PJTSAU:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 10 వ వ్యవస్థాపక దినోత్సవం సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డా.పి.రఘు రామి రెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనున్న వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బి.జె. రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎం.రఘునందన్ రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి జయశంకర్ వ్యవసాయ వర్శిటీ జాతీయస్థాయిలో అనేక ఉన్నత శిఖరాల్ని అందుకుందని,ఈ పదేళ్లలో 5 కొత్త వ్యవసాయ కళాశాలలు, ఒక ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల, 4 వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్ని ప్రారంభించినట్లు,సీట్ల సంఖ్యను 1360 కి పెంచినట్లు రఘు రామి రెడ్డి తెలిపారు.
Also Read:Prudhvi Raj Success Story: ప్రకృతి వ్యవసాయంతో సుస్థిర వ్యవసాయం
అమెరికాలోని అబర్న్ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ లో పీజీ కోర్సు అభ్యసించేందుకు విద్యార్థులకి ఓవర్సీస్ ఫెలోషిప్ అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో విశ్వవిద్యాలయం తీసుకున్న చర్యల వల్ల 2024 లో దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల్లో PJTSAU 37 వ స్థానాన్ని సాధించింది. 2017 లో ICAR ప్రకటించిన ర్యాంకుల్లో జయశంకర్ యూనివర్సిటీ జాతీయస్థాయిలో 6వ స్థానంలో నిలిచింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 పరిశోధన స్థానాల ద్వారా అన్ని ప్రధాన పంటల్లో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. వరి, మొక్కజొన్న, జొన్న, అపరాలు వంటి ప్రధాన పంటల్లో ఇప్పటివరకు 67 నూతన వంగడాలు విడుదలయ్యాయి.యూనివర్సిటీ రూపొందించిన తెలంగాణ సోనా వరి వంగడం జాతీయస్థాయిలో బాగా ఆదరణ పొందింది.
దేశంలోనే తొలిసారిగా ఈ యూనివర్సిటీ డ్రోన్ అకాడమీని నెలకొల్పింది. PJTSAU కి చెందిన తాండూర్ కంది GI గుర్తింపు సాధించింది. వ్యవసాయంలో స్టార్టప్ ల్ని ప్రోత్సహించేందుకు ప్రారంభించిన అగ్రి హబ్ మంచి పురోగతి సాధిస్తుంది. 9 డాట్ కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రాష్ట్ర రైతాంగానికి విస్తృతంగా విస్తరణ సేవలు అందిస్తుంది. యూనివర్సిటీ ఎలక్ట్రానిక్ విభాగం, రాష్ట్ర వ్యవసాయ శాఖ కలిసి రూపొందించిన ‘రైతు నేస్తం’ ప్రత్యక్ష చర్చా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీ, 2024న ప్రారంభించారు.ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకూ 556 రైతు వేదికల్ని అనుసంధానం చేసి సుమారు లక్ష 30 వేల మంది రైతులకి సలహాలు, సూచనలు అందించామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భవిష్యత్తులో యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు పునరంకితమవుతామని రఘురామి రెడ్డి ప్రకటించారు.10వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పలువురు రైతులకు, బోధన, బోధనేతర సిబ్బందికి అవార్డులను అందజేయనున్నారు.
Also Read:Success Story Of Farmer Nunna Rambabu: ఉద్యోగం వదిలి ప్రకృతి సాగు వైపు..