Korameenu Fish Farming: తెలంగాణ రాష్ట్రం ‘‘కొర్రమీను చేపను’’ రాష్ట్ర చేపగా గుర్తించింది. ఈ కొర్రమీను జాతి చేపలకు మన రాష్ట్ర మార్కెట్‌లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటం వలన రైతులు ఈ జాతి చేపలను పెంచేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కొర్రమీను చేపలను గాలి పీల్చే చేపలు అంటారు. ఇవి అనుబంధ శాస్వాంగాలతో గాలిని పీల్చుకుంటాయి. అందువల్ల ఇవి నీటి బయట కూడా చాలా సమయం బతకగలుగుతాయి.
పెంపకానికి అనువైన కొర్రమీను రకాలు:
కొర్రమీను, బొమ్మె (చన్నా స్టయేటా), పూల మట్ట, బురద మట్ట (చన్నా మరులియన్), మట్టగిడున (చన్నా పంక్టేటస్), గురుథ్ (చన్నా గచ్చువా) ఇవి ప్రధానంగా మాంసాహార చేపలు. వీటిలో కొవ్వు, ముళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. మాంసకృత్తులు, ఇనుము, అయోడిన్, విటమిన్ ఎ,డి,ఇ,కె, తోపాటు ముఖ్యమైన అమైనో ఆమ్లాలు అధిక శాతం ఉంటాయి. కొలెస్ట్రాల్ అసలు ఉండదు. ప్రాణమున్న దశలో ఉండే ఈ చేపలకు మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉంది. ఇవి బతికి ఉన్న జీవులను ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతాయి. అనుబంధ ఆహారం కూడా వీటికి అలవాటు చేయవచ్చు.
పిల్ల దశలో ఎక్కువగా జంతు సంబంధ ప్లవకాలను, లార్వాలను తింటాయి. ఫింగరింగ్ దశ, పూర్తిగా పెరిగిన చేపలు చిరుకప్పలను, చిన్న చిన్న చేపలను ఆహారంగా తీసుకుంటాయి. ఆహారాన్ని వేటాడి పట్టుకొని తినడం వీటికి చాలా ఇష్టం. కొర్రమీను చేపలు జూన్-ఆగస్టు, నవంబరు-డిసెంబరు మాసాలలో సంతానోత్పత్తి జరుపుతాయి. ఇవి నీటిలో కలుపు మొక్కల మధ్య గుడ్లు పెడతాయి.
గుడ్లు పెట్టడం, పిల్లల సంరక్షణ ఆడ, మగ చేపలు కలిసి చేపడతాయి. గుడ్డు 1.2-1,5 మి.మీ. పరిమాణంలో పసుపు రంగంలో ఉంటాయి. 24-35 గంటలలో గుడ్ల నుండి చేప పిల్లలు వస్తాయి. గుడ్డు నుండి బయటికి వచ్చిన తొలిరోజు చేపపిల్ల 3.0-4,5 మి.మీ. పొడవు ఉంటుంది. 10 రోజులలో నారింజ ఎరుపు రంగులోకి మారుతుంది. తరువాత శరీరం నలుపు, బూడిద వర్ణంలోకి మారుతుంది.
కొర్రమీను చేపల పెంపక విధానం:
కొర్రమీను చేపలను మోనోకల్చర్ (ఒకే జాతికి చెందిన చేపల పెంపకం) పద్ధతిలో పెంచుతారు. ఇవి అన్ని రకాల మంచినీటి ప్రదేశాలలో పెరుగుతాయి. తక్కువ ఆక్సిజన్, తక్కువ లోతు ఉన్న నీటిలో కూడా వీటిని పెంచవచ్చు. నీటి గాఢత 4-5 ఉన్నప్పటికీ బతుకుతాయి. మామూలుగానైతే, వీటి పెంపకానికి నీటి గాఢత 8-9, ఉష్ణోగ్రత 28-32 డిగ్రీలు ఉంటే మంచిది. నీరు పారే కాలవలు, పెద్ద జలాశయాలలో కేజ్ చట్రాలను అమర్చి ఈచేపలను విజయవంతంగా పెంచవచ్చు.
చెరువులోని నీటిని తీసివేసి మళ్ళీ చెరువును నింపే వసతి ఉన్నప్పుడు, ఎక్కువ సాంద్రతలో చేప పిల్లలను వేసి అధికోత్పత్తిని సాధించవచ్చు. వేసిన చేప పిల్లల సంఖ్య, సరైన ఆహారం, మంచి యాజమాన్య పద్ధతులను బట్టి ఉత్పత్తి ఉంటుంది. ఇవి సగటున 60-70 సెంటీమీటర్ల పొడవులో కనబడతాయి. సాధారణంగా 7 నెలల్లో 300-500 గ్రాములు, 11 నెలల్లో 500-800 గ్రాముల సైజు గల చేపలను పొందవచ్చు.
Also Read: నీరు నిలిచిన పొలాల్లో చేపల పెంపకం
ఈ సైజు చేపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. నల్లరేగడి భూములు అనువైనవి. సంవత్సరంలో పొడవునా నీరు అందుబాటులో ఉండాలి. దీర్ఘచతురస్రాకారంగా నిర్మించిన చెరువు పెంపకానికి అనువుగా ఉంటుంది. వైశాల్యం 0.05-0.1 హెక్టార్లు లేదా 0.1-0.2 హెక్టార్లు వరకు ఉండవచ్చు. హెక్టారు విస్తీర్ణంలో 300 కిలోల సున్నాన్ని వాడాలి. చెరువులో 20-30 శాతం కలుపు మొక్కలు ఉండేటట్లు చూడాలి. నీటిలోతు 2-5 అడుగులుంటే మంచిది. దీనివల్ల గాలి కోసం నీటి పైభాగానికి రావడానికి చేపలకు శ్రమ ఉండదు.
సహజ వనరుల నుంచి సేకరించిన చేప పిల్లలను, పెంపకానికి చేపట్టే స్టాకింగ్ చెరువుకు రవాణా చేయాలి. ఇనుప డ్రమ్ములలో గాని, ప్లాస్టిక్ డబ్బాలు, కుండలు లేదా బిందెలలో రవాణా చేయవచ్చు. అయితే వీటిలో చేప పిల్లలు గాలిని పీల్చేందుకు సరిపడా స్థలం ఉండాలి. ఈ పాత్రలలో వాలిస్ నేరియా, హైడ్రిల్లా వంటి నీటి మొక్కలను వేస్తే చేప పిల్లలు రవాణా సమయంలో ఎగరకుండా ఉంటాయి.
ఫింగరింగ్ దశలో ఒకే సైజు ఉన్న చేప పిల్లలను చెరువులోకి వదలటం వల్ల స్వజాతి భక్షణ ఉండదు. ఫింగర్ లిండ్లను నీటిలోకి వదిలే ముందు వాటిని 2 శాతం పొటాషియం పర్మాంగనేటు కలిపిన ద్రావణంలో 2 నిమిషాలు ఉంచాలి. తరువాత 2 శాతం ఉప్పు కలిపిన ద్రావణంలో మరో 2 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల వాటిపై ఉండే సూక్ష్మక్రిములు నశిస్తాయి.
చేప పిల్లలను ఆగస్టు- అక్టోబరు మాసం వరకు చెరువులో స్టాక్ చేసుకోవచ్చు. మోనోకల్చర్ పెంపకంలో ఒక హెక్టారుకు 30,000 నుండి 40,000 పిల్లలను వేయవచ్చు. వీటితో పాటు గడ్డి చేపలు, బొచ్చెలు హెక్టారుకు 2,000 చొప్పున వేస్తే, చెరువులో కలుపు మొక్కలను నివారించవచ్చు. బొమ్మె చేప పిల్లల కంటే బొచ్చె, గడ్డి చేప పిల్లల సైజు పెద్దవిగా ఉండాలి.
కొర్రమీను చేపల చెరువులో వాడవలసిన అనుబంధ ఆహారం:
ఫింగర్ లింగ్ దశ పిల్లలను చెరువులోకి వదలిన తరువాత ఆహార యాజమాన్యం చాలా కీలకం. ఇవి ప్రధానంగా మాంసాహార చేపలు. చేప పిల్లలు వేసిన తరువాత మొదటి రెండు నెలలు రోజుకు మూడుసార్లు, 3-5 నెలల మధ్య రోజుకు రెండుసార్లు, 6-9 నెలలవరకు రోజుకు ఒకసారి అనుబంధ ఆహారం ఇవ్వాలి.
దాణా ఇచ్చే పద్ధతులు:
ఎండు చేపలు, తౌడు (50G50 శాతం) కలిపి ఇచ్చేటప్పుడు, ముందుగా ఎండు చేపలను పొడిచేసి ఉడక పెట్టాలి. దీనికి తౌడు కలిపి తిరిగి బాగా ఉడక పెట్టాలి. ఆ మిశ్రమాన్ని ఉండలు చేసి ఫీడ్ ట్రేలో వేసి పెట్టాలి. మామూలుగా ఇచ్చే దాణా తయారీకి కావలసిన ముడి సరుకులు మార్కెట్లో కావాలనుకున్నప్పుడు దొరకవు. ధర కూడా సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. ధర తక్కువ ఉన్నప్పుడు కొని నిల్వ ఉంచుకోవడం కూడా కుదరదు.
దీనికి ప్రత్యామ్నాయం గుళికల దాణా ఇవ్వడం. చేపల పెరుగుదలకు కావలసిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేటులు, కొవ్వులు, విటమిన్లు వంటివన్నీ కలిపి తయారు చేసిన గుళికలు ఇవి. ఈ రకమైన దాణా అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి రవాణా సులభం. ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవచ్చు. నీటిలో కరిగిపోకుండా ఎక్కువ కాలం ఉంటుంది. ఫీడిరగ్‌ను కంట్రోలు చేయవచ్చు. నీటి నాణ్యతను కాపాడుకోవడంతో పాటు చెరువును కాలుష్యం నుండి రక్షించుకోవచ్చు. చెరువులో విద్యుద్దీపాలు అమర్చినప్పుడు దీపపు పురుగులు ఆకర్షింపబడతాయి. ఇలా నీటిలో పడిన పురుగులను బొమ్మె చేపలు ఇష్టంగా తింటాయి.
శీతాకాలంలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు:
శీతాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రతలు చాలా తక్కువ స్థాయికి పడిపోతాయి ఈ సమయంలో రకరకాల బ్యాక్టీరియల్, ప్రోటోజోవన్ మరియు ఫంగల్ వ్యాధులతో పాటుగా ‘‘ఇయుఎస్’’ వ్యాధులు ఎక్కువ సోకుతాయి. తెలంగాణలో ఎక్కువగా ఎర్రమచ్చల వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇది తల భాగంలో మొదలై క్రమేపీ శరీరమంతా వ్యాప్తి చెంది చేపలు చనిపోవడానికి కారణం అవుతుంది. ఎర్ర మచ్చలు వ్యాధితో పాటుగా ఫంగల్ వ్యాధులు కూడా ఎక్కువగా గమనించడం జరిగింది. ఇతర చేపలతో పోల్చినపుడు ఈ చేపలకు రోగనిరోధక శక్తి ఎక్కువ.
సహజ వనరుల నుండి పిల్ల చేపలను సేకరించడం వల్ల వాటికి వ్యాధులను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది, అయితే ఆయా కారణాల వల్ల, ఒత్తిడికి గురైనప్పుడు అవి బలహీనపడతాయి. నివారణ చర్యలుగా, ప్రతి 3-4 నెలలకు ఒకసారి నీటిని మారిస్తే సరిపోతుంది. రోజు వాడే దాణా వల్ల చెరువు అడుగు భాగం కాలుష్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీనికి గాను జియోలైట్ (20 శాతం), అయోడిన్ వంటి మందులు వాడాలి. దాణాతో పాటు యాంటిబయాటిక్ మందులు కలిపి ఇస్తే వ్యాధులను చాలావరకు అదుపు చేయవచ్చు.
చేప పిల్లలను చెరువులో వేసిన 7-8 నెలల్లో కొర్రెమీను చేపలను పట్టుకోవచ్చు. మార్కెట్ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ధర ఎక్కువగా ఉన్నప్పుడు పట్టితే, ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. ఒక హెక్టారు నుండి 3.5-4 టన్నుల ఉత్పత్తిని సాధించవచ్చు.
సి. హెచ్. భాను ప్రకాష్, యం. మోహన్, ఆర్. శ్రీను, యం. కిషన్ కూమార్
కాలేజీ ఆఫ్ ఫిషరీ సైన్స్, పెబ్బేరు, ఫోన్ : 6300487614
Also Read: మంచినీటి చేప జాతుల ఎంపికలో మెళుకువలు
Leave Your Comments