అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జైతవరం గ్రామానికి చెందిన బొడ్డకాయల గణేష్, సిరికి వంశీ యువకులు బి.కాం కంపుటర్స్ చదువుకున్నారు. వీరికి వ్యవసాయంలో ఉన్న ఆసక్తితో వరి, చెరకు, కూరగాయల వంటి సంప్రదాయ పంటలు సాగు చేసినప్పటికీ సరైన లాభాలు రాకపోవడంతో కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి వారు నిర్వహిoచిన 7 రోజుల పండ్ల తోటల పెంపకంపై గ్రామీణ యువతకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత వారిచ్చిన సూచనల మేరకు డ్రాగన్ ఫ్రూట్ సాగులోకి మారి, భిన్నంగా తమకంటూ వ్యవసాయంలో ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగుతో ఆర్ధిక పురోగతితో పాటు మండలంలో మంచి గుర్తింపు సాధించారు. కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి శాస్త్రవేత్తలు సూచించిన సాంకేతిక, శాస్త్రీయ సలహాలతో డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రారంభించారు. డ్రాగన్ ఫ్రూట్లో శాస్త్రవేత్తలు సూచించిన శాస్త్రీయ యాజమాన్య పద్దతులు అనగా నేల తయారీ నుంచి పండ్ల కోత వరకు… తగిన మొక్కలను ఎంచుకోవడం, సరైన నీటిపారుదల పద్ధతులైన సూక్ష్మ నీటిపారుదల పాటించడం, ఎరువుల వాడకం, పురుగులు, తెగుళ్ల నియంత్రణ, డ్రాగన్ ఫ్రూట్‌కు సంబంధించిన కత్తిరింపు పద్ధతులపై సలహాలు అందించారు. ఈ శాస్త్రీయ విధానం యువరైతులు అధిక దిగుబడి, నాణ్యత గల పంటను సాధించగలిగారు. ఈ పంట సాగుకు మొదటి సంవత్సరంలో ట్రెల్లిస్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి సుమారు రూ.5.5 లక్షలు పెట్టుబడి అవుతుంది. డ్రాగన్ ఫ్రూట్ క్లైంబింగ్ కాక్టస్ కావడంతో సరైన ఎదుగుదల, ఫలాలను అందించడానికి ధృడమైనట్రెల్లిస్ వ్యవస్థ అవసరం. ఈ పంట సాగుకు ఎడు ఆడుగుల సిమెంట్ స్తంభాలు, 6 మిల్లి మీటర్ల మందం గల జి.ఐ వైర్, నాణ్యమైన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు (సియామ్ రెడ్ రకం) అవసరం. ముందుగా అధిక పెట్టుబడి కారణంగా ఎకరాతో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి నమ్మకం ఏర్పడ్డాక క్రమంగా రెండు ఎకరాలకు డ్రాగన్ ఫ్రూట్ సాగును విస్తరించారు.
సాగు చేసిన విధానం: కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి శాస్త్రవేత్తలు సూచించిన మేరకు డ్రాగన్ ఫ్రూట్ (రెడ్ రకం) రకాన్ని ఎంపిక చేసుకొని జూన్ 2023 లో ట్రెల్లిస్ పద్ధతిలో ఎకరానికి 4680 మొక్కలు నాటారు. ఇది ఎడారి మొక్క. మొదట దానిని నాటిన ఒకటి నుంచి ఐదు నెలలోపు ట్రైనింగ్, కత్తిరింపులు చేశారు. ఈ మొక్కలు అధిక బరువు ఉండటం వల్ల వీటికి ట్రెల్లిస్ వ్యవస్థ అవసరం. అందుకు ఏడు అడుగుల సిమెంట్ స్థంబాలు, 6 మిల్లి మీటర్ల మందం గల జి.ఐ వైర్ వాడటం జరిగింది. అలాగే శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు సస్యపోషణ, సస్యరక్షణ చర్యలు పాటించారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ నాటిన పది నెలలకు అనగా ఏప్రిల్ 2024లో మొదట పూత వచ్చింది. ఈ పూత నుంచి పండ్లు కోతకు రావడానికి 45 రోజుల సమయం పట్టింది. ఇలా ఈ కోతలు నెలలో రెండు సార్లు తీసుకున్నారు. ఈ కోతలు మే నెలలో మొదలలై ఎకరానికి 2.1 టన్నులు మాత్రమే దిగుబడి సాధించడం జరిగింది. ఇది ఎడారి మొక్క, బహు వార్షిక పంట గనుక ఈ పంటను సాగు చేయటానికి మొదటి సంవత్సరంలో రూ.5,43, 280/- ఖర్చు చేశారు. ఈ ఖర్చులో భాగంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గారంటీ ఆక్ట్ (MGNREGA) పథకం కింద సబ్సిడీ రూపంలో రెండు లక్షల రూపాయలు ఇచ్చారు. రెండవ సంవత్సరంలో అనగా జూన్ 2024 నుంచి అక్టోబర్ 2024 వరకు 4.82 టన్నుల దిగుబడి సాధించారు. మొదటి సంవత్సరంలో ఆశించిన ఫలితాలు రానప్పటికీ, రెండవ సంవత్సరం నుంచి మంచి ఫలితాలు, నికర రాబడి సాధించారు. ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఇంకో ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగును విస్తరించారు.
మార్కెటింగ్: డ్రాగన్ ఫ్రూట్ లో మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్నందున మార్కెట్లో దీనికి మంచి గిరాకీ ఉంది. కాబట్టి మార్కెట్లో ఒక్కో కిలో180 నుంచి 200 రూపాయలు ధర పలుకుతుంది. అంతేకాకుండా వీటిని వాట్సప్ ద్వారా, గేటెడ్ కమ్యూనిటీలలో నివసిస్తున్న పట్టణ వాసులకు నేరుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు
డ్రాగన్ ఫ్రూట్ (రెడ్ రకం) సాగులో ఆదాయవ్యయ వివరాలు(ఎకరాకు):
మొదటి సంవత్సరం ఖర్చు, ఆదాయ వివరాలు:
విస్తీర్ణం: ఒక ఎకరానికి
సిమెంట్ స్థంబాల ఖర్చు: (468 స్తంభాలు x రూ.480/- = రూ. 2,24,640/-
మొక్కల ఖర్చు: (4680 మొక్కలు x రూ. 50/- = రూ. 2,34,000/-
6 మి.మీ. జి.ఐ. వైర్ ఖర్చు: (920 కిలోలు x రూ.92/- = రూ. 84,640)
కూలీల ఖర్చు: (స్థంభాలు, మొక్కలు నాటడానిక, పండ్ల కోతలకు): = రూ.85,495/-
మొత్తం ఖర్చు = 6,28,775 /-
MGNREGA సబ్సిడీ ద్వారా అందిన డబ్బు = రూ.2,00,000/-
నికర ఖర్చు = 628775 – 2,00,000 = రూ.4,28,775/-
మొదటి సంవత్సరం దిగుబడి = 2.98 టన్నులు
కిలో రూ. 180 చొప్పున 2.98 టన్నులకు = 5,36,400/
నికర లాభం: రూ.1,07,625/-
ఆదాయ వ్యయ నిష్పత్తి: 0.25
రెండవ సంవత్సరం ఖర్చు, ఆదాయ వివరాలు:
కూలీల ఖర్చు (కలుపు తీత, కత్తిరింపులు, పిచికారికి) = రూ.1,82,545/-
దిగుబడి = 4.82 టన్నులు
కిలో రూ. 180/- చొప్పున 4.82 టన్నులకు = రూ. 8,67,600/-
నికర లాభం: 8,67,600 – 1,82,545 = రూ. 6,85,055 /-
ఆదాయ వ్యయ నిష్పత్తి: 3.75
మొదట సంవత్సరంలో ఆదాయ వ్యయ నిష్పత్తి తక్కువుగా(0.25) ఊన్నప్పుడికీ, రెండో సంవత్సరం నుంచి దిగుబడి గణనీయంగా పెరగడానికి అవకాశం ఏర్పడింది. రెండో సంవత్సరంలో ఆదాయ వ్యయ నిష్పత్తి 3.75 గా నమోదయింది. ఇలా అధిక దిగుబడులతో మంచి ఫలితాల సాధనకు కారణం అయిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జైతవరం గ్రామానికి చెందిన యువరైతులు.
ఎన్. కిశోర్ కుమార్, ఎన్. సత్తి బాబు, ఎన్. రాజకుమార్, ఎ. సౌజన్య, పి. బాబు, పి. వి. ఎస్. రాము నాయుడు, కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి, అనకాపల్లి జిల్లా.
మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్: 8639066690