పాడి పరిశ్రమను ప్రారంభించాలనుకునే వారు రెండు రకాలుగా ప్రారంభించవచ్చు. నేరుగా బ్యాంకులో ఋణం తీసుకొని లేదా స్వంత డబ్బుతో డైరీ ప్రారంభించవచ్చు. రెండవది ఏమిటంటే ప్రభుత్వ పథకాలు అమలులో ఉన్నప్పడు, ఆ పథకాలు పొందటానికి అర్హత ఉన్నవారు, ఆ పథక నిబంధనలను అనుసరించి, రాయితీని వినియోగించుకొని, మిగిలిన మొత్తాన్ని సొంత వనరుల నుండి లేదా బ్యాంక్‌ ఋణంగా పొందవచ్చును. అంటే సొంతంగా డైరీ పెట్టాలన్నా ప్రభుత్వ పథకాన్ని వినియోగించుకున్నా బ్యాంక్‌ ఋణం తీసుకోవలసిన అవసరం ఏర్పడవచ్చు.
  • బ్యాంకు అధికారి తనకు సమర్పించబడిన ప్రాజెక్టును పరిశీలించి, సాంకేతిక పరమైన, ఆర్థికపరమైన సానుకూలతలను లెక్కించి పై అధికారులను సంప్రదించి ఋణ మంజూరు చేస్తారు. రీ ఫైనాన్సు కోసం నాబార్డు సంస్థను సంప్రదిస్తారు. రీపేమెంట్‌, ఇన్సూరెన్సు వంటి వివరాలు పరిశీలించిన పిదప విడతల వారీగా ఋణం మంజూరు చేయబడుతుంది.
  • డైరీ ప్రారంభించాలనుకొన్న భూమి యొక్క సర్వే వివరాలు, మ్యాప్‌, పట్టాదారు పాస్‌ పుస్తకము, డైరీ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (అవసరాన్ని బట్టి) తీసుకొని, బ్యాంక్‌ మేనేజర్‌ గారిని నేరుగా సంప్రదించాలి. తదుపరి రాత పూర్వక లాంఛనాలను (డాక్యుమెంటేషన్‌) బ్యాంక్‌ మేనేజర్‌ సూచన ప్రకారం పూర్తిచేసుకొని, ఋణం పొందవచ్చును.
  •  పశువులకు వసతి: పశువులను ఆరుబయట వుండటం మంచిది కాదు. ఎక్కువ చలి, ఎక్కువ ఎండల వలన పశువుల శరీరవ్యస్థలు సరిగా పనిచెయ్యవు. ఫలితంగా పాల దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి పశువులకు సరిjైున వసతి కల్పించి, రక్షణ యివ్వటం చాలా ముఖ్యం.
  • పాడి రైతు పశువుల సంఖ్యను బట్టి, రైతు తన ఆర్థిక స్టోమతను బట్టి, పశువులకు సాధారణ పాకను కాని, పక్కా షెడ్కాని నిర్మించుకోవాలి.
  •  ప్రతి పశువుకు 1 నుండి 1.2 మీ.ల వెడల్పు, 1.5 నుండి 1.7 మీటర్ల పొడవు స్థలం వండాలి. షెడ్‌ ఇరుకుగా ఉండకూడదు. 5 పాడిపశువులకు వసతి కల్పించాలంటే, పాక పొడవు 6 మీటర్లు, వెడల్పు 2.5 మీటర్లు వుండాలి. ఆవరణ షెడ్‌ కంటే కనీసం మూడు రెట్లు పెద్దదిగా వుండాలి. ఐదు రెట్లు అధికంగా ఉంటే మరీ మంచిది.
3. సాధారణ పశువుల పాక నిర్మాణం:
నేల: సిమెంట్‌, మొరం, నాపరాళ్ళల్లో ఏదో ఒకదానితో ఏర్పాటు చేసుకోవచ్చు. నేల జారే విధంగా వుండకూడదు. ఏటవాలుగా ఉండాలి. పశువులను కట్టటానికి ఇనుప రింగులను ఏర్పాటు చేసుకోవాలి.
  • కప్ప: గడ్డి, తాటి ఆకులు, సిమెంట్‌ రేకులు, ఇనుపరేకుల వంటి వాటిని వాడవచ్చు, ఇనుపరేకులు వేసేవాళ్ళు చల్లదనం కోసం వాటిమీద గడ్డి కప్పడం మంచిది. కప్ప ఏటవాలుగా ఉంటే వర్సపు నీరు నిలువదు.
  • మేత తొట్టి: పశువులు ఎక్కువగా వుంటే, అన్నిటికి కలిపి ఉమ్మడిగా, ఒకే పొడవైన మేత తొట్టి నిర్మించుకోవచ్చు. మేత తొట్టి లోపలి వెడల్పు 50 సెం.మీ, గోడల ఎత్తు 50 సెం.మీ. ఉంటే మంచిది. పశువుల సంఖ్య తక్కువగా వుంటే మేత తొట్టి అవసరం లేదు. గంపలలో తినిపించవచ్చు.
  •  నీటితొట్టి: పశువుల సంఖ్యను బట్టి ఒకటి లేదా రెండు ఉమ్మడి నీటి తొట్టెలు నిర్మించాలి.
  • మురుగుకాలువ (డైనేజి): మురుగుకాలువ వెడల్పు 30 సెం.మీ., లోతు 7.5 సెం.మీ. ఉండి ఏటవాలుగా నిర్మించాలి. ఈ మురుగును దగ్గరలోని పశుగ్రాసాల సాగు పొలానికి లేదా పంట పొలానికి మళ్ళించాలి.
4. మేలుజాతి పశువులు: 
డైరీ పెట్టే ప్రాంతంలో ఆవుపాలకి గిరాకీ ఉంటే ఆవులను, గేదె పాలకు గిరాకీ ఉంటే గేదెలను కొనాలి. ఎక్కువ పాలిచ్చే మేలు జాతి పశువులను కొంటే లాభం ఉంటుంది. ఆవులలో అయితే హాల్‌ స్టెయిన్‌ ఫ్రీషియన్‌, జెర్సీ) వంటి సంకరజాతులు ఎక్కువ పాలను ఇస్తాయి. గేదెలు అయితే ముర్రా లేదా గ్రేడెడ్‌ ముర్రా ఎక్కువ పాలను ఇస్తాయి.
5. మేపు సౌకర్యం:
  • పాడి పశువులకు పచ్చిమేత, ఎండు మేత, దాణా ఈ మూడు అవసరం. పాలదిగుబడిని బట్టి, పశువు శరీర బరువును బట్టి మేత మోతాదు నిర్ణయించటం శాస్త్రీయ విధానం. దాని ఆధారంగా సుమారుగా చెప్పాలంటే ప్రతిరోజు ఒక్కొక్క పశువుకు 5-7 కిలోల ఎండు మేత, 5-40 కిలోల  పచ్చిమేత 3 కిలోల దాణా ఇవ్వాలి.
  • ఎండుమేతగా వరిగడ్డి, చొప్ప వాడుకోవచ్చు. పచ్చిమేతలో గడ్డి రకాలు, కాయజాతి రకాలు ఉంటాయి. పశువుకు ఇచ్చే మొత్తం పచ్చిమేతలో రెండు వంతులు గడ్డిజాతి లేదా ధాన్యపుజాతి, ఒక వంతు కాయజాతి పశుగ్రాసాలను కలిపి మేపాలి.
  •  దాణా మార్కెట్లో దొరుకుతుంది. దాణా ఖర్చు తగ్గించుకోవాలంటే, దాణాను స్వయంగా తయారు చేసుకొని వాడాలి.
6. యాజమాన్యం పైన అవగాహన – ఆచరణ:
పశు పాలన, పోషణకు సంబంధించిన కొన్ని సాంకేతిక అంశాలగురించి పాడిరైతులకు అవగాహన ఉండాలి. వివిధ వయసుల్లో పశువులను ఎలా పోషించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేతలోని రకాలు, మేత పెట్టే పద్ధతులు, కృత్రిమ గర్భధారణ, చూడి పశువుల సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలలో పాడిరైతులు అవగాహన ఏర్పరచుకొని, వాటిని తప్పని సరిగా పాటించాలి.
పాడి పరిశ్రమకు కావలసిన ముఖ్య పరికరాలు:
బోర్‌ వెల్‌, మోటర్‌, పంప్‌ సెట్స్‌, నీళ్ళ పైపులు, విద్యుత్‌ లైన్‌, వ్యవసాయ పనిముట్లు (పార, గడ్డపార, గొడ్డలి మొ..వి) దాణా గంపలు, చాఫ్‌ కట్టర్‌, ఫీడ్‌ గ్రైండర్‌,  త్రాసు లేదా కాటా,  పాలక్యానులు, బక్కెట్లు
పాడి పరిశ్రమ సంబంధ వివిధ భాగస్వాములు – వారి పాత్ర:
పాడి పరిశ్రమ నిర్వహించే యజమానికి వివిధ వ్యక్తులతో అవసరాలు ఉంటాయి. అలాంటి వ్యక్తుల పాత్రను, అవసరాన్ని అర్థంచేసుకొని, వారితో ఎప్పుడు సత్సంబంధాలు కలిగివుండాలి. సందర్భానుసారం వారి సలహాలు, సేవలు, వినియోగించుకుంటూ వుండాలి. అలాంటి వారిలో కొందరు.
  • బ్యాంక్‌ అధికారి (పాడి పశువులు / గొర్రెలు, మేకలు మరియు కోళ్ళ పెంపకానికి ఋణం మంజూరు)
  •  పశువైద్య సిబ్బంది (పశువైద్య సేవలు, కృత్రిమ గర్భధారణ, రైతుశిక్షణ, పశుగ్రాసాభివృద్ధి సేవలు మొ.వి)
  • ఇన్సూరెన్స్‌ అధికారి (పశువుల బీమా మరియు క్లెయిం పరిష్కారం)
  • పాల వినియోగదారులు
  • హోటల్స్‌ / హాస్టల్స్‌ / హాస్పిటల్స్‌ (పాల వినియోగం)
  •  పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం
  • పశుగ్రాస విత్తన విక్రేతలు
రైతులకు శిక్షణ:
పాడి పశువుల పెంపకం, పోషణ, వ్యాధులు – ఆరోగ్య సంరక్షణ, పశుగ్రాసాలు – వాటి సాగు వంటి సాంకేతిక అంశాల గురించి ప్రతి పాడిరైతుకు ప్రాథమిక పరిజ్ఞానం వుండితీరాలి. పాడిపశువులను ఎంపిక చేసుకోవటం తెలియాలి. ఇలాంటి అంశాలలో రైతులకు అవగాహన కల్పించటానికి, పశుసంవర్ధకశాఖ అధికారులు శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వుంటారు. వాటికి రైతులు తప్పని సరిగా హాజరై విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి.
ప్రభుత్వ పథకాల ద్వారా పాడిపశువులను పొందిన సందర్భంలో, పశువైద్య శిబిరాలు, గొడ్డుమోతు నివారణా శిబిరాలు, పశుగ్రాస వారోత్సవాలు, ఇతర సందర్భాలలో రైతులకు శిక్షణలు నిర్వహించటం జరుగుతుంది. ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలకు వెళ్ళలేక పోయినవారు, సంబంధిత పశువైద్యాధికారిని కలిసి కూడా కావలసిన విషయాలు తెలుసుకోవచ్చు.
రైతు శిక్షణలు లభించే కేంద్రాలు:
  • పశు సంవర్థక శాఖ, జిల్లా మరియు ప్రాంతీయ శిక్షణా కేంద్రాలు
  • కృషి విజ్ఞాన కేంద్రాలు
  • వేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం
  • నేషనల్‌ డైరీ డెవలప్‌ మెంట్‌ బోర్డ్‌ ఆనంద్‌
  • నేషనల్‌ డైరీ రీసెర్చ్‌ ఇన్స్టిట్యూట్‌, కర్నల్‌, హర్యానా,
  • భారతీయ ఆగ్రో ఇండస్టీస్‌ ఫౌండేషన్‌, ఉర్తి కంచన్‌, పూనే
మార్కెటింగ్‌ పాలను ఎలా అమ్యాలి?
రైతు పాలను ఉత్పత్తి చేసిన చోటే అంటే తన డైరీ దగ్గరే అమ్మకునేలా ఏర్పాటు చేసుకోవటం చాలా మంచి పద్ధతి. దీని వలన రవాణా ఖర్చులు ఉండవు. కాబట్టి పాడి మరింత లాభాలను ఇస్తుంది. అలాగే రవాణాలో ఆలస్యం కావటం, పాలు చెడిపోయి నష్టం రావటం వంటి సమస్యలు తప్పిపోతాయి. అందరికీ అన్నివేళలా ఇంటి దగ్గరే పాలు అమ్ముడు పోయే పరిస్థితి ఉండక పోవచ్చు. అలాంటప్పుడు డైరీకి వీలైనంత దగ్గరలో ఉండే వినియోగదారులను ఏర్పాటు చేసుకోవాలి. హోటళ్ళు స్వీట్‌ షాప్లు, హాస్టళ్ళు పరిశ్రమలు, ప్యాక్టరీలు మొదలైన వాటి యొక్క క్యాంటీన్స్‌, మెస్‌ లు, హాస్పిటల్స్‌ ఇలాంటి వాటికి ఎక్కువ పరిమాణంలో పాలను అమ్ముకోవచ్చు. కళ్యాణమంటపాలు, ఫంక్షన్‌ ప్యాలస్లు, దేవాలయాలకు కూడా పాలు అమ్మకునే అవకాశం వుంది. సహకార సంఘాల పెద్ద డైరీలు దగ్గరలో వున్నట్లయితే, మొత్తం పాలను వారికే
అమ్ముకోవచ్చు.
మరీ చిన్న రైతులు అయితే అత్యంత దగ్గరలో లేదా చుట్టు పక్కల గ్రామాలు, పట్టణాలలోని వాడకం దారులను కుదుర్చుకొని, ఇంటి అవసరాలకు పాలను అమ్మవచ్చు.
పాల అమ్మకంలో ప్రత్యామ్నాయ విధానాలు:
  • కాలం ఎప్పడూ మనకి అనుకూలంగా ఉండదు. అప్పడప్పుడు ఒడిదుడుకులు ఏర్పడటం సహజం. అలాంటి ప్రతికూల పరిస్థితులలో ప్రతిరోజు అమ్మినట్లుగా పాలను అమ్మలేరు. అప్పుడు కూడా నష్టపోకుండా వుండాలంటే, కనీసం నష్టాలను వీలైనంత తగ్గించుకోవాలంటే, అందుకు ముందే తగిన ఆలోచనలతో, ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి.
  •  బంద్‌లు, తుఫాన్‌, భారీవరాలు, వరదలు, రోడ్లు కొట్టుకు పోవటం, వాగులు పొంగటం మొదలైన ప్రతికూల పరిస్థితులలో పాలను అమ్మకోలేకపోతే, యంత్రంతో పాలలోని వెన్నతీసి, క్రీముగా కాని, వెన్నగా కాని, నెయ్యిగా కాని నిలువ చేసి అమ్మవచ్చు. వెన్న తీసిన పాలను దూడలకు ఆహారంగా ఇవ్వవచ్చు లేదా దగ్గరలో ఉండే వారికి తక్కువ ధరకు అమ్మవచ్చు.
  • వీలైనంత వరకు దళారీలు, మధ్యవర్తి ల పైన ఆధారపడకుండా, పాలను నేరుగా వినియోగ దారులకు అమ్మటం శ్రేయస్కరం, లాభదాయకం.
ఇతర డైరీ ఫారాల సందర్శన:
  •  వినటం, చదవటం కంటే, చూడటం ద్వారా విషయాల పైన ఎక్కువ అవగాహన ఏర్పడుతుంది. విషయాలు తేలికగా అర్థమవుతాయి. విషయాల పైన నమ్మకం కలుగుతుంది. పాడి పరిశ్రమ ప్రారంభించే ముందు, కొన్ని డైరీ ఫారాలను చూసి, అక్కడి కార్యకలాపాలను స్వయంగా పరిశీలించి తెలుసుకోవటం చాలా ఉపయోగ కరంగా ఉంటుంది.
  •  అలాగే డైరీ ప్రారంభించిన తర్వాత కూడా అప్పడప్పుడు ఇతర డైరీలను చూసివస్తు వుండాలి. సొంత అనుభవాన్ని ఇతరుల అనుభవంతో పోల్చి చూడటం వలన మెరుగైన చర్యలు తీసుకోటానికి వీలవుతుంది. అనేక సమస్యలకి, సందేహాలకి సమాధానాలు, పరిష్కారాలు లభిస్తాయి. లాభాల మార్గాలు తెలిసివస్తాయి.
వ్యాపార అవకాశాలు – ఆదాయపు వనరులు:
  • పాలను నేరుగా అమ్మి పాలవ్యాపారం చెయ్యటమే కాకుండా, ఆర్థిక స్టోమతను బట్టి, పాల ఉత్పత్తులను కూడా తయారుచేసి అమ్మవచ్చు. ఉదా : పెరుగు, వెన్న నెయ్యి, క్రీమ్‌
  •  పాడి పరిశ్రమలో వచ్చే పేడను నేరుగా ఎరువుగా సొంత పంట పొలాలకు వాడుకోవచ్చు లేదా ఇతర రైతులకు అమ్ముకోవచ్చు.
  • పేడతో గోబర్‌ గ్యాస్‌ తయారు చేయవచ్చు. (వివరాలకు సమీప వ్యవసాయాధికారికి సంప్రదించవచ్చు)
  •  పేడతో పిడకల వ్యాపారం చేయవచ్చు.
  •  పేడ తో వర్మి కంపోస్ట్‌ తయారు చేసి అమ్మవచ్చు. (వివరాలకు సమీపంలోని వ్యవసాయాధికారిని సంప్రదించవచ్చు)
  • ఒంగోలు గిత్తలు / దూడల పెంపకం. పాల శీతలీకరణ కేంద్రాల నిర్వహణ పాల సేకరణ కేంద్రాల నిర్వహణ గడ్డికోసే యంత్రాల నిర్వహణ పాలు పితికే యంత్రాల నిర్వహణ ఆవు మూత్రం వడపోత కేంద్రాలు
పాల ఉత్పత్తిలో శ్రమను తగ్గించి అధిక లాభాలకు -ఉపయోగపడే పరికరాలు:
  • పాడి పశువుల పెంపకములో పచ్చిమేత తప్పనిసరి, ప్రతీరోజు ఒక్కో పశువుకు 25-30 కిలోల పచ్చి మేత అవసరము, రోజువారీ పచ్చిమేత కొరకు కూలీ ఖర్చులు అధికం. గడ్డి కత్తిరించు యంత్రాల వాడకం ద్వార కూలీ ఖర్చులు తగ్గించి అధిక లాభాలు పొందవచ్చు
  • ఒకటి రెండు పాడిపశువులు కలిగిన వారు స్వతహాగా పాలు పితకవచ్చు .అధిక సంఖ్యలో పాడిపశువులను పోషించేవారికి కూలీ ఖరులు అదనం, యాంత్రిక పాలు పితికే యంత్రాల వాడకం ద్వారా కూలీ ఖర్చులు తగ్గింపు మరియు పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి తోడ్పాటు,
  • పాడిపశువులకు జొన్న మొక్కజొన్న లాంటి పశుగ్రాసాలను ముక్కలు చేయకుండా వాడటం వలన 30 శాతం వరకు పశుగ్రాసాన్ని నష్టపోతారు.చాఫ్‌ కట్టర్ని వాడటం ద్వారా పశుగ్రాసాన్నిచిన్న చిన్న ముక్కలుగా చేసి వాడటం వలన పశుగ్రాసాన్ని పూర్తిగా వినియోగించి, నష్టాన్ని అరికట్టవచ్చు. పరిశుభ్రమైన పాల ఉత్పత్తి మరియు పశు ఆరోగ్య సంరక్షణలో పాక/పెద్ద పరిశుభ్రత అతిముఖ్యం.
  •  పెద్ద ఎతున డైరీ ఫారాలు నిర్వహించేవారు షెడ్‌ లను శుభ్రపరచడానికి కూలీ ఖర్చులు అధికం. షెడ్‌ క్లీనర్‌ ఉపయోగించి ఖర్చు ఆదా చేయవచ్చును.
డా. జి.రాంబాబు, పశువైధ్యాధికారి, 
కడప, ఫోన్‌ : 9494588885
Leave Your Comments

Alternative Crops: ప్రత్యామ్నాయ పంటల సాగుతో అధిక లాభాలు

Previous article

Fruit and Vegetable Products: వేసవిలో సౌరశక్తి ద్వారా పండ్లు, కూరగాయల ఉత్పత్తులు 

Next article

You may also like