వార్తలు

Sea Weed Uses: సముద్ర నాచు ఉపయోగాలు -పెంపకంలో మెళకువలు

0
Sea Weed
Sea Weed
Sea Weed Uses: ప్రపంచ వ్యాప్తంగా 15.8 మిలియన్‌ టన్నుల సముద్ర నాచును ఉత్పత్తి చేయటం ద్వారా సుమారు 7.4 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుంది. సముద్ర నాచు సముద్రంలో ఒక అద్బుతమైన నాచు మొక్క. ఇది 21 వ శతాబ్దానికి ఔషధ ఆహారం. ఔషధ, ఖాదీ మరియు ఇతర రసాయనిక పరిశ్రమలలో సముద్ర నాచుకు ఎంతగానో గిరాకీ ఉన్నది. సముద్ర నాచును వివిధ రకాల మొక్కల పెరుగుదలకు అవసరమైన గ్రోత్‌ ప్రమోటర్ల తయారీలో మరియు జీవన ఎరువుల తయారీలో కూడా విరివిగా వినియోగిస్తున్నారు. ఇవి ఎక్కువగా మొక్కల పెరుగుదలకు తోడ్పడే ఆక్సిన్లు, సైటోకైనిన్లు మరియు జిబ్బరిన్లు మొదలైన వాటిని తయారు చేసి వినియోగిస్తున్నారు.
Sea Weed

Sea Weed

సముద్రనాచు సముద్రంలో ఉన్న వివిద జీవ రాశులకి అవాసాన్ని కల్పించటమే గాకుండా హరిత గృహ వాయువైన బొగ్గు పులుసు వాయువును (కార్బన్‌ డైయాక్సైడ్‌) ఎక్కువగా గ్రహించుకొని భూమి వేడెక్కడాన్ని కొంతవరకూ తగ్గించటంలోను ఎక్కువగా ఉపయోగపడుతుంది. సముద్ర నాచు నుంచి అగార్‌, లిగ్నైట్లు తయారు చేస్తున్నారు. సముద్ర నాచు నుంచి ఇధనాల్‌ మరియు పోషకాహారాన్ని కూడా తయారు చేసి వియోగించటం జరుగుతుంది. జాతీయ ఉప్పు  మరియు సముద్ర రసయానాల పరిశోధనా సంస్థ, భావనగర్‌, గుజరాత్‌ వారు సముద్ర నాచు రసం  నుంచి ద్రవరూప జీవన ఎరువును తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేయటం జరిగింది.
ఒక గ్రాము సముద్ర నాచు రోజు వారీ మన ఆహారంలో తీసుకున్నప్పుడు అయోడిన్‌, ఐరన్‌, మెగ్నీషియం, సెలీనియం మరియు ఇతర సూక్ష్మ పోషకాలు అంది ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. సముద్ర నాచు పెంపకం వలన మత్స్యకారులకు సముద్రంలో వేట మార్చి నుంచి ఏప్రిల్‌ వరకు నిలుపదల చేసినప్పుడు మరియు సంవత్సరం పొడవునా పనిని కల్పించవచ్చు తద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచవచ్చు.
సముద్ర నాచు పెంపకానికి కావల్సిన వస్తువులు మరియు వాటి ధరల వివరాలు: 
మత్స్యకారులకు: 
1. పాత చేపలు పట్టే వల సుమారు 6 కిలోలు, కిలోకి రూ. 70/- చొప్పున మొత్తానికి రూ. 420/-
2. 3 మి.మీ. పాలీప్రోపలిన్‌ తాడు 3 కిలోలు, కిలోకి రూ. 200/- చొప్పున మొత్తానికి రూ. 600/-
3. 8 మి.మీ. పాలీప్రోపలిన్‌ తాడు 5 కిలోలు, కిలోకి రూ. 200/- చొప్పున మొత్తానికి రూ. 1000/-
4. 12 మి.మీ. పాలీప్రోపలిన్‌ తాడు 7 కిలోలు, కిలోకి రూ. 200/- చొప్పున మొత్తానికి రూ. 1400/-
5. లంగరు వేయటానికి 45 కిలోల బరువున్న నాప రాళ్ళు 4, ఒకటికి రూ. 300/- చొప్పున మొత్తానికి రూ. 1200/-
6. థర్మాకోల్‌ షీట్‌ లేదా రబ్బరు బోయలు లేదా వాడి పడేసిన ప్లాస్టిక్‌ నీళ్ళ సీసాలు 50
ఈ విధంగా మొత్తానికి ఒక యూనిట్‌కి రూ. 4620/- ఖర్చుతో తయారు చేసుకోవచ్చు.

Also Read: వేసవిలో సౌరశక్తి ద్వారా పండ్లు, కూరగాయల ఉత్పత్తులు 

సముద్ర నాచు పెంపకం: 
గొట్టపు వల పద్దతి:
మత్స్య కారుల పాత వలల సహాయంతో గొట్టపు వలలను తయారు చేసుకోవాలి. సముద్ర నాచు విత్తనాన్ని గొట్టంగా చేసుకున్న చేపల వలలో వేసుకుని, వాటికి రబ్బరు బోయలను 3 మి.మీ. పాలీప్రోపలీన్‌ తాడు సాయంతో ప్రతి గొట్టపు వలకి మూడు చొప్పున ఏర్పాటు చేసుకోవాలి, వీటి వలన గొట్టపు వలలు నీటి పైన తేలాడానికి ఉపయోగపడుతుంది. గొట్టపు వలలు పొడవు వీలైనంతగా ఉండాలి. (3-5 మీటర్లు సౌలభ్యంగా ఉంటుంది) ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తరువాత  సముద్ర నాచు విత్తనం ఏర్పాటు చేసుకున్న 20 గొట్టపు వలలని 8 మి.మీ. పాలీప్రోపలీన్‌ తాడుకు కట్టుకోవాలి.  12 మి.మీ.  పాలీప్రోపలీన్‌ తాడు సహాయంతో నాప రాయి లంగరును, సముద్ర నాచు విత్తనం ఏర్పాటు చేసుకున్న8 మి.మీ.  పాలీప్రోపలీన్‌ తాడుకు రెండు వైపుల కట్టుకోవాలి తరువాత పడవ సహాయంతో వీటిని సముద్రంలోపలికి తీసుకెళ్లి అలలు ఏర్పడనటువంటి ప్రదేశంలో జాగ్రత్తగా వదలాలి.  45 రోజుల తరువాత పూర్తిగా పెరిగిన నాచు గొట్టాలను వడ్డుకు తీసుకు వచ్చి సముద్ర నాచును వేరు పరుచుకోవాలి.
ఈ విధంగా ప్రతి గొట్టపు వలలో విత్తన మోతాదుకు సుమారు 8-10 రెట్ల వరకు నాచు పెరిగి దిగుబడిని ఇస్తుంది. గొట్టపు వల పరిమాణాన్ని బట్టి విత్తనంగా 7 నుంచి 8 కిలోలు నాచు వాడితే, 45 రోజుల తరువాత 50-80 కిలోలు దిగుబడి వస్తుంది. ఒక కిలో నాచు విఫణిలో సుమారు రూ. 6/- వరకూ ఉంటుంది. ఈ విధంగా ఒక్కో యూనిట్‌ కి 1,000-1,600 కిలోల నాచు వస్తుంది తద్వారా ఒక యూనిట్‌ నుండి రూ. 6,000-9,600 వరకూ ఆధాయాన్ని పొందవచ్చు. ఒక సారి వినియోగించిన గొట్టపు వలలనే మళ్ళీ వినియోగించుకోవచ్చు.
ఈ విధంగా మత్స్యకారులు ప్రతీ సారీ డిమాండ్‌ను బట్టి 5 యూనిట్‌లు వరకూ హార్వెస్ట్‌ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటే సంవత్సరం పొడవునా మంచి ఆధాయం పొందవచ్చు. సముద్రనాచు పెంపకం వలన సాలీన 144 -161 రోజుల పని దినాలు మత్స్యకారులకు దొరుకుతుంది. మనదేశంలో సుమారు  ఒక మిలియన్‌ టన్ను సముద్రనాచు (ఎండినది) ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇది సుమారు 2,00,000 కుటుంబాలకు సుమారు ఒక లక్ష రూపాయాల ఆదాయాన్ని ఒక కుటుంబానికి చొప్పున అందించ గలుగుతుంది. సముద్ర నాచు పెంపకానికి చాలా తక్కువ  ఖర్చుతో కూడిన సాంకేతిక పరిజ్ఞాన్ని మరియు సులభ  తరమైన పద్ధ్దతిని మత్స్యకారుల కోసం తయారు చేయటం జరిగింది.
రాఫ్ట్‌ (తెప్ప) పద్దతి:
ఈ పద్ధతిలో నాలుగు వైపులా కర్రలను చతురస్రా కారం లేదా దీర్ఘ చతురస్రా కారంగా తెప్పను  ఏర్పాటు చేసుకుని నైలాన్‌ తాడు సాయంతో విత్తన నాచును తెప్ప లోపల అల్లుకోవాలి. తెప్పకు రెండు వైపులా చేపల వలను కట్టుకుని, సముద్రంలో తెప్ప కదలకుండా లంగరు రాళ్ళను తెప్పకు నాలుగు వైపులా పాళీ ప్రోపలీన్‌ తాడు సాయంతో కట్టుకుని సముద్రంలో అలలు ఏర్పడని ప్రాంతంలో బోటు సహాయంతో వదలుకోవాలి. 45 రోజులలో నాచును తీసి హార్వెస్ట్‌ చేసుకువచ్చు.
డా. పి. వెంకట సుబ్బయ్య, సీనియర్‌ శాస్త్రవేత్త, డా.కె. అనీ మృదుల, సీనియర్‌ శాస్త్రవేత్తఉప్పునీటి పరిశోధనా కేంద్రం, బాపట్ల, ఫోన్‌ : 94410 15258
Leave Your Comments

Fruit and Vegetable Products: వేసవిలో సౌరశక్తి ద్వారా పండ్లు, కూరగాయల ఉత్పత్తులు 

Previous article

Minister Niranjan Reddy: వడ్లు కొనుగోలు విషయంలో రాజకీయ రగడ

Next article

You may also like