Cultivation of green manures in Alkali lands: డా. కిరణ్ పిల్లి, బి. నవ్య రావు , డా. వినోద్ కుమార్, డా.ఏ. శ్రీనివాస్, కృషి విజ్ఞాన కేంద్రం, ఎస్.కె.ఎల్.టి.ఎస్.హెచ్.యు.,రామగిరిఖిల్లా,పెద్దపల్లి జిల్లా
వరి పంటను వానాకాలం,యాసంగిలో సాగుచేస్తారు.పెద్దపల్లి జిల్లాలో వానాకాలంలో 83,780 హెక్టార్లలో, యాసంగిలో 68,338 హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. వరి తర్వాత వరి పంట సాగుచేసే భూముల్లో సారం తగ్గి, భూభౌతిక స్థితిలో మార్పులు వచ్చి పంటసాగులో రైతులు ఆశించిన ఫలితాలను పొందలేక పోతున్నారు. రసాయన ఎరువుల వాడకం అధికంగా ఉండటం వల్ల భూమిలో చౌడు శాతం పెరిగి దిగుబడులు నానాటికీ తగ్గిపోతున్న నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరిఖిల్లా శాస్త్రవేత్తలు పచ్చిరొట్ట ఎరువుల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం,రామగిరిఖిల్లా, పెద్దపల్లి జిల్లా వారు కాల్వచర్ల గ్రామంలో పచ్చిరొట్ట ఎరువుల వాడకం, వాటి ప్రయోజనాల మీద రైతులకు గత కొన్ని సంవత్సరాలుగా శిక్షణ ఇస్తున్నారు. కాల్వచర్ల గ్రామంలో రైతులు వానాకాలంలో వెయ్యి ఎకరాల్లో వరిసాగుచేస్తున్నారు.ఈ వెయ్యి ఎకరాల్లో 50% భూములు ఎక్కువగా చౌడు బారిన పడి ఎకరాకి 10-15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తుంది. రాపెల్లి రమేష్ అనే రైతు కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరిఖిల్లా వారి ప్రోద్భలంతో జీలుగ సాగును దశాబ్దకాలంగా సాగు చేస్తూ తన భూమిలో చౌడు శాతాన్నిపూర్తిగా తగ్గించుకొని, ఎకరానికి 28 క్వింటాళ్ళ దిగుబడిని పొందుతూ గ్రామంలోని మిగతా రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే రత్నపూర్ గ్రామంలో ఎరుకల సతీష్ అనే రైతు గత 5 సంవత్సరాలుగా జీలుగ వేస్తూ తన భూమిలో చౌడు శాతం (ఉదజని సూచిక 8.2 నుంచి 6.4 కి తగ్గింది) తగ్గించుకొని ఎకరానికి 25 క్వింటాళ్ళ దిగుబడి సాధిస్తున్నాడు.
రైతు అవలంభించిన మేలైన పద్ధతులు:
- ప్రతి సంవత్సరం తొలకరిలో వరి వేయడానికి ముందు జీలుగ వేసుకొని పూతదశలో రెండు బస్తాల (100 కిలోల) సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కలియదున్నుతారు .
- చౌడును తట్టుకునే ఆర్.ఎన్.ఆర్.11718 వరి రకాన్ని వానాకాలంలో వేశారు. ఎకరానికి 30 కిలోల విత్తనం వేసి దగ్గరగా నాటి, ఆఖరి దుక్కిలో 20 కిలోల జింక్ సల్ఫేట్ ను దమ్ములో క్రమం తప్పకుండా వేసుకుంటారు.పదేళ్ల క్రితం ఎకరానికి 10-15 క్వింటాళ్ళ దిగుబడి వచ్చేది.ఇప్పుడు ఎకరానికి 20-25 క్వింటాళ్ళ వరకు దిగుబడి పొందుతున్నారు.
- భూసార పరీక్షల ఆధారంగా ఉదజని సూచిక 8.5- 9 మధ్యలో ఉన్నందున ఒక ఎకరానికి 15 క్వింటాళ్ళ జిప్సంను మొదటి దుక్కి చేసినప్పుడు దమ్ము చేయడానికి ముందు మొదటి 5 ఏళ్లలో వేయడం జరిగింది.
- జీలుగ పచ్చిరొట్ట ఎరువు పైరును ప్రతి సంవత్సరం భూమిలో వేసి కలియదున్నడం వల్ల మేలు చేసే సూక్ష్మజీవులు భూమిలో వృద్ధి చెంది మొక్కకు లభ్యస్థితిలో లేనటువంటి పోషకాలన్నింటిని లభ్యస్థితిలోకి తీసుకురావడం వల్ల ఎరువుల వాడకాన్నిముఖ్యంగా భాస్వరాన్ని వేయడం తగ్గించుకోవడంతో పాటు తర్వాత వేసే పంటల్లో 20-30 శాతం నత్రజని ఎరువు వాడకాన్ని కూడా తగ్గించుకోవడం జరిగింది. రసాయన ఎరువులకు పెట్టే పెట్టుబడుల్లో 20-30% శాతం ఖర్చును కూడా ఆదా చేయడం జరిగింది.
రైతు అభిప్రాయం: క్రమం తప్పకుండా పదేళ్ల నుంచి జీలుగ సాగుచేయడం వల్ల తన భూమిలో(ఉదజని సూచిక 8.5 నుంచి 5.8 కి తగ్గింది) చౌడు శాతం తగ్గి మంచి దిగుబడులు వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
కొనసాగింపు: రాపెల్లి రమేష్, ఎరుకల సతీష్ ని ఆదర్శంగా తీసుకొని గత
వానాకాలం 2022-23 లో రామగిరి మండలం కాల్వచర్ల, రత్నపూర్ గ్రామాలకు చెందిన వంద మంది రైతులు 500 ఎకరాల్లో వరి పంటకు ముందుగా జీలుగ సాగు చేయడం ప్రారంభించారు.
ALSO READ:LEAFY VEGETABLES: మీకు తెలుసా …? బచ్చలి కూర ఎందుకు తినాలి ?