శీతాకాలంలో సాగుచేసే కూరగాయ పంటలలో ముఖ్యమైనది కాలీఫ్లవర్. ఈ పంట ముఖ్యంగా దీని యొక్క లేత పూల కోసం సాగు చేయబడుతుంది. కాలీఫ్లవర్ నందు విటమిన్ ఎ,సి అధికంగా లభిస్తాయి. అంతేకాకుండా ఇవి భాస్వరం, పొటాషియం, కాల్షియం, సోడియం ,ఐరన్ వంటి ఖనిజలవణాలు కలిగి ఉంటాయి. ఈ పంటలో గ్లూకోజైడ్ సినిగ్రిన్ అనే పదార్ధం కలిగి ఉండటం వల్ల ఈ పంట ఒక రకమైన వాసనను కలిగి ఉంటాయి. వీటిలో 1.4 నుంచి 2.4 శాతం వరకు ప్రోటీన్లు చాలా తక్కువ శాతం అనగా 0.2 శాతం వరకు కలిగి ఉంటాయి. కాలీఫ్లవర్ తినడం వల్ల పేగు కేన్సర్ రాకుండా ఒక కవచంలా పనిచేస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న క్యాలీఫ్లవర్ పంటను లాభదాయకంగా సాగు చేయడానికి మేలైన యాజమాన్య పద్ధతులను తెలుసుకుందాం.
వాతావరణం : క్యాలీఫ్లవర్ చాలా చల్లని వాతావరణం అనగా 4 డిగ్రీల సెంటి.గ్రేడ్ నుంచి 25 డిగ్రీల సెంట.గ్రే ఉష్ణోగ్రత వరకు మంచి దిగుబడి నాణ్యత కలిగిన క్యాలీఫ్లవర్ పువ్వులను ఇస్తాయి. కానీ ఇప్పుడు మనకు అధిక ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని అన్ని ప్రాంతాలకు అనువైన సుటింకాలు సంకర రకాలు విడుదల చేశారు. మన రాష్ట్రంలో జూలై – ఆగస్టు నుంచి జనవరి – ఫిబ్రవరి వరకు వీటిని నాటుకోవచ్చు.
నేలలు : అన్ని రకాల నేలల్లో నీటి వసతి ఉన్నట్లయితే కాలీఫ్లవర్ ను సాగు చేసుకోవచ్చు. కానీ ఎక్కువ ఆమ్ల గుణం కలిగిన నేలల్లో కాల్షియమ్ , మెగ్నీషియం, మాలిబ్బనం లోపాలు ఎక్కువగా వస్తాయి. లోతైన నల్లరేగడి నేలల్లో ఈ పంటల సాగు చేసినట్లయితే ముందు మొక్కల శాఖీయ పెరుగుదల నెమ్మదిగా ఉండి, మంచి నాణ్యమైన పువ్వులను ఇస్తాయి. ఈ పంటను క్షారగుణం కలిగి ఉన్న నేలల్లో బాగానే తట్టుకొని, తగిన లాభదాయకంగా సాగు చేసుకోవచ్చు.
విత్తన మోతాదు :
సూటి రకాలు : ఎకరాకు 200 గ్రా నుంచి 250 గ్రా.
సంకర రకాలు : 80 – 120 గ్రాములు.
స్వల్ప కాలిక రకాలు : జూలై – ఆగస్టు
మధ్య కాలిక రకాలు : సెప్టెంబర్ లో
దీర్ఘకాలిక రకాలు : అక్టోబర్ – నవంబర్లో నారుమడిలో విత్తుకొని తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.
స్వల్పకాలిక రకాలు : ఎర్లీ క్వరి, పూసాకట్కి, పూసాదీపాలి
మధ్యకాలిక రకాలు : ఇరిప్రువిడ్ జపనీస్, పంత్ శుభ్ర, పూసాహిప్ జ్యోతి,పూసా హైబ్రిడ్ – 2 , ఊటీ నెం – 1
దీర్ఘకాలిక రకాలు : పూసా సింథటిక్, పూసా శుభ్ర,డానియా,పూసా స్నోబాల్ , పూసా స్నో బాల్ -1
ఇవికాక అనేక ప్రైవేటు కంపెనీలు విడుదల చేసిన సంకరాలు సాగుచేయబడుతున్నవి. ఇండో అమెరికన్, నామ్ దారి , ఈస్ట్ వెస్ట్, మహికో , బీజ్మోజీతాల్ వంటి కంపెనీలు తయారు చేసిన విత్తనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
ప్రధాన పొలం తయారీ : భూమిని రెండు లేదా మూడు సార్లు బాగా దున్నిన తర్వాత సాలుకు అడ్డంగా లేదా ఉత్తర దక్షిణ దిక్కులుగా రెండు అడుగుల ఎడంతో బోదెలు వేసుకోవాలి. 4 – 6 వారాల వయస్సు గల నారును పొలంలో నీటిని పెట్టి నాటాలి నాటేటప్పుడు బోవేలపై నాటాలి.
నాటే దూరం :
స్వల్పకాలిక రకాలు : 65 * 30 సెంటి మీటర్లు లేదా 40 * 30 సెంటీమీటర్ల
మధ్య కాలిక రకాలు : 60 * 40 సెంటీ మీటర్ల
దీర్ఘ కాలిక రకాలు : 60 * 60 సెంటీమీటర్లు .
నీటి యాజమాన్యం : నాటిన వెంటనే నీరు పెట్టాలి నల్లరేగడి నేలల్లో 7 – 10 రోజులకొకసారి. తేలిక నేలల్లో 5 – 6 రోజులకు ఒకసారి చొప్పున నీరు పెట్టాలి. కాలీఫ్లవర్ నీటిని ఇష్టపడే పంట కాబట్టి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి కాలీఫ్లవర్ పంటకు ఒక అడుగు లోతులో ఉన్న వేరు వ్యవస్థ మొత్తం నీటిని అందిస్తుంది. కాబట్టి ఒక అడుగు లోతు వరకు భూమి తడిచేలా నీరు కట్టాలి. కాలీఫ్లవర్ లో నీటి ఎద్దడి ఏర్పడినట్లతే పువ్వులు రంగు మారతాయి.
ఎరువులు :
- చివరి దుక్కిలో ఎకరాకు 8 – 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేప పిండి, 2 కిలోల అజోస్పరిల్లం , 2 కిలోల పాస్ఫోబ్యాక్టీరియా, 60 – 80 కిలోల భాస్వరము, 40 కిలోల పొటాష్ లను ఇచ్చే ఎరువుల వేయాలి.
- 24 – 32 కిలోల నత్రజని ఎరువును అనగా 100 నుంచి 120 కిలోల యూరియా రూపంలో మూడు భాగాలుగా చేసి నాటేటప్పుడు 30 వ , 60 వ రోజున వేసుకోవాలి. దీర్ఘకాలిక రకాలకు 75 – 80 రోజులకు మూడవసారి వేయాలి.
అంతరకృషి : రెండు లేక మూడుసార్లు అంతర కృషి చేయాలి. మట్టిని కదిలించడం వల్ల మొక్కలకు బాగా గాలి తగిలి ఆరోగ్యంగా ఉంటాయి.
Also Read : రాష్ట్ర వ్యవసాయ శాఖకు నిధులు విడుదల…
కలుపు నివారణ :
పెండి మిథాలిన్ ( స్టాంప్ ) అనే మందును 6 మిల్లీ-లీటర్ల లీటరు నీటికి కలిపి మొక్కలు నాటిన 48 గంటల్లోపు తేమగల నేలపై 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఈ విధంగా చేయడం వలన పంట తొలి దశలో (20 నుండి 25 రోజుల లోపు కలుపు లేకుండా చేసుకోవచ్చు.
దిగుబడి :
సూటి రకాలు: ఎకరాకు 8 టన్నులు
సంకర రకాలు : ఎకరాకు 20 – 22 నెలల సమయంలో చేసుకోవాలి. సైజును బట్టి గ్రేడింగ్ చేసి మార్కెట్ కు తరలించాలి.
సమగ్ర సస్యరక్షణ :
- నాణ్యమైన నారును ఎత్తైన నారుమడుల్లో పెంచుకోవాలి.
- ప్రధాన పొలంలో నాటేటప్పుడు ప్రతి 25 వరుసల క్యాలీఫ్లవర్ తో రెండు వరుసల ఆవాలు ఎరపంటగా వేయాలి.
- మొదటి పదిహేను రోజులకు రెండు వరుస ఆవాల పంట వేయాలి.
- 5 శాతం వేప గింజల ద్రావణం ప్రతి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
- ఆవ పంటపై ఆశించిన పురుగుల నివారణకు డైక్లోరోవాస్ 1 మిల్లీ లీటరు ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
- అవసరాన్నిబట్టి 10 రోజుల వ్యవధితో రసం పీల్చే పురుగుల నివారణకు అంతర్వాహిక కీటక నాసినులైన డైమిథోయేట్ 2 మి.లీ లీటరు లేదా ఫిప్రోనిల్ 2 మీ.లీ ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
- అత్యవసర పరిస్థితుల్లో డైమండ్ రెక్కల పురుగుల నివారణకు నోవాల్యు రాన్ 1 మీ.లీ ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
- డైమండ్ రెక్కల పురుగుల ఉనికిని గమనించడానికి పొలంలో ఎకరాకు 4 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టాలి.
- వారానికి ఒకసారి చొప్పున వరుసగా 4 వారాలు ఎన్.పి.వి వైరస్ ద్రావణం 250 మిల్లీ /లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి.
- ఎకరానికి 20 చొప్పున పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.
- పెద్ద పురుగుల నివారణకు విషపు ఎరలను తయారుచేసి పొలంలో అక్కడక్కడ ఉంచాలి.
- విషపు ఎరల తయారికి 10 కిలోల తవుడు , 10 కిలోల బెల్లం పాకం + 1000 మీ. లీ మోనో క్రోతోఫాస్ తగినంత నీటితో కలిపి చిన్న చిన్న ఉండలు చేసి 24 గంటల పాటు ఉంచి తరువాత పొలంలో అక్కడక్కడ సాయంత్రం వేళల్లో పెట్టాలి.
- నారుకుళ్ళు తెగులు నివారణకు బ్లైటాక్స్ 3 గ్రా. ఒక లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణంలో ముంపుగా తడపాలి.
- కుళ్ళు రోగం ఆశించినప్పుడు మ్యాంకోజెబ్ 3 గ్రా. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి మొక్క చుట్టూ మట్టి బాగా తడిచేలా పోయాలి.
కాలీ ఫ్లవర్ సాగులో ఇతర సమస్యలు :
బట్టనింగ్ : చిన్న చిన్న పూలు ఏర్పడతాయి. దీనికి గల కారణాలు ముదురు నారు నాటుకోవడం ,నత్రజని తగిన మోతాదులో సమయానుకూలంగా వేయాలి. స్వల్ప కాలిక రకాలను సరైన సమయంలో నాటు కోవాలి.
రైసీనెస్ : వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే పువ్వు వదులుగా విచ్చుకున్నట్లుగా అయ్యి ,పూ గడ్డపై నూగు వస్తుంది. ఇటువంటి పూలకు మార్కెట్ విలువ తక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే రకాలను, పువ్వులను సరైన సమయంలో ఆలస్యం చేయకుండా కోత కోయాలి.
బ్రౌనింగ్ : క్షార నేలల్లో పెంచే పంటలలో బోరాన్ లోపం ఎక్కువగా వస్తుంది. బోరాన్ ధాతు లోపం వలన పువ్వు పై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరు కారుతుంది. బ్రౌనింగ్ నివారణకు దుక్కిలో 8 – 10 కిలోలు /ఎకరాకు చొప్పున బోరాక్స్ 3 గ్రా /లీ పిచికారి చేయాలి.
కొరడా తెగులు : మాలిబ్దనం ధాతు లోపం వలన ఆకులు పసుపుగా మారి, అంచులు తెల్లబడతాయి. లోపం తీవ్రంగా ఉంటే ఒక మధ్య ఈనే మాత్రమే ఉంటుంది.
నివారణ : నత్రజని ఎరువుల మోతాదు ఎక్కువైతే మాలిబ్డిను మొక్కకు అందుబాటులో ఉండదు. అందువలన తగినంత మేరకు నత్రజని ఎరువు వేయాలి. ఎకరాకు 400 గ్రా సోడియం లేదా అమ్మోనియం మాలిబ్దేట్ 200 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలి.
కాలీ ఫ్లవర్ పువ్వు తెల్లగా ఉండాలంటే పువ్వు ఏర్పడే దశలోనే చుట్టూ ఉన్న ఆకుల చివరి వరుసకు పువ్వు పై కప్పుతూ (సూర్యరశ్మి చేరకుండా చేసి) దారం లేదా రబ్బర్ బ్యాండ్ కట్టాలి. ఆ తర్వాత 4–5 రోజులకి తీసి కోత కోయాలి.
డాక్టర్ . వి.చైతన్య, డాక్టర్.జె హేమంత్ కుమార్, డాక్టర్.కె . రవి కుమార్ డాక్టర్. జెస్సి సునీత కృషి విజ్ఞాన కేంద్రం , వైరా
Also Read : జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ?