ఆంధ్రప్రదేశ్వార్తలు

ANGRU: ఎన్జీ రంగా వ్యవసాయ వర్శిటీ నుంచి మూడు కొత్త వంగడాలు ప్రధాని నరేంద్ర మోది చేతుల మీదుగా విడుదల

1

ANGRU: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, కూలీల కొరతను అధిగమించి అధిక దిగుబడులను సాధించే దిశలో మూడు కొత్త వంగడాలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో ఆగష్టు 11 న న్యూ ఢిల్లీలో విడుదల చేసిన 109 వంగడాల్లో ఎన్జీ రంగా వర్శిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన మూడు వంగడాలున్నాయి. దేశీ శనగలో నంద్యాల గ్రామ్ (ఎన్.బి.ఇ.జి.-1267), పెసరలో లాం పెసర(ఎల్.జి.జి-610)., వేరుశనగలో ఐసీఏఆర్ కోణార్క్ (టీసీజీఎస్ 1707) రకాలను వర్శిటీ అభివృద్ధి చేసింది. వీటి ప్రత్యేక లక్షణాలను వర్శిటీ ఉపకులపతి డా.ఆర్.శారద జయలక్ష్మీదేవి ఓ పత్రిక ప్రకటనలో వివరించారు. ఈ వంగడాలను ప్రధాని మోదీ విడుదల చేయడం గర్వకారణంగా ఉందని చెప్పారు. ఆ వంగడాల ప్రత్యేక గుణగణాలు ఇలా ఉన్నాయి.

నంద్యాల గ్రామ్ (ఎన్.బి.ఇ.జి.1267): రబీ కాలానికి అనుకూలమైన దేశీ శనగ రకం. పంట కాలం 90 నుంచి 95 రోజులు. దిగుబడి ఎకరాకు సుమారు 8.4 క్వింటాళ్లు. ఎండు తెగులును తట్టుకుంటుంది. యంత్రంతో కోతకు అనువైన రకం.ఒకటి,రెండు రక్షిత నీటి తడులతో పండించుకోవచ్చు. విత్తనాల్లో15.98 శాతం మాంసకృత్తులుంటాయి. దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రబీలో సాగుకు అనుకూలం.

ఐసీఏఆర్ కోణార్క్ (టీసీజీఎస్-1707): ఖరీప్ కాలానికి అనుకూలమైన వేరుశనగ రకం.110 నుంచి 115 రోజుల్లో పంటకొచ్చి, ఎకరాకు 9.9 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. రసం పీల్చే పురుగులను తట్టుకుంటుంది. ఆకుమచ్చ, వేరుకుళ్లు, కాండంకుళ్లు, వేరు ఎండు తెగుళ్లను మధ్యస్థంగా తట్టుకుంటుంది. పప్పు దిగుబడి 70 నుంచి 75 శాతం ఉంటుంది. 49 శాతం నూనె దిగుబడి వస్తుంది. వంద గింజల బరువు 40 నుంచి 45 గ్రా. ఉంటుంది. 29 శాతం మాంసకృత్తులు ఉంటాయి. అధిక నీటి వినియోగ సామర్థ్యం గల రకం. కాయలన్నీ ఒకేసారి పక్వానికి వస్తాయి.గింజలు లేత గులాబీ రంగులో ఉంటాయి.

Also Read:PJTSAU :విద్య,జ్ఞానంతో సర్వసవాళ్లు ఎదుర్కోవచ్చు జయశంకర్ వర్శిటీ పదో వ్యవస్థాపక దినోత్సవంలో డా.బి.జగదీశ్వర్ రావు

లాం పెసర-610 (ఎల్.జి.జి. 610 ): రబీ కాలానికి అనువైన పెసర రకం. 74 రోజుల్లో పంటకొస్తుంది. దిగుబడి ఎకరాకు 4.47 క్వింటాళ్లు వస్తుంది. ఎల్లో మొజాయిక్ వైరస్ తెగులును తట్టుకుంటుంది. యంత్రంతో కోతకు అనువైన రకం. రబీలో వరి మాగాణుల్లోనే గాక మెట్ట ప్రాంతాల్లో కూడా సాగుకు అనువైనది. మాంసకృత్తులు 23.16 శాతం ఉంటాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా రాష్ట్రాలలో రబీలో సాగుకు అనువైన రకం.

Leave Your Comments

PJTSAU :విద్య,జ్ఞానంతో సర్వసవాళ్లు ఎదుర్కోవచ్చు జయశంకర్ వర్శిటీ పదో వ్యవస్థాపక దినోత్సవంలో డా.బి.జగదీశ్వర్ రావు

Previous article

Diseases In Coconut Grove: కొబ్బరిలో మొవ్వు కుళ్ళు తెగులు సోకుతుందా ? రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు …

Next article

You may also like