Fruit Drop in Citrus Cultivation: సాత్ గుడి బత్తాయి (చీని)1.13 లక్షలహెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతూ 22.5 లక్షల టన్నుల దిగుబడి,హెక్టారుకు 20 టన్నుల ఉత్పాదకతతో దేశంలోనే మొదటిస్థానంలో ఉంది.ఆంధ్రప్రదేశ్ లో నిమ్మ తోటలు 45 వేల హెక్టార్లలో సాగవుతున్నాయి.బత్తాయి తోటలు అనంతపురం జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగవుతూ రాష్ట్రంలో మొదటి స్థానంలోఉంది. చీని నిమ్మ పరిశోధన స్థానం,డా.వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, తిరుపతి, శాస్త్రవేత్తలు సర్వేలో భాగంగా జిల్లాలో పర్యటించినప్పుడు తోటల్లో సీజను (అంగం) పంటలో పిందె రాలు సమస్యను అధికంగా గమనించారు.ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని పండ్ల తోటల సాగులో బత్తాయి సాగు ఒక రకంగా రైతుకు స్థిరమైన ఆదాయాన్ని ఇవ్వడంలో ముందంజలో ఉంది. ఈ పరిస్థితుల్లో పూత,కాయలు వివిధ దశల్లో రాలిపోవటం రైతుకు నష్టాన్ని కలుగ జేస్తుంది.
సాధారణంగా బత్తాయి తోటల్లో అంగం వంట (సీజను పంట) కు డిసెంబరు- జనవరి మాసాల్లో పూతకు వదలి ఆగస్టు-సెప్టెంబరు మాసాల్లో కాయలు కోతకు వస్తాయి.నిమ్మజాతి పంటల్లో ఒక శాతం మాత్రమే పూత నుంచి కాయలుగా మారుతాయి.ఇవి వివిధ దశల్లో రాలిపోవడం వల్ల రైతు ఆర్థికంగా చాలా నష్టపోవలసి వస్తుంది.పూత,పిందె,కాయలు రాలటం ప్రధానంగా 3 దశల్లో…1. పిందె ఏర్పడిన వారం,పది రోజులకు రాలడం 2.వేసవిలో పిందెలు రాలటం 3.కోతకు ముందు(ఉడప) రాలడం జరుగుతుంది.
1. పిందె ఏర్పడిన పదిరోజుల్లో రాలటం :
ఈ దశ చెట్టు పిండి పదార్థాల నిల్వ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది.ఇది ఒక విధంగా చెట్టుపై పిందెలు అధికంగా లేకుండా చెట్టును రక్షిస్తుంది.దీనివల్ల రైతుకు ఎటువంటి నష్టం ఉండదు.కొన్నిసార్లు పూత,పిందె సమయంలో పాదుల్లో తవ్వడం,అంతర సేద్యం చేసేటప్పుడు లోతుగా తవ్వడం వంటి పనులవల్ల ఎక్కువగా ఉంటుంది.
2. వేసవిలో పిందె రాలటం :
ఇది పూత తర్వాత 2-3 నెలలకు జరుగుతుంది.సాధారణంగా మార్చి- ఏప్రిల్ నెలల్లో గోళికాయ సైజు పిందెలు 10శాతం వరకు రాలుతూ ఉంటాయి.ఇది పిందెల మధ్య పిండి పదార్థాల కోసం పోటీ పడటం వల్ల సాధారణంగా జరుగుతుంది.అంతే కాక నత్రజని, పొటాష్ పోషకాల లోపం వల్ల,నీటి ఎద్దడి,అధిక ఉష్ణోగ్రతలు,నీటి తడులు ఇవ్వడంలో హెచ్చు తగ్గులవల్ల జరుగుతుంది.
3. కోతకు ముందు (ఉడప) రాలటం :
ఇది సాధారణంగా జూన్-జూలై మాసాల్లో మొదలై కాయ కోత వరకు దఫాలుగా జరుగుతుంది. ఒక్కొక్కసారి వర్షాలు అధికంగా వచ్చినప్పుడు అనేక కాయలు రాలిపోతుంటాయి.ఈ దశలో రాలడం రైతును అధికంగా నష్ట పరుస్తుంది. దీని ఉధృతి 20-30 శాతం వరకు కూడా ఉంటుంది.ఇది సాధారణంగా అధిక మోతాదులో నీటి తడులివ్వడం,హార్మోన్ల సమతుల్యత లోపించడం,కాండం కుళ్ళు తెగులు,పండు ఈగ,రసం పీల్చే సీతాకోక చిలకల వల్ల జరుగుతుంది.
నివారణ చర్యలు:
• చెట్టు పూత, పిందె దశల్లో ఉన్నప్పుడు చెట్ల పాదుల్లో అంతర సేద్యం చేయరాదు.
• వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి.తేలిక పాటి నీటి తడులను తక్కువ వ్యవధిలో అనేక సార్లు ఇవ్వాలి.డ్రిప్ ద్వారా నీటిని అందించేటప్పుడు చెట్టుకు వృత్తాకారంలో తేమ ఉండేటట్లు అమర్చాలి.డ్రిప్ లేటరల్ పైపులను చెట్టు వయస్సును బట్టి చెట్టు మొదలుకు 2-3 అడుగుల దూరంలో డ్రిప్ జోన్ లో అమర్చాలి.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోవడానికి పొటాషియం నైట్రేట్ ను (13:0:45) లీటరు నీటికి 10గ్రా.చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.
• 2-4-డి మందును గోళికాయ సైజులో ఒకసారి (1గ్రా. /100 లీ చొప్పున), కోతకు ఒకటిన్నర,రెండు నెలల ముందు మరొకసారి పిచికారి చేయాలి.
• 2-4 డి దొరకని పక్షంలో నాఫ్తలిన్ అసిట్ ఆమ్లం (ప్లానోఫిక్స్) హార్మోను మందును 25 మిలీ 100 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.
• ఇగుర్లు ఎక్కువగా వచ్చినప్పుడు సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని ఒకసారి పిచికారి చేయాలి.
పురుగులు,తెగుళ్ల వల్ల పిందె రాలడం గమనిస్తే తగిన సస్యరక్షణ చర్యలు పాటించి నివారించాలి.
గమనిక: 2-4 డి మందును వీలయినంత వరకు వేరే
ఇతర పురుగు,తెగుళ్ళ మందులతో కలపకుండా పిచికారి
చేయాలి.2,4- డి హార్మోను మందు మనకు లేబరేటరీ గ్రేడులో
100గ్రా. రూ.1100/-లకు లభిస్తుంది లేదా
పురుగుమందుల షాపులో ప్రస్తుతం బాస్టిన్ పేరుతో 4గ్రా
ప్యాకెట్ 230/- నుంచి 250/- రూపాయలకు
లభిస్తుంది. దీనిని వాడేటప్పుడు పొడి మందును స్పిరిట్
లేదా ఆల్కహాల్లో కరిగించి తర్వాత నీటిలో కరిగించాలి
డా. ఎల్.ముకుంద లక్ష్మి, డా.ఆర్.నాగరాజు,
డా.డి.శ్రీనివాస్ రెడ్డి, డా.ఎం.కవిత,
చీని నిమ్మ పరిశోధనా స్థానం,తిరుపతి.ఫోన్:9347115175