ఆంధ్రప్రదేశ్తెలంగాణవార్తలు

Rajma Farming: రాజ్మా చిక్కుళ్ల సాగు – విత్తనోత్పత్తి

0
Rajma Farming
Rajma

Rajma Farming: రాజ్మా పంటను ముందస్తు రబీ కాలంలో పండిస్తారు. ఈ పంట అధిక మంచు, మురుగు నీటి నిల్వకు తట్టుకోలేదు. ఈ పంట పెరుగుదలకు ఉష్ణోగ్రతలు 10 – 27 డి.సెం.గ్రే. అనువైనది. ఉష్ణోగ్రత సాధారణం కంటే అధికంగా (30 డి.సెం.గ్రే.కన్నా ఎక్కువ) ఉంటే పూత రాలడం ప్రధాన సమస్యగా మారుతుంది. తక్కువగా (5 డి.సెం.గ్రే.కన్నాతక్కువ) ఉంటే మొక్క శాఖీయాభివృద్ధి చెందదు. అదే విధంగా పూత, కాయలు కూడా అభివృద్ధి చెందక గిడసబారిపోతాయి.అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగుచేస్తున్నారు.
నేలలు: నీరు ఇంకే ఇసుక, బంక మట్టి నేలలు, మురుగు నీటి వసతి ఉండి తగినంత తేమ నిలుపుకునే నేలలు ఈ పంటకు అనుకూలం. అధిక వర్షపాతం గల నేలలు ఎక్కువగా ఆమ్ల నేలలు అయిన కారణంగా వీటికి సున్నం (7.2 ట./ఎకరాకు) వేసుకొని పునరుద్ధరణ చేసుకోవచ్చు.పంట విత్తే ముందే సున్నంను పొలంలో వేసి కలియదున్నడం వల్ల అధిక దిగుబడులను సాధించవచ్చు.

Rajma Farming

Rajma

రకాలు – లక్షణాలు:

చింతపల్లి వైట్: 80- 85 రోజుల పంట కాల పరిమితి కలిగి ఎకరాకు 4 -4.4 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.
చింతపల్లి రెడ్: 90- 95 రోజుల పంట కాల పరిమితి కలిగి ఎకరాకు 4 -4.4 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.
అంబర్ (ఐ.ఐ.పి.ఆర్ 96-4):110- 115 రోజుల పంట కాల పరిమితి కలిగి ఎకరాకు 6.4- 7.2 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.
ఉత్కర్ష్ (ఐ.ఐ.పి.ఆర్ 98-5): 110- 115 రోజుల పంట కాల పరిమితి కలిగి ఎకరాకు 6.4 – 7.2 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.
జ్వాల (ఐ.ఐ.పి.ఆర్ 98-5):115- 120 రోజుల పంట కాల పరిమితి కలిగి ఎకరాకు 5.6 – 6.4 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.
అరుణ్ (ఐ.ఐ.పి.ఆర్ 98-3-1):110- 115 రోజుల పంట కాల పరిమితి కలిగి ఎకరాకు 5.6 – 6.4 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.
విత్తే సమయం: ఆగష్టు రెండవ పక్షం నుంచి సెప్టెంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.సెప్టెంబర్ రెండవ పక్షం తర్వాత విత్తితే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి.
విత్తడం: ఎకరాకు 20-30 కిలోలు విత్తనం అవసరం. నేలను బాగా దున్ని చక్కని పదును వచ్చేటట్లు చేయాలి. విత్తేటప్పుడు వరుసల మధ్య 30 సెం.మీ., వరుసల్లో మొక్కకు మొక్కకు మధ్య 10 సెం.మీ. దూరాన్ని పాటించి విత్తుకోవాలి. విత్తేటప్పుడు కిలో
విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ (గౌచో 600 ఎఫ్.ఎస్) 4 మి.లీ. చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా విత్తన శుద్ధి చేయడం వల్ల పంట తొలి దశలో వచ్చే కాండపు ఈగ, కాండపుకుళ్లు తెగుళ్లను సమర్థంగా అరికట్టవచ్చు.

ఎరువుల యాజమాన్యం:

ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియదున్నాలి. ఎకరాకు 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 20 కిలోల నత్రజని, మొత్తం భాస్వరం ఎరువులను వేసి కలియదున్నాలి.రెండవ దఫా నత్రజని 20 కిలోలు పూత సమయంలో వేసుకోవాలి.

అంతర కృషి:

రాజ్మా పంటలో కలుపు నివారణకు ఎకరాకు 1.2 లీటర్ల పెండిమిథాలిన్ విత్తిన 24-48 గంటలలోపు పిచికారి చేయాలి. పంట 30 రోజులలోపు కలుపు నివారణకు ఇమజితాఫిర్ (పర్సూట్) 1.25 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. రాజ్మా పంటలో కలుపు అధికంగా ఉంటే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి.

నీటి యాజమాన్యం:

రాజ్మా పంట మొక్కల వేళ్ళు పైపైన ఉండటం వల్ల అధికంగా తేమను తట్టుకోలేవు. నీటి పారుదల సౌకర్యం గల నేలల్లో పూతదశకు ముందు ఒకసారి నీరు పెట్టడం వల్ల మంచి పూత వస్తుంది. కాయ ఏర్పడిన తర్వాత రెండవ సారి నీరు పెట్టాలి. పుప్పించేటప్పుడు, కాయ ఏర్పడేటప్పుడు తేమ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. రాజ్మా పంటను సకాలంలో కోత చేపట్టాలి. కోసిన తర్వాత 1-2 రోజుల్లో ఆరబెట్టి నూర్పిడి చేసుకోవాలి. పంటను సకాలంలో కోయకపోతే గింజ రాలి, దిగుబడి తగ్గిపోతుంది. ఈ పంటను సకాలంలో విత్తుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.

సమగ్ర సస్యరక్షణ జాగ్రత్తలు:

* లోతైన వేసవి దుక్కులు చేసుకోవాలి.
* మురుగు నీటి పారుదల సౌకర్యంగల నేలల్లో పంట విత్తుకోవాలి.
* పురుగులు,తెగుళ్ళు తట్టుకునే రకాలను సాగు చేయాలి. ఎటువంటి పురుగులు, తెగుళ్ళు సోకని విత్తనాలను విత్తుకోవడానికి ఎంపిక చేసుకోవాలి.
* ఇమిడాక్లోప్రిడ్ (గౌచో 600 FS) 4 మి.లీ./ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
* విత్తనం 5-7 సెం.మీ. లోతులో పడేలా విత్తుకోవాలి.
* పంటను సకాలంలో విత్తుకోవాలి.
* అధిక సాంద్రతలో మొక్కలుంటే తీసివేయాలి. తద్వార కాండపు కుళ్లు, వేరుకుళ్ళు తెగులను అరికట్టవచ్చు.
* కలుపు లేకుండా చూసుకోవాలి.
* తగినంత మోతాదులో పశువుల ఎరువు లేదా రసాయనిక ఎరువులను వేసుకోవాలి.
* ఎకరానికి వేపపిండి 200 కిలోలు వేయడం వల్ల రాజ్మాలో వచ్చే తెగుళ్లను
అరికట్టవచ్చు.వెర్రి తెగులు సోకిన మొక్కలను ఏరివేసి, కాల్చివేయాలి.
* ధాన్యపు పంటతో పంట మార్పిడి చేసుకోవాడం వల్ల పక్షికన్ను,
ఆకుమచ్చ తెగుళ్లను అరికట్టవచ్చు.
* చీడపీడల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు వేప నూనె 2 మి.లీ./ లీటరు నీటికి కలిపి విత్తిన 20 రోజులకు మరియు డైమిథోయేట్ 2మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

రాజ్మా చిక్కుళ్ల లో విత్తనోత్పత్తి:

రాజ్మా చిక్కుళ్లలో విత్తనోత్పత్తిలో దిగువ తెలిపిన నిర్దిష్ట ప్రమాణాలను విత్తన ధృవీకరణ కోసం పాటించాలి.

* నేల ఆవశ్యకత: రాజ్మా చిక్కుళ్ల పంటలో విత్తనోత్పత్తికి ఉపయోగించే
పొలంలో స్వచ్ఛందంగా వచ్చిన ముందు సీజన్లో వేసిన రాజ్మా చిక్కుళ్ల మొక్కలు లేదా ఇతర మొక్కలు లేకుండా ఉండాలి.
* క్షేత్ర పరిశీలన: కనీసం రెండు తనిఖీలు చేయాలి. పుష్పించే సమయంలో మొదటి సారి, పుష్పించిన తర్వాత, గింజ ఏర్పడే దశలో రెండో సారి చేయాలి.
* వేర్పాటు దూరం: ఇతర రాజ్మా రకాలు ఉన్న క్షేత్రాలు మరియు స్వచ్ఛత తెలియని అదే రాజ్మా రకం ఉన్న క్షేత్రాలు పునాది విత్తనంలో 10 మీటర్లు, ధృవీకరణ విత్తనంలో 5 మీటర్లు వేర్పాటు దూరం ఉండాలి.
* గరిష్టంగా అనుమతించబడిన కేళీలు మరియు విత్తనం ద్వారా వ్యాప్తి చెందే
వ్యాధి సోకిన మొక్కలు పునాది విత్తనంలో 0.10 శాతం, ధృవీకరణ విత్తనంలో 0.20 శాతానికి మించి ఉండరాదు.
* విత్తన ప్రమాణాలు: పునాది, ధృవీకరణ రెండు రకాల విత్తనాల్లో భౌతిక స్వచ్ఛత (కనీసం ) 98 శాతం, జడ పదార్థం (గరిష్టంగా) 2 శాతం, మొలక శాతం (కనీసం ) 75 శాతం, తేమ శాతం (గరిష్టంగా) 9 శాతం ఉండాలి. ఇతర పంట గింజలు రెండింటిలోనూ ఏ మాత్రం ఉండరాదు. అయితే కిలోకి గరిష్టంగా ఇతర రాజ్మా రకాల విత్తనాలు పునాది విత్తనంలో 5, ధృవీకరణ విత్తనంలో 10, అలాగే కలుపు విత్తనాలు ధృవీకరణ విత్తనంలో 10 వరకు ఉండవచ్చు. పునాది విత్తనంలో ఒక్క కలుపు విత్తనం కూడా ఉండరాదు.

ఎ. సౌజన్య, ఎన్. రాజకుమార్, పి.వి.ఎస్. రామునాయుడు, ఎన్. సత్తిబాబు,
పి. బాబు, ఎన్. కిశోర్ కుమార్, వై. స్రవంతి, పి. రాజేష్
కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి. ఫోన్: : 7702296926

Leave Your Comments

Poultry Diseases During Monsoon: వర్షా కాలంలో కోళ్ళలో వచ్చే వ్యాధులు – నివారణ

Previous article

Farmer Narayanappa: 30 సెంట్లలో 20 రకాల కూరగాయలు… 2 లక్షల దాకా ఆదాయం !

Next article

You may also like