Agriculture Drones: మారుతోన్న కాలానికి అనుగుణంగా శాస్త్రసాంకేతిక రంగం ముందడుగేస్తుంది. ఆధునిక సాంకేతికతో రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణమైన నిత్యం పరిశోధనలతో సరికొత్త ఆవిష్కరణలకు ఆద్యం పోస్తుంది. దీంతో నూతన యంత్రాలు పరిచయమవుతున్నాయి. ఈ యంత్రాల వినియోగం ద్వారా మానవ శ్రమ తుగ్గుతుంది. ప్రస్తుతం అత్యంత ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని నూతన వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత రోజుల్లో వ్యవసాయంలో డ్రోన్ల అవసరం మరింత పెరిగిన నేపథ్యంలో పలు కంపెనీలు డ్రోన్లను తయారు చేస్తున్న పరిస్థితి. అయితే డ్రోన్లను రైతులు ఎలా వాడాలో తెలియని పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ సమయంలో ముందుకొచ్చింది నోవా అగ్రిటెక్ కంపెనీ.
పంట సాగులో డ్రోన్లను ఎలా వాడుకోవాలో రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది నోవా అగ్రిటెక్. పంట సాగులో డ్రోన్ల వినియోగాన్ని రైతులకు అర్థమయ్యేలా శిక్షణ కార్యక్రమాలు చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖకు తెలిపింది సదరు కంపెనీ. దేశంలో తొలిసారి పంటలపై డ్రోన్ల వినియోగానికి సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ నుంచి తమ సంస్థ అనుమతి పొందినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ తెలిపారు.
ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయంలో మార్పులు మొదలయ్యాయి. సాగులో వ్యవసాయ యంత్రాల వాడకం బాగా పెరిగింది. వాటితో పాటు సాంకేతిక పరిజ్ఞానం వాడకం తప్పనిసరిగా మారింది. కూలీల కొరత రైతులకు ప్రధాన సమస్యగా మారిన తరుణంలో దాన్ని అధిగమించేందుకు ఉన్నఅవకాశాలపై అందరూ దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో దూసుకు వచ్చిందే డ్రోన్ల వినియోగం. మొదట్లో రక్షణ రంగంలో ఉన్న డ్రోన్ల వినియోగం ఆ తర్వాత ఇతర రంగాలకు విస్తరించింది. వ్యవసాయంలో డ్రోన్‌ల వాడకంలో జపాన్, చైనా, ముందుండగా ఇటీవల కాలంలో ఇతర దేశాల్లోనూ ఈ సాంకేతిక మాంత్రిక యంత్రాలను విరివిగా వాడడం మొదలు పెట్టారు.