Cultivation On Dry Lands: తేలికపాటి నుంచి ఒకమోస్తరు వర్షాలు కురుస్తున్నందున రైతులు ఇప్పటి వరకు పంటలు వేయని చోట్ల, వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు ఇప్పుడు వేసుకోవచ్చు. వర్షాధార ఎర్ర నేలల్లో కంది, జొన్న, కొర్ర, సజ్జ, అలసంద, ఉలవ, ఆముదము,పెసర, అనుముల పంటలు, నల్లరేగడి నేలల్లో కంది, ఆముదము,పత్తి పంటలను ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు.
* కంది, ఆముదం పంటల్లో వత్తుగా ఉన్న మొక్కలను పలుచన చేయాలి.మొక్కకు మొక్కకు మధ్య కంది పంటలో 20 సెం.మీ; ఆముదము పంటలో 60 సెం.మీ దూరం ఉండేటట్లు జాగ్రత్త పడాలి. అంతర సేద్యము ద్వారా కలుపును నివారించుకోవాలి.
* వర్షాధార పంటలో నీటి సంరక్షణ సాళ్ళను (తల్లి చాళ్ళు లేదా గొడ్డుసాళ్ళు) ప్రతి 3.6 మీటర్లకు ఒక సాలు చొప్పున పంట విత్తేటప్పుడు లేదా విత్తిన 20-30 రోజులకు తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ సాళ్ళు వేయడం వలన బెట్ట సమయంలో పంటకు నీటి సంరక్షణకు ఉపయోగపడటమే గాక అధిక వర్షం కురిసినప్పుడు మురుగు నీరు పోయే కాలువలుగా ఉపయోగపడతాయి. వర్షపు నీరు ఈ సాళ్ళలో ఇంకడం వల్ల పైరు త్వరగా బెట్టకు గురికాదు.
వేరుశనగ:
ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు వేరుశెనగలో రసం పీల్చే పురుగులు, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు ఆశించే అవకాశముంటుంది. రసం పీల్చే పురుగుల ఉధృతిని గమనించడానికి పొలంలో జిగురు అట్టలు, ఫెరోమోన్ ట్రాప్స్ అమర్చుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి ఇమిడాక్లోప్రిడ్ 17.8 SL 0.3 మి.లీ./లీటరు లేదా లామ్డసైహలోత్రిన్ 0.6 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు నివారణకు పంట విత్తిన 10-15 రోజులలోపు ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి మగ రెక్కల పురుగులను ఆకర్షించాలి. ఎకరాకి 20 పక్షిస్థావరాలు ఏర్పాటు చేయాలి. 5 శాతం వేప గింజల కషాయంను గుడ్లు, పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. క్వినాల్ ఫాస్ 2.0 మి.లీ. లేక వేపనూనె 5.0 మి.లీ./లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఎదిగిన లార్వాలకు ఏమామెక్టిన్ బెజోయేట్ 0.4 గ్రా. లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మి.లీ./ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.
పత్తి:
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రసం పిల్చు పురుగుల ఉధృతికి అనుకూలంగా ఉన్నాయి. తొలి దశలో ఆశించే రసం పీల్చు పురుగులను అదుపు చేయాటానికి వేప నూనె 5.0 మి.లీ లేదా 5 శాతం వేప గింజల కషాయాన్ని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెల్లదోమ ఉధృతిని గమనించడానికి జిగురు అట్టలు ఏర్పాటు చేయాలి.
రసం పీల్చే పురుగుల ఉధృతిని బట్టి అసిఫెట్ 1.5 గ్రా.లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ లేదా
థయామిథాక్సామ్ 25 WG 0.2 లేదా అసిటామప్రిడ్ 0.2 గ్రా./లీటర్ నీటికి
చొప్పున కలిపి పిచికారి చేయాలి. * మెగ్నీషియం లోపాన్ని సవరించడానికి 10 గ్రా.చొప్పున మెగ్నీషియం సల్ఫేట్ లీటరు నీటికి కలిపి 45 మరియు 75 రోజులలో పిచికారి చేయాలి.
కంది:
కంది విత్తిన 30 మరియు 60 రోజులకు గుంటకతో గాని, గొర్రుతో గాని అంతర కృషి
చేసుకోవాలి. బాగా ఎడంగా విత్తిన కందిలో ట్రాక్టర్ కల్టివేటర్ లేదా మినీ ట్రాక్టర్ రోటావేటారుతో అంతర కృషి చేసి కలుపు నివారించాలి. అలాగే తేమ సంరక్షణ సాళ్ళను తప్పనిసరిగా వేసుకోవాలి.
మొక్కజొన్న:
మొక్కజోన్నలో కత్తెర పురుగు ఆశించే అవకాశం ఉంది. పురుగు ఉనికిని
గుర్తిoచడానికి ఎకరానికి 4 ఫిరమోన్ ఎరలు ఏర్పాటుచేయాలి. ఒక ఫిరమోన్ ఎరలో 10 పురుగులు పడినట్లయితే వెంటనే లీటరు నీటికి 5 మి.లీ.వేపనూనె కలిపి పిచికారి చేయాలి.పురుగు ఉదృతిని బట్టి లీటరు నీటికి 2 గ్రా.థయోడికార్బ్ లేదా 0.4 గ్రా.ఇమామేక్టిన్ బెంజోయేట్ లేదా క్లోరంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఆముదం:
ఆముదము పంటలో వత్తుగా ఉన్న మొక్కలను పలుచన చేయాలి. మొక్కకు మొక్కకు 60 సెం.మీ దూరం ఉండేటట్లు పాటించాలి. అంతర సేద్యము
ద్వారా కలుపును నివారించాలి. అలగే 30 మరియు 60 రోజులకు ఒకసారి 13 కిలోల యూరియా తేమ ఉన్న సమయంలో వేసుకోవాలి. అక్కడక్కడ పొగాకు లద్దె పురుగు కనిపిస్తుంటే.. నివారణకు క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2.0 మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
డా. యo. విజయ్ శంకర్ బాబు
డా. జి. నారాయణ స్వామి
డా. జి.డి. ఉమాదేవి
వ్యవసాయ పరిశోధన స్థానం
అనంతపురం.