Farmers Suicides: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తిరుపతిలో నిర్వహించిన రైతు చర్చాగోష్టిలో వ్యవసాయ పరపతి విధానం, ఉచిత పంటల బీమా విధానం (Crop Insurence) పై చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు. భారతీయ గ్రామీణాభివృద్ధికి వ్యవసాయమే చుక్కాణి. సందేహం లేదు. కార్పోరేట్, సాఫ్ట్ వేర్ సంస్థలు, ఇతరత్రా సేవా రంగ కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెబుతున్నా ఇప్పటికీ నూటికి 70 శాతం మందికి సాగు రంగమే జీవనాధారం.
ప్రపంచ బ్యాంక్ ఇటీవలి నివేదిక కూడా ఈ విషయాన్నే చెబుతోంది. సుస్థిరాభివృద్ధి, పేదరికం నిర్మూలనలో వ్యవసాయమే అత్యంత ముఖ్యమైన సాధనం. వ్యవసాయంలో ఆర్ధిక ఇబ్బందులనేవి ఓ ఎడతెగని, ముగింపు లేని సమస్యే. ఆర్ధిక చికాకులతో వ్యవసాయం భారీ మూల్యమే చెల్లిస్తోంది. గ్రామాలు సుసంపన్నంగా ఉన్నప్పుడే భారత్ అన్ని రంగాలలో వెలుగొందుతుంది.
కానీ నేటి గ్రామీణ భారతం మాత్రం ఇంకా అప్పుల్లో కొట్టుమిట్టాడుతూనే ఉంది. రైతుల ప్రధాన సమస్య పెట్టుబడి. డబ్బుతో ముడిపడి ఉన్న ఆధునిక వ్యవసాయానికి సరిపడా పెట్టుబడి పెట్టే ఆర్ధిక స్థోమత లేక రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. వ్యవసాయంతో వచ్చే ఆదాయం అధిక వడ్డీతో తీసుకుంటున్న పంట రుణాల చెల్లింపుకే సరిపోతున్నది.
రాయల్ కమిషన్ చెప్పినట్టుగా మనదేశంలో రైతు అప్పులతో పుడుతున్నాడు. అప్పులతో బతుకుతూ, అప్పులతోనే చనిపోతున్నాడు. పెద్ద కమతాలున్న వారు పొలాన్ని కౌలుకిచ్చి నగరాలకు తరలిపోతుంటే ఊళ్లల్లో ఉన్న బడుగు, బలహీన వర్గాల వారు కౌలు చేస్తూ బ్రతుకుతున్నారు. వాస్తవ సాగుదార్లైన ఈ రైతుల పరిస్థితి మరింత ఆగమ్య గోచరంగా ఉంది.
రైతుల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు:
గ్రామీణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య వ్యవసాయ రుణగ్రస్థత. దేశ వ్యవసాయాభివృద్ధిని కుంటుపరుస్తున్న సమస్య కూడా ఇదే. గ్రామీణుల్లో చాలామంది ఆర్ధిక అవసరాల కోసం ఎక్కువగా అప్పులు చేస్తుంటారు. వీటితో కొంత భాగం కుటుంబ అవసరాలకు మిగిలిన దాన్ని వ్యవసాయ పెట్టుబడికి వినియోగిస్తున్నారు. అనేక కారణాల వల్ల రైతులు ఆ అప్పులను తీర్చలేక రుణగ్రస్తులవుతున్నారు.
ఈ పరిస్థితినే మనం గ్రామీణ రుణగ్రస్తత లేదా అప్పుల భారం అంటుంటాం. పేదరికం, వారసత్వంగా వచ్చిన అప్పులు, పెరిగిన వ్యవసాయ ఖర్చులు, వ్యవసాయ రంగ వెనుకబాటుతనం, తక్కువ దిగుబడి, భూమి కౌలు రేట్లు పెరగడం, మతపరమైన కట్టుబాట్లు, సాంఫీుక దురాచారాలు, అనవసరపు ఖర్చులు, వడ్డీ వ్యాపారుల మీద అధికంగా ఆధారపడడం, ప్రభుత్వ పరపతి సదుపాయాల మీద సరైన అవగాహన లేకపోవడం, అనారోగ్యాలు, దురలవాట్లు తదితర కారణాలు కూడా రైతులు అప్పులపాలు కావడానికి కారణం అవుతున్నాయి.
అప్పులు పెరిగితే ఏమవుతుంది?
దేశాలకు దేశాలు, రాష్ట్రాలకు రాష్ట్రాలే అప్పులు చేస్తున్నప్పుడు మనం చేస్తే తప్పేమిటీ? అవి వ్యవస్థలు, మనం వ్యక్తులం. దేశాలు, రాష్ట్రాలు చేసే అప్పుల ప్రభావం ప్రజలందరిపైనా పడుతుంది. ఈవేళ మన తలసరి అప్పు సుమారు రూ. 2 లక్షలు ఉంది. అది ఇంకా పెరిగితే ద్రవ్యోల్భణం వస్తుంది. అది ముదిరితే ఆర్ధిక సంక్షోభం వస్తుంది. వ్యవస్థలు కుప్పకూలడం ప్రారంభమవుతుంది. ఆ విధంగా దేశం అథోగతి పాలవుతుంది. ఇక, వ్యక్తులంగా మనం చేసే అప్పు మనపైనా, వారి కుటుంబాలపైన పడుతుంది. ఉదాహరణకు రైతులు అప్పుల పాలైతే కుటుంబం దెబ్బతింటుంది. పొలంపై పెట్టే పెట్టుబడి స్థోమత తగ్గుతుంది. ఆ ప్రభావం కూడా దేశంపై పడుతుంది.
Also Read: ఆరుతడి పంటల్లో పోషక లోపాలు -నివారణ చర్యలు
రాష్ట్రంలో 93.2 శాతం మంది రైతులు అప్పుల్లోనే..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావొస్తోంది. నరేంద్ర మోదీ చెప్పిన దాన్ని బట్టి 2022 ఆగస్టు నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కావాలి. కానీ అది జరగలేదు. రాష్ట్రంలో రైతుల నెలసరి ఆదాయం 9 వేల189 రూపాయలు. నెలసరి సాగుపై చేస్తున్న ఖర్చు సగటున 6960 రూపాయలు. అంటే మిగిలేది 2,229రూపాయలు. అదే సన్న, చిన్న కారురైతుల నెలసరి ఆదాయం 240 రూపాయలకు మించడం లేదు. దీంతో కుటుంబం గడిచేది ఎలా అందుకే రైతులు బ్యాంకుల నుంచి తీసుకుంటున్న అప్పుల్ని కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఫలితంగా రాష్ట్రంలో నూటికి 93.2 శాతం రైతులు, తెలంగాణలో 91.7 శాతం రైతులు రుణభారంతో చితికిపోతున్నారు. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతుల నుంచి 18.4 లక్షల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని వాణిజ్య బ్యాంకులు లెక్కతేల్చి కేంద్ర వ్యవసాయ మంత్రి పార్లమెంటులో చెప్పారు.
ఆర్ధిక వ్యవస్థకే సవాల్…
రైతులు పొలంపై పెట్టే పెట్టుబడి తక్కువగా ఉంటే దిగుబడి తగ్గి, ఉత్పత్తి తక్కువై ఆహార కొరత ఏర్పడుతుంది. ఆహార సరఫరా తక్కువ కావడం వల్ల డిమాండ్ అధికమై ప్రజల ఆహార ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. ప్రజల మిగులు ఆదాయం తగ్గడం వల్ల పారిశ్రామిక, సేవారంగాల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు ఆర్ధిక వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అది ప్రజల విద్యా, వైద్య, ఆరోగ్య స్థితిగతులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వ సంస్థాగత పరపతి సౌకర్యాల కోసం రైతులు ఉద్యమాల బాట పట్టాల్సి వస్తుంది. రుణాల మాఫీ ఉద్యమాలు మొదలవుతాయి. వాటికి ప్రభుత్వాలు సానుకూలంగా లేకపోతే అవి హింసాత్మకంగా మారి సమాజ భద్రతకు సవాలుగా మారతాయి.
రాష్ట్ర వ్యవసాయ పరిస్థితి వివరాలు ఇలా..
- రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణం (చేపల చెరువులు సహా) 60.77 లక్షల హెక్టార్లు
- పంటల సాగు విస్తీర్ణం 80.96 (రెండు సీజన్లు కలిపి)
- సన్నకారు రైతుల శాతం 65.39, (సంఖ్య 4983611) వీరిసాగు విస్తీర్ణం 26.68 శాతం
- చిన్న కారు రైతుల శాతం 20.88 (1591012), సాగు విస్తీర్ణం 27.80 శాతం
- మధ్యస్త (1026617), పెద్దరైతుల (19878) శాతం 13.73 శాతం. నేల విస్తీర్ణం 45.52 శాతం
- మొత్తం రైతుల సంఖ్య (2011 జనాభా లెక్కలప్రకారం) 76,21,118
- షెడ్యూల్డ్ కులాల రైతులు 713038, వీరి సాగు 5.13 లక్షలహెక్టార్లు
- షెడ్యూల్డ్ తెగల రైతులు 387053, వీరి సాగు 4.78 లక్షల హెక్టార్లు
- మొత్తం సాగు విస్తీర్ణం 80,96,441 హెక్టార్లు
- షెడ్యూల్డ్ కులాల సగటు విస్తీర్ణం 1.08 హెక్టార్లు
- షెడ్యూల్డ్ తెగల సగటు విస్తీర్ణం 3.08 హెక్టార్లు
- రాష్ట్రంలో సీజన్లు రెండు ఖరీఫ్, రబీ
- రాష్ట్రంలో మొత్తం సాధారణ వర్షపాతం 966.2 మి.మీ.
- జూన్ నుంచి సెప్టెంబర్ చివరి వరకు ఖరీఫ్. ఈ కాలంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 556 మి.మీ.
- అక్టోబర్ ఒకటి నుంచి డిసెంబర్ వరకు రబీ. ఈ సీజన్‌లో కురవాల్సిన సాధారణ వర్షపాతం 296 మి.మీ.
- శీతాకాలం అంటే జనవరి, ఫిబ్రవరిలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 15.8 మి.మీ.
- వేసవికాలం అంటే మార్చి నుంచి మే వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 98.4 మి.మీ.
- వివిధ నీటి వనరుల ద్వారా రాష్ట్రంలో స్థూల నీటి పారుదల విస్తీర్ణం 35.82 లక్షల హెక్టార్లు, కాగా నికర నీటిపారుదల విస్తీర్ణం 27.19 లక్షల హెక్టార్లు, రాష్ట్రంలో బోర్లు, బావులు 15.09 లక్షలు
వ్యవసాయ పరపతి ఎలా ఉందంటే…
వ్యవసాయ ఉత్పాదకాల కొనుగోలుకు, వ్యవసాయ పనులు చేపట్టడానికి అవసరమైన పరపతిని వ్యవసాయ పరపతి అంటారు. రైతులు తమ పరపతి అవసరాలను వివిధ మార్గాల ద్వారా తీర్చుకుంటున్నారు.
అవి రెండు రకాలు.
1. సంస్థాగతమైన పరపతి మార్గాలు- ప్రభుత్వం, సహకార సంఘాలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు అందించే పరపతి సౌకర్యాలు.
2. సంస్థాగతం కాని పరపతి మార్గాలుప్రభుత్వ నియంత్రణ లేని సంస్థలు, చట్టపరిధిలోకి రాని వడ్డీవ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, స్నేహితులు, బంధువులు, భూముల్ని తాకట్టుపెట్టుకుని ఇచ్చే అప్పులు, భూస్వాముల నుంచి తీసుకునే అప్పులు. కొత్తగా ఎరువుల కొట్లవాళ్లు, పురుగుమందుల వాళ్లు, పంటను తిరిగి తీసుకునే హామీ లేదా నోటు రాసుకుని పంట వేసే ముందే అప్పు ఇవ్వడం లాంటివి. సహజంగా ఊళ్లల్లో జరిగే లావాదేవీలు ఇవి. రెండు రూపాయలు మొదలు ఐదు రూపాయల వరకు వడ్డీని వసూలు చేస్తుంటారు. అవసరాన్ని బట్టి ఈ వడ్డీ రేట్లు మారిపోతుంటాయి. రైతులు ప్రధానంగా దోపిడీకి గురయ్యేది ఈ మార్గాల్లోనే.. అందుకే ప్రభుత్వం సంస్థాగతం కాని పరపతి సంస్థలను నియంత్రించడానికి సుదీర్ఘకాలంగా కసరత్తు చేస్తోంది.
సంస్థాగత పరపతి మార్గాలు..
అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలన సంఘం కాలవ్యవధి ఆధారంగా సంస్థాగతమైన పరపతి మార్గాలను మూడు రకాలుగా వర్గీకరించింది.
1. స్వల్పకాలిక పరపతి:
12 నుంచి 15 నెలల వ్యవధిలో తిరిగి చెల్లించాల్సిన వ్యవసాయ రుణాలను స్వల్పకాలిక పరపతి అంటారు. సాధారణంగా పంట చేతికి రాగానే రైతులు ఈ రుణాలను తీర్చేస్తారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల మేత కొనుగోలు, కూలీల వేతనాలు, పంటను మార్కెట్కు తరలించడానికి అయ్యే రవాణా వ్యయానికి ఈ స్వల్పకాలిక రుణాలను రైతులు ఉపయోగించుకుంటారు.
2. మధ్యకాలిక పరపతి:
15 నెలల నుంచి ఐదేళ్ల వ్యవధిలో ఈ రుణాలను తిరిగి చెల్లించాలి. పశువులు, వ్యవసాయ పనిముట్ల కొనుగోలు, బావుల తవ్వకం, భూమిని మెరుగుపర్చడం కోసం ఈ రుణాలను తీసుకుంటారు.
3. దీర్ఘకాలిక రుణాలు- పెట్టుబడి లేదా దీర్ఘకాలిక రుణాలు
నీటి పారుదల, వ్యవసాయ యాంత్రీకరణ, భూమి అభివృద్ధి, ప్లాంటేషన్, ఉద్యానవనాలు, పంట కోతల అనంతర నిర్వహణలకు చేసే పెట్టుబడుల కోసం రైతులకు రుణ సదుపాయం లభిస్తుంది. 5 నుంచి 20 ఏళ్ల కాల వ్యవధిలో తిరిగి చెల్లించే రుణాలివి. ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్లు, ఎలక్ట్రిక్ మోటార్ల కొనుగోలు, శాశ్వతంగా భూమిని అభివృద్ధి చేయడం, అదనంగా భూమి కొనుగోలు చేయడానికి, అధిక మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. దీన్ని తక్కువ కాలంలో తీర్చడం వీలుకాదు. ఎక్కువ వాయిదాల్లో రైతులు ఈ రుణాలను తీర్చడానికి అనువుగా ఉంటుంది.
కిసాన్ క్రెడిట్ ద్వారా..
రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా పంట రుణాలు పొందవచ్చు. సాగు చేస్తున్న ప్రాంతాన్ని బట్టి, వేసిన పంటను బట్టి రుణ పరిమితి నిర్ణయమవుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డులు 3-5 సంవత్సరాలవరకు చెల్లుతాయి. ప్రమాద వశాత్తు సంభవించే మరణాలకు/వైఫల్యాలకు రిస్క్ కవర్ ఉంటుంది. పంట రుణాలకు పంట భీమా పథకాలు వర్తిస్తాయి.
తక్కావి రుణాలు– సహకార సంఘాలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, రైతులకు పరపతి సౌకర్యాలను అందించక ముందే ప్రభుత్వం రైతులకు స్వల్ఫకాలిక, దీర్ఘకాలిక రుణాలను ఇచ్చేది. ముఖ్యంగా కరవు కాటకాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులను ఆదుకోవడానికి ఇచ్చే రుణాలను తక్కావి రుణాలంటారు. రైతులు ఈ రుణాలను తక్కువ వడ్డీతో, ఎక్కువ వాయిదాల్లో తీర్చేటట్టుగా వెసులుబాటు ఉండేది. అయితే కఠినమైన నియమాలు, రుణాల మంజూరులో జాప్యం వల్ల ఇప్పుడివి లేకుండా పోయాయి.
వడ్డీ రాయితీ పథకం…
చిన్నసన్నకారు రైతులకు లబ్ధి చేకూరేలా పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించేలా వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పథకం. ఉదాహరణకు 2019 ఖరీఫ్‌లో 14.27 లక్షల మంది రైతులు, 2019-20లో రబీలో 6.28 లక్షల మంది రైతులకు వడ్డీ రాయితీ వచ్చింది.
ఎలా పొందాలంటే..
రాష్ట్రంలో సుమారు 87 లక్షల మంది (ఇప్పటి ప్రభుత్వ లెక్క) రైతులు ఉంటారని అంచనా. వారిలో 2020లో 86 లక్షల మందికి పైగా రైతులకు రూ.1.47 లక్షల కోట్ల రుణాలు ఇచ్చారు. వీరిలో లక్ష లోపు రుణం తీసుకున్న వారు సుమారు 20 లక్షల మంది నిబంధనల ప్రకారం పంట రుణాలపై 7 శాతం వడ్డీ వసూలు చేస్తారు. సకాలంలో రుణాలు చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది. మిగతా 4 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏ పంటకు రుణం తీసుకుంటారో ఆ పంటనే సాగు చేయాలి. ఈ-క్రాప్ లో నమోదు తప్పని సరి. ఏడాదిలోగా చెల్లించాలి. రుణ ప్రణాళిక-2021-22- రూ. 1 లక్షా 28 వేల 660 కోట్లు. ఈ మొత్తాన్ని రైతులకు రుణాలుగా ఇస్తారు. ఇందులో పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఉంటాయి. రాష్ట్రంలో 16 లక్షల మందికి పైగా కౌలు రైతులు, పాలి రైతులు ఉన్నారని అంచనా. వీళ్లకు రుణం వచ్చేది అంతంత మాత్రమే. కేవలం 3,87,610 మందికి రుణాలు అందాయని ప్రభుత్వం చెబుతోంది.
రైతు భరోసా ఎలాగంటే…
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం – వైస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్‌ను అందిస్తోంది. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును ఇస్తోంది. భూ యజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలురైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు రైతు భరోసా అందుతుంది. 2019 అక్టోబర్ 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో అంటే 2024 వరకు రూ.67,500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందించనుంది. పీఎం కిసాన్ స్కీం కింద ఇచ్చే రూ.6 వేలకు మరో రూ.7,500 కలిపి ఇస్తున్నది.
సహకార పరపతి ఎలా వచ్చిందంటే…
గ్రామీణ రుణగ్రస్థతను నిర్మూలించడానికి 1954లో రిజర్వ్ బ్యాంక్ నియమించిన గోర్వాలా అధ్యక్షతన ఏర్పాటైన అఖిల భారత గ్రామీణ పరపతి పరిశీలన సంఘం- సహకార పరపతి సంఘాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని, సహకార మార్కెటింగ్ వ్యవస్థను ప్రోత్సహించాలని సిఫార్సు చేసింది. గోర్వాల నివేదికకు అనుగుణంగా 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ను జాతీయం చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చింది.
1956లో జాతీయ వ్యవసాయ పరపతి దీర్ఘకాలిక కార్యకలాపాల నిధిని ఏర్పాటు చేసింది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి జాతీయ వ్యవసాయ పరపతి స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసింది. వ్యవసాయ పరపతిని మరింత ఎక్కువ చేసే క్రమంలో ప్రభుత్వం రెండు దశల్లో అంటే 1969లో 14, 1980లో ఆరు వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసి వాటి ద్వారా రైతులకు రుణాలు ఇప్పించింది. 1963లో వ్యవసాయ పునర్విత్త సంస్థను ప్రారంభించింది.
ఇన్ని చేసినా రైతులు రుణాల కోసం అల్లాడుతుండడంతో ప్రభుత్వం ప్రొఫెసర్ నరసింహం కమిటీని ఏర్పాటు చేసి దాని సిఫార్సుల ఆధారంగా 1975 అక్టోబర్ రెండున ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేసింది. వ్యవసాయ గ్రామీణాభివృద్ధికి అనుగుణంగా ఆర్బీఐ ఏర్పాటు చేసిన క్రాఫికార్డ్ కమిటీ సిఫార్సు మేరకు 1982 జూలై 12న జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్- నాబార్డ్ ఏర్పాటైంది. ఇది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు, ఆర్బైకి మధ్య సంధాన కర్తగా వ్యవహరిస్తూ వివిధ బ్యాంకులకు అప్పులు ఇచ్చి వాటి ద్వారా రైతులకు ఆర్ధిక చేయూత ఇస్తుంది. రైతులకు నేరుగా రుణాలు ఇవ్వదు.
గ్రామీణ పరపతిపై సూచనలిచ్చే ఉద్దేశంతో ఆర్వీ గుప్తా నేతృత్వంలో 1997లో ఏర్పాటైన కమిటీ వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక విజ్ఞానాన్ని రైతులకు అందిచేలా వాణిజ్య బ్యాంకులు కృషి చేయాలని సిఫార్సు చేసింది. దేశంలో 1904 నుంచి సహకార సంస్థలున్నప్పటికీ రైతులకు అందుబాటులో లేకుండా పోయాయన్న విమర్శలను ఎదుర్కొన్నాయి.
మరి నివారణోపాయం ఏమిటీ?
వ్యవసాయం కోసం వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార సంఘాలు సంస్థాగత పరపతి సౌకర్యాలను గ్రామీణ రైతులకు ఎక్కువగా అందించాలి. ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ప్రభుత్వం నియంత్రించాలి. అధిక వడ్డీ వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలి. కరవు పరిస్థితుల్లో రైతు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసి సన్న, చిన్న కారు రైతులను ఆదుకోవాలి. రైతులకు ఆధునిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంట రుణాల, టర్మ్ రుణాల అవసరాలు తీర్చడం కోసం వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార రుణ సంస్థల విస్తృత నెట్ వర్క్ అందుబాటులో ఉన్నది. బ్యాంకు రుణాలను సకాలంలో తీసుకుని తిరిగి చెల్లించేలా చూసుకోవాలి. రైతులు తాము పొందిన రుణ సహకార వివరాలను సరైన పద్దతిలో రికార్డు చేయాలి. బ్యాంకు రుణం ఏ అవసరం కోసం పొందారో ఆ అవసరం కోసమే వినియోగించాలి.
సహకార సంఘాలు నిర్వీర్యం అవుతున్న తీరిది…
రైతాంగానికి అందుబాటులో ఉండేవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు. మొదట ఎటువంటి రుసుము చెల్లించకుండానే గ్రామ రైతులు ఈ సంఘాల ద్వారా పంట రుణాలు, ఎరువులు పొంది, పంటలు వచ్చిన తర్వాత తిరిగి చెల్లించేవారు. కొంతకాలం గడిచిన తర్వాత పది రూపాయలు ఇచ్చి సంఘంలో సభ్యులుగా చేరి ఆ సంఘం ద్వారానే ప్రాంతీయ వ్యవసాయ కో ఆపరేటివ్ బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందేవారు.
గ్రామ సొసైటీ ఎరువులు, విత్తనాలు తీసుకొచ్చి సంఘ సభ్యులకు అందించేది. ప్రస్తుతం పరపతి సంఘాల్లో సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. సభ్యత్వ రుసుం 300 రూపాయలైంది. ఈ సంఘాల ఎన్నికలు కూడా పంచాయతీ ఎన్నికల మాదిరిగా తయారయ్యాయి. గెలుపు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా ఈ సంఘాల్లో కూడా అవినీతి తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉన్నవారు తమకు ఇష్టమైన వారినే కొత్తగా సభ్యులుగా చేర్చుకుంటున్నారు.
భారతదేశంలో సహకార ఉద్యమం 19వ శతాబ్దం చివరలో ప్రారంభమైంది. గ్రామాల్లో అధిక వడ్డీలను దండుకునే వారికి వ్యతిరేకంగా సహకార వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైతాంగానికి రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర సహకార బ్యాంకులకు నాబార్డు నిధులు కేటాయిస్తే, దాని నుంచి జిల్లా సహకార బ్యాంకులకు, అక్కడి నుంచి ప్రాంతీయ బ్యాంకులకు నిధులు విడుదల అయ్యేవి. సహకార బ్యాంకులు ప్రాథమికంగా రైతులకు, చిన్న మొత్తాల రుణ గ్రహీతలకు రుణ సహకారం అందించాలి. ఈ బాధ్యతను నేడు సహకార సంఘాలు, సహకార బ్యాంకులు సరిగా నెరవేర్చలేక పోతున్నాయి.
1980 వరకు రైతాంగానికి రుణాలు అందించటంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషించాయి. వాణిజ్య బ్యాంకుల వద్దకు వెళ్లే రైతులు చాలా తక్కువగా ఉండేవారు. నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచ వాణిజ్య ఒప్పందం, పాలకుల ప్రైవేటీకరణ విధానాల వల్ల వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల, బ్యాంకుల వ్యవస్థ బలహీనపడి సేద్య రుణాల్లో వాణిజ్య బ్యాంకుల ఆధిపత్యం ఏర్పడిరది.
2015 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 92,789 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉండగా 12.11 కోట్ల సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2,051 ప్రాథమిక సంఘాలున్నాయి. వీటిలో అధిక శాతం పంట రుణాలకే పరిమితమయ్యాయి. ఇతర రుణాల్లో అధికార పార్టీల రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రాజకీయ పరపతి కేంద్రాలుగా మారుతున్నాయి.
ఈ సంఘాల్లో అవినీతి పేరుకుపోతున్నది. పెద్ద నోట్ల రద్దు సమయంలో సహకార బ్యాంకులు కుంభకోణాలకు నిలయంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం లొసుగులను ఉపయోగించుకుని రైతుల పేరుతో సంపన్న వర్గాలు కోట్లాది రూపాయలు సహకార బ్యాంకుల్లో జమ చేయటం వాటి అవినీతికి నిదర్శనం. రాష్ట్రంలోని ప్రాథమిక సంఘాల్లో 45శాతం నష్టాల్లో ఉన్నాయి. నాబార్డు జాతీయ సమ్మిళిత అధ్యయనం (2016`17) ప్రకారం దేశంలో సంస్థాగత రుణాలు పొందుతున్న గ్రామీణ కుటుంబాల సంఖ్య చాలా తక్కువ ఉంది.
చత్తీస్‌గఢ్‌లో 26, మధ్యప్రదేశ్‌లో 35, రాజస్థాన్‌లో 31 శాతం గ్రామీణ కుటుంబాలకే రుణాలు అందగా, వీరిలో సంస్థాగత రుణాలు పొందిన వారు వరుసగా 16, 21, 19శాతంగా ఉన్నారు. వాస్తవంగా పొలం దున్ని పంటలు పండిరచే రైతులకు బ్యాంకులు రుణాల ఇవ్వటం లేదు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు భూ యజమానులకు ఇస్తున్నట్లుగానే పంట రుణాలు సైతం వారికే ఇస్తున్నాయి. కౌలు రైతులకు రుణాలు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాయి. కౌలు రైతులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా లక్షన్నర వరకు పంట రుణాలు ఇవ్వాలని రిజర్వు బ్యాంకు సూచనలను బ్యాంకులు పాటించటం లేదు.
క్రమక్రమంగా రైతాంగానికి సహకార బ్యాంకులు ఇచ్చే రుణాలు తగ్గిపోతున్నాయి. 2015`16లో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు ఇచ్చిన రుణాలు 17 శాతం అయితే, 2018 నాటికి 12 శాతానికి తగ్గిపోయాయి. ఇదే కాలంలో వ్యవసాయ రుణాలు 3.39 లక్షలకు పెరిగాయి. దీన్ని గమనిస్తే సహకార బ్యాంకుల రుణాలు తగ్గి, వాణిజ్య బ్యాంకుల రుణాలు పెరిగాయి. 2020లో 76 % రుణాలు వాణిజ్య బ్యాంకులే రైతులకు ఇచ్చాయి.
వాణిజ్య బ్యాంకుల రుణ నిర్ణయం, వడ్డీ విధానం రైతాంగానికి నష్టదాయకంగా ఉంది. రైతుల పేరుతో సంపన్న కుటుంబాలు బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్నాయి. ఇంతకు ముందు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉండేది.
నేడు మూడు లేక నాలుగు సంఘాలను ఒకే సంఘంగా, అలాగే బ్యాంకులను ఒకే బ్యాంకు పరిధిలోకి మార్చారు. ఫలితంగా అనేక ఇబ్బందులను రైతులు ఎదుర్కొంటున్నారు. వాణిజ్య బ్యాంకుల కన్నా గ్రామీణ ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, బ్యాంకులు రైతాంగానికి అందుబాటులో ఉంటాయి. సంఘ సభ్యులందరూ పంట రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల వ్యాపార సరళి వలన అత్యధిక రైతాంగానికి పంట రుణాలు అందడం లేదు.
సహకార బ్యాంకుల, సంఘాల అవినీతిని అరికట్టి, సంఘాల్లో విస్తృతంగా సభ్యులు చేరే విధంగా సభ్యత్వ రుసుము తగ్గించి, కౌలు రైతులను కూడా సభ్యులుగా చేర్చుకోవాలి. నాబార్డు ద్వారా సహకార బ్యాంకులకు ఎక్కువ నిధులు కేటాయించాలి. ఆవిధంగా సహకార సంఘాలను, బ్యాంకులను పటిష్టపర్చాలి. ఇందుకోసం రైతాంగం ఆందోళన చేయాలి.
ఆకుల అమరయ్య, సీనియర్ జర్నలిస్టు, ఫోన్ : 9347921291
Also Read: ఉప్పు ప్రభావిత నేలల సమస్యలు మరియు యాజమాన్యం
Leave Your Comments