Cultivation of geranium as a profitable aromatic oil crop: ప్రస్తుతం జిరేనియం పంట ఎక్కువగా తెలంగాణ,ఆంధప్రదేశ్,మాహారాష్ట్ర,కర్ణాటక, తమిళనాడు,ఉత్తరప్రదేశ్,చత్తీస్ ఘర్ రాష్ట్రాల్లో సాగు చెస్తున్నారు. ఇది మూడు అడుగుల ఎత్తువరకు పెరిగే బహువార్షిక జాతికి చెందిన మొక్క.ఈ పంట నుంచి లభించే సుగంధ తైలాన్ని ఖరీదైన సబ్బులు, సుగంధ పరిమళాలు, సౌందర్య సాధనాల తయారీలో విరివిగా వాడుతున్నారు.
అనువైన నెలలు :
నీరు నిలవని, మెత్తని ఇసుకతో కూడిన నల్లరేగడి, తెలికపాటి ఎర్ర నేలలు, ఉదజని సూచిక (పి.హెచ్.) 6.0 -7.0 ఉన్న సారవంతమైన నేలలు సాగుకు అనుకూలమైనవి.
రకాల ఎంపిక: సి.ఎస్.ఐ.ఆర్ -సిమాప్ సంస్ధ అభివృద్ధి చేసిన సిమ్-భారత్ లేదా ఎస్.హెచ్.కెల్కర్ రకాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగుకు అనువైనవి.
ప్రవర్ధనం:
10-15 సెం.మీ. పొడవు, 3-4 కణుపులు గల లేత కొమ్మలను ప్రవర్ధనం కోసం ఉపమోగిస్తారు.
నారుమడి :
నారు మొక్కల కోసం ఎత్తైన నారు మడులను సెప్టెంబర్- అక్టోబర్ మాసాల్లో సిద్ధం చేసుకోవాలి.10-15 సెం.మీ. పొడవు, 3-4 కణుపులు గల లేత కొమ్మలను పైభాగాన 2-3 ఆకులు వదిలి మిగిలిన ఆకులను తీసివేసి, అడుగు భాగాన ఏటవాలుగా కత్తిరించి 0.1 శాతం కార్బెండాజిమ్ ద్రావణంలో 1- 2 నిమిషాల పాటు ముంచి, కాండం రెండు కణుపుల వరకు నేలలోకి పోయేటట్లు నారుమడిలో నాటుకోవాలి.ప్రతి రోజు తేలికపాటి తడివ్వాలి.సుమారు 30-40 రోజుల తర్వాత నారు మొక్కలు పొలంలో నాటుకోవడానికి సిద్ధంగా అవుతాయి.
సాగువిధానం:
జిరేనియం 4 -5 సంవత్సరాల వరకు ఉండే పంట కాబట్టి భూమిని బాగా లోతుగా పలుమార్లు దున్ని సాగుకు అనకూలంగా తయారు చేసుకోవాలి. తర్వాత భూమిని బోదెలు (20సెం.మీ. ఎత్తు, 45 సెం.మీ. వెడల్పు) , కాల్వలు (45 సెం.మీ.లేదా 60 సెం.మీ.వెడల్పు) పద్ధతిన సిద్ధం చేసుకోవాలి. నారు మొక్కలను వరుసల మధ్య 60 సెం.మీ., మొక్కల మధ్య 45 సెం.మీ ఎడంతో నాటుకోవాలి. ఒక ఎకరానికి సుమారు గ్యాప్ ఫిల్లింగ్ తో కలుపుకొని 15,000-18,000 నారు మొక్కలను నాటుకోవాలి.ఈ మొక్కలను అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నాటుకోవచ్చు.
ఎరువులు:
ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు, 30 కిలోల యూరియా, 80 కిలోల సూపర్ పాస్పేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను ఆఖరి దుక్కిలో వేయాలి. నాటిన 2 నెలల తర్వాత ఎకరాకు 30 కిలోల యూరియా వేయాలి. అలాగే ప్రతీ కోత తర్వాత 30 కిలోల యూరియాను ఒక ఎకరానికి వేయాలి. అతిగా ఎరువుల వినియోగం ఆమోదయోగ్యం కాదు.అధిక ఎరువుల వాడకం వల్ల నూనె దిగుబడి శాతం తగ్గే అవకాశం ఉంటుంది.
నీటి యాజమాస్యం :
మొక్కలు నాటిన వెంటనే నీటి తడివ్వాలి. ఒక నెలరోజుల వరకు ప్రతి 3 రోజులకొకసారి తేలిక పాటిగా నీరు పెట్టాలి. తర్యాత వారం రోజుల వ్యవధిలో నేల, వాతవరణాన్ని బట్టి నీరు పెట్టాలి. తెలంగాణ, మహరాష్ట్రలో ఎక్కువగా బిందు సేద్యం పధ్ధతిని వినియోగిస్తున్నారు.
కలుపు నివారణ:
మొక్కలు నాటిన 2-3 నెలల వరకు పంటలో ఎటువంటి కలుపు మొక్కలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పంటకోసిన ప్రతీసారి ఒక నెల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి.
సస్యరక్షణ :
ఎండుతెగులు :
ఇది పంటకు అపార నష్టాన్ని కలిగిస్తుంది. తెగులు సోకిన ఆకులు పసుపు పచ్చగా మారి, క్రమేపి కొమ్మలు వాడిపొయి మొక్కఎండిపోతున్నట్లు కన్పిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కలను తొలిగించి, మిగతా మొక్కల మీద 0.1%. కార్బెండాజిమ్ ద్రావణాన్ని పిచికారి చేయాలి.
చెదపురుగులు:
పొడివాతావరణం ఉన్నప్పుడు చెదలు బాగా ఆశించి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.మి.లీ.చొప్పున ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పంటకోత:
నాటిన 5-6 నెలల తర్వాత మొదటి పంట కోతకి వస్తుంది. తదుపరి పంటలను ప్రతి 3-4 నెలలకు ఒక సారి నేలమట్టానికి 15-20 సెం.మీ ఎత్తులో మొక్కలను కొడవలి లేదా సికేచర్లతో కత్తిరించుకోవాలి. పంటకోసిన ప్రతీసారి 0.1శాతం కార్బెండాజిమ్ ద్రావణాన్ని పంటపై పిచికారి చేసి నీటి తడివ్వాలి.
నూనె తీసే విధానం:
జిరేనియం మొక్కల నుంచి డిస్టిలేషన్ పధ్ధతి ద్వారా సూనే తీస్తారు. పంట కోసిన వెంటనే కాకుండా 4-8 గంటల పాటు నీడలో అరబెట్టిన ఆకుల నుంచి అధిక తైల దిగుబడిని పొందవచ్చు. దీనికోసం స్టీమ్ డిస్టిలేషన్ యూనిట్ అవసరం ఉంటుంది. కోసి అరబెట్టిన ఆకులను డిస్టిలేషన్ ట్యాంక్ లో నింపి మూత మూసి నీటి ఆవిరిని ఒత్తిడితో పంపించాలి. తర్వాత నూనె ఆవిరి, నీటి ఆవిరితో కలిసి కండెన్సర్ లో ద్రవరూపానికి మారి తర్వాత సెపరేటర్ ద్వారా నూనే, నీరు వేరుచేయబడుతాయి. ఈ విధంగా పొందిన సూనెలో ఉన్న కొద్ధిశాతం నీటిని సోడియం సల్ఫేట్ ద్వారా తొలిగించి అల్యూమినియం డబ్బాల్లో గాని లేదా గాజు సీసాల్లో గాని నిల్వఉంచాలి.ఇలా చేయడం వల్ల చాలా రోజులు నూనెను నిల్వ ఉంచవచ్చు.
తైలం నాణ్యత:
సుగంధ తైలం నాణ్యతమ గ్యాస్ క్రొమటోగ్రఫీ విధానం ద్వారా నిర్థారణ చేస్తారు. తైలం నాణ్యత వాటిలో ఉండే సిట్రోనెల్లాల్, జెరానియోల్, లినలాల్, ఐసోమెంతిన్ అనే రసాయనాల మోతాదు మీద ఆధారపడి ఉంటుంది. జిరేనియం మొక్కల నుంచి ఒక కోతకి ఎకరాకు సంవత్సరానికి 6- 8 కిలోల నూనె చొప్పున మొత్తం నాలుగు కోతల ద్వారా 24-32 కిలోల నూనెతో రూ.2,40,000 నుంచి 3,20,000 వరకు స్థూల ఆధాయం లబిస్తుంది. ప్రస్తుతం కిలో నూనె ధర రూ.10,000 – 12,000 ఉంది.
రంజిత్ కుమార్ సుంకరి, డా. జ్ఞానేశ ఏసీ,ఎస్.భరత్ కుమార్, సిమాప్, బోడుప్పల్ హైదరాబాద్;డా.ఎస్. వెణు గోపాల్, ఐ.ఐ.ఎం, షిల్లాంగ్, మేఘాలయ
ఫోన్:9966326645 7829811050
ALSO READ:Profits from the cultivation of foreign dragon fruit!: విదేశీ డ్రాగన్ పండ్ల సాగుతో లాభాలు మెండు !