Ananthapuram Lady Farmer Success story: ఆమె ఒంటరి మహిళ . ఆమె పేరు మలకపల వన్నూరమ్మ. భర్త గోవిందప్ప. ఆయన ఈ లోకం విడిచి వెళ్లి చాలా కాలమే అయ్యింది. కానీ మొక్కవోని ధైర్యంతో నలుగురు బిడ్డలతో ముందుకు సాగింది. ఎన్నో వ్యయ ప్రయసాలకు ఓర్చుకొని కుటుంబ భారాన్ని మోస్తూ చివరకు ప్రకృతి వ్యవసాయ కారణంగా ఆ మహిళా రైతు భారత దేశ ప్రధానమంత్రి చేత సెల్యూట్ చేయించుకోగలిగింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది ఫోన్ చేసి మరీ అభినందనలు తెలియజేశారు. ఆమెకు ఆ గౌరవం ఎందుకు దక్కింది అదేంటో చూద్దాం.
వెనుకబడిన విద్యార్థి స్థాయి నుంచి ప్రకృతి వ్యవసాయ రైతుగా సాగిన వన్నూరమ్మ ప్రయాణం మహిళా సాధికారతకు దర్పణం. బాల్య వివాహాల బారిన పడిన ఆమె చిన్న వయసులోనే భర్తను కోల్పోవడంతో వచ్చిన కొద్దిపాటి సంపాదనతో నలుగురు పిల్లలను పోషించాల్సి వచ్చింది. పేద మరియు బలహీనమైన కుటుంబంలో జన్మించిన వన్నూరమ్మ భారతదేశంలోని అత్యంత కరువు పీడిత ప్రాంతాలలో ఒకటైన అనంతపురం జిల్లాకు చెందినది. భర్త కోల్పోయిన తొలి రోజుల్లో రోజువారీ కూలీ పనితో జీవనోపాధి పొందింది.
దురద గుంట గ్రామం అనంతపురం జిల్లా లోని కళ్యాణదుర్గం మండలానికి సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన వన్నూరమ్మ భర్త తోడు లేకపోవడంతో కుటుంబ పోషణకై వ్యవసాయం వైపు మళ్ళింది. ఈమెకు గ్రామంలో నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. వర్షాధార పరిస్థితులలో సంప్రదాయ వ్యవసాయాన్ని ప్రయత్నించారు, పదేపదే పంట వైఫల్యం కారణంగా ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. దశాబ్దం పాటు బీడుగా ఉన్న నేలలో 2018 లో ప్రకృతి వ్యవసాయం చేయాలని నిశ్చయించుకుంది. కారణం ఏమంటే అనంతపురం జిల్లాలో అప్పటికే ప్రకృతి వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మా నాయక్ గారి నేతృత్వంలో ప్రకృతి వ్యవసాయం పై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విరివిగా ప్రచారం సాగుతోంది.ఈ విషయం ఆ నోట ఈ నోట విని మన వన్నూరమ్మ చెవిన బడింది. వన్నూరమ్మ మొదటి విడతలో ఒక ఎకరా పొలంలో సాగు చేపట్టింది. అది కూడా పి. ఎం.డి.ఎస్ పద్ధతిలో ఫిబ్రవరి మాసంలో నవధాన్యాలతో పంట వేసింది. అది మొదలుకొని ఇప్పటి వరకు ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తూనే ఉంది. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో భూమిలో 400 కేజీల ఘన జీవామృతం వేసి విత్తవలసిన అన్ని రకాల విత్తనాలను బీజామృతం చేసి విత్తింది. అయితే భూమి లోపల మొక్కలకు పనికి వచ్చే సూక్ష్మజీవులు చనిపోకుండా, సూర్యకిరణాలు సరాసరి భూమిని తాకకుండా తన పొలానికి అందుబాటులో ఉన్న అటవీ చెట్ల ఆకులు, కొమ్మలతో ఆచ్ఛాదన చేసి భూమిని కప్పి ఉంచింది. ఈ కారణంగా 15 రోజులు వర్షం లేటుగా కురిసినప్పటికీ విత్తన మొలక శాతం బాగానే ఉంది. సజ్జా , జొన్న, కొర్ర, అండు కొర్రలు,నువ్వులు, ఆముదం, పెసలు, అనుము మొత్తం ఎనిమిది రకాల పంట వేసింది. అంతే గాక ఏటీఎం మోడల్ లో ఇప్పుడు మరో 8 రకాల పంటలు వేసింది.
ఏటీఎం మోడల్ లో ముల్లంగి,గోరుచిక్కుడు,అలసంద,మొక్కజొన్న,సజ్జ,బీట్రూట్ తో పాటు తోటకూర, మెంతికూర, చుక్కకూర మొదలైన ఆకుకూరలు వేసింది. మరో ఎకరం భూమిలో పోక చెక్క అంటే వక్క చెట్టు మరియు చెలి మొక్కలను కూడా నాటింది. పొలం లో ఒక బోరు బావి వేయించగా ఒకటిన్నర అంగుళాల నీరు పడటం వల్ల శాశ్వత పంటలకు నాంది పలికింది. ఈ శాశ్వత పంట పైన పోక చెక్క చెట్లు 5 సంవత్సరాలకు కాపుకి వస్తే కేజీ ఒక్కింటికి సుమారుగా 10 వేల రూపాయల వరకు ధర పలుకవచ్చు. మొత్తం మీద వన్నూరమ్మ ఆశ నిరాశ కాకుండా ప్రకృతి వ్యవసాయంతో మమేకమై ఈ సంవత్సరం వేసిన పంటకు ఖర్చులు అన్నీ పోయి పీఎండీఎస్ లో వేసిన పంటకు 65 వేల రూపాయల నికర లాభం రాగా ఏటిఎం లో వేసిన ఆకు కూరలు, కాయగూరలు కుటుంబం గడవడానికి సరిపోయింది. ప్రస్తుతం వనూరమ్మ ప్రకృతి వ్యవసాయ కేడర్ (L2) గా పనిచేస్తోంది. వనూరమ్మ ముగ్గురు కుమారులలో ఒకరు బీటెక్, మరొకరు పదవ తరగతి, ఇంకొకరు డిప్లమాలు చదవగా కూతురికి వివాహం చేసి అత్తరింటికి పంపించింది. భర్త తోడు లేకపోయినా ప్రకృతి వ్యవసాయంలో కొనసాగుతూ సంతోషంగా సగర్వంగా జీవితం కొనసాగిస్తున్న వన్నూరమ్మ తన సొంత అభివృద్ధితో ఆగిపోకుండా తన చుట్టూ ఉన్న రైతులతో పాటు మొత్తం గ్రామాన్ని రసాయన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలనే సత్సంకల్పంతో దృఢ చిత్తంతో ముందుకు సాగుతోంది.ఇప్పటివరకు 200 మంది రైతులకు పైగా ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించింది. 2020 వ సంవత్సరంలో ఏడాది పొడవునా నాలుగు సీజన్ లలో పలు రకాల పంటలు పండించి 1 లక్షా 8 వేల రూపాయల నికర ఆదాయం పొందిన వన్నూరమ్మప్రకృతి వ్యవసాయ ప్రయాణం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నిరాఘాటంగా కొనసాగుతోంది. పెట్టుబడిపై 5 రెట్ల నికర ఆదాయాన్ని పొందుతోంది. ప్రకృతి వ్యవసాయంతో పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్న వన్నూరమ్మ సేవలకు మెచ్చి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారు 2021 వ సంవత్సరంలో పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేసిన సంధర్భంగా రైతులతో వీడియో కాల్ ద్వారా రైతులతో ముచ్చటిస్తూ వన్నూరమ్మ సేవలను అభినందించి సెల్యూట్ చేశారు. అప్పటి నుంచి వన్నూరమ్మ జాతీయ స్థాయి దృష్టిని ఆకర్శించింది. అందరూ బాగుండాలనే వన్నూరమ్మ ఆశయానికి మనమందరం సెల్యూట్ చయాల్సిందే.