పశుపోషణ

Lumpy Skin Disease in Cattle: లంపీ స్కిన్‌ వ్యాధి లేదా ముద్ద చర్మ వ్యాధి.!

2
Lumpy Skin Disease
Lumpy Skin Disease

Lumpy Skin Disease in Cattle: చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికముగా జీవనోపాధి కల్పించడంలో పశువులు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ పశువులు అంటువ్యాధుల బారిన పడటం వలన ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది మరియు ముఖ్యముగా రోగనిరోధక శక్తి లేని పశువులు చనిపోవటం జరుగుతుంది. దీని వలన రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతుంది. ఇటీవల కాలంలో లంపీ స్కిన్‌ వ్యాధి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలోని పశువులకు సోకటం వలన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కావున రైతులకు ఈ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండాలి.

లంపీ స్కిన్‌ వ్యాధిని మొట్టమొదటిసారిగా 1929 సంవత్సరంలో ఆఫ్రికా ఖండంలోని జాంబియా దేశంలో గుర్తించారు. ఆ తరువాత ఈ వ్యాధి ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలలో వ్యాపించింది. వ్యాధిని గుర్తించిన మొదట్లో ఈ వ్యాధి పశువులు ఏదైనా విష పదార్థం తినుట వలన కాని లేదా కీటకాలు కుట్టినప్పుడు వచ్చే హైపర్సెన్సిటివిటీ రియాక్షన్‌ అని అనుకున్నారు. కానీ ఆ తరువాత ఈ వ్యాధి వైరస్‌ వలన కలుగుతుందని గుర్తించారు. ఈ వ్యాధి మధ్య తూర్పు దేశాలు, యూరప్‌, పశ్చిమాసియా దేశాలలో వ్యాప్తి చెందింది.

భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ వ్యాధిని ఒరిస్సా రాష్ట్రంలోని మయూర్బంజ్‌, భద్రక్‌ జిల్లాలో 2019లో గుర్తించారు. ఈ వ్యాధి ప్యాక్స్‌ విరిడే కుటుంబానికి చెందిన కాప్రీప్యాక్స్‌ వైరస్‌ వలన కలుగుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా ఆవులు, గేదెలకు సోకుతుంది. సంకరజాతి ఆవులలో, దూడలలో ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా కనపడతాయి. వ్యాధి సోకిన మందలో వ్యాధి బారినపడే పశువులు (మార్బీడిటీ) 10-20% కాగా, వ్యాధి వలన చనిపోయే పశువులు (మోర్టాలిటీ) 1-5% వరకు ఉంటాయి. ఈ వ్యాధి పశువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందదు.

ఈ వ్యాధి ఎలా వస్తుంది?
ఈ వ్యాధి పశువులకి లంపీ స్కిన్‌ డిసీజ్‌ వైరస్‌ అనే సూక్ష్మాతి సూక్ష్మజీవుల (వైరస్‌) ద్వారా వస్తుంది. చర్మం కింద కణితులు/బుడిపెలు ఏర్పడటం ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం.

Also Read: Sheep and Goat Disease: వర్షాకాలంలో గొర్రెలు, మేకలు సాధారణంగా వచ్చే పొట్ట జలగ వ్యాధి నివారణ చర్యలు.!

Lumpy Skin Disease in Cattle

Lumpy Skin Disease in Cattle

ఎలా వ్యాపిస్తుంది?
లంపీ స్కిన్‌ వ్యాధి, వ్యాధి సోకిన పశువుల నుండి కీటకాల ద్వారా కానీ, స్రావాల ద్వారా కానీ, వ్యాధి క్రిములతో కలుషితమైన గాలి ద్వారా కానీ ఆరోగ్యవంతమైన పశువులకు సోకుతుంది. ముఖ్యముగా కీటకాలైన క్యూలెక్స్‌, ఎడిస్‌ దోమలు, స్టోమాక్సిస్‌ బయోమీయ ఈగలు, పిడుదుల ద్వారా వ్యాధిగ్రస్త పశువు నుండి ఆరోగ్యవంతమైన పశువుకు వ్యాప్తి చెందుతుంది.

వ్యాధి సోకిన పశువు యొక్క నోరు, నాసికాకుహరం, కంటి నుండి కారే స్రావాలలో వైరస్‌ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ స్రావాలు పశువుల మేత మరియు నీటి తొట్టెలను వైరసుతో కలుషితం చేస్తాయి. ఈ వ్యాధి సోకిన ఆబోతు వీర్యంలో కూడా వైరస్‌ విసర్జించబడుతుంది. కావున ఈ వ్యాధి సహజ సంపర్కం, కృత్రిమ గర్భధారణ ద్వారా కూడా ఆడ పశువులకు వచ్చే అవకాశం ఉంది. పాలు త్రాగే దూడలకు తల్లి పాల ద్వారా లేదా పొదుగు పై ఉన్న చర్మం పొక్కుల ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది.

వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?
ఈ వైరస్‌ పశువు శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనిపించటానికి 5 రోజుల నుండి 10 రోజులు పడుతుంది. ఈ వ్యాధి సోకినపుడు 104-105 డిగ్రీల ఫారెన్హీట్‌ వరకు జ్వరం, కళ్ళ నుండి, ముక్కు నుండి నీరు కారడం, నోటి నుండి చొంగ కారటం ఈ వ్యాధి మొదటి లక్షణం. తరువాత చర్మం కింద, నోటి చిగురు, ముట్టె మీద, ముక్కుదూలం మీద, కణితులు/బుడిపెలు ఏర్పడతాయి. దీనితో పాటు మెడ మరియు తొడల దగ్గర లింఫ్‌ గ్రంధులు వాచి, పొదుగు, రొమ్ము భాగం, కాలి కీళ్లలో నీరు చేరుతుంది.

వ్యాధి సోకిన పశువులకు అధిక జ్వరం ఉండి పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడం, చర్మం పైన 2 నుండి 5 సెం. మీ . సైజు గల నాడ్యూల్స్‌ ఏర్పడి పశువులు మేత మేయవు. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు చర్మం పైన బుడిపెలు తక్కువ సంఖ్యలో ఉండి, వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు కణితులు/ బుడిపెలు పశువు శరీరం అంతటా వ్యాపించి, సాధారణంగా బుడిపెలు పశువు తల, మెడ, బాహ్య జననేంద్రియాల పైన, పొదుగు మీద ఉండి పశువులకు తీవ్ర నొప్పిని కలుగజేస్తాయి.

కొన్ని సందర్భాలలో ఈ బుడిపెలు చర్మంలోని అన్ని పొరలతోపాటు చర్మం క్రింద ఉన్న కణజాలంలోకి కూడా విస్తరిస్తాయి. నోరు, ముక్కు పొరలలో ఎరుపు చీము పొక్కులు ఏర్పడి వాటి నుండి పచ్చని స్రావాలు కారుతూ ఉంటాయి. చర్మంపై ఉన్న బుడిపెలు పుండ్లుగా మారి తరువాత వాటి పైన పొక్కులు ఏర్పడతాయి. కొన్ని పశువులలో కళ్ళలోని కార్నియా భాగంలో పుండ్లు ఏర్పడి కంటి చూపు మందగించడం జరుగుతుంది. పశువుల యొక్క కాళ్ళపైన కూడా బుడిపెలు ఏర్పడి, కీళ్ళ భాగంలో వాపు ఉండటం వలన పశువులు మెల్లగా నడుస్తాయి. తరువాత వ్యాధి నిరోధక శక్తి తగ్గి పుండ్లకు సెకండరీ బాక్టీరియా శరీరంలో వృద్ధి చెందడము ప్రారంభమవుతుంది.

చికిత్స ఎలా చేయాలి?
వ్యాధి వచ్చిన తర్వాత ఈ జబ్బుకు ప్రత్యేకమైన మందులు లేవు. ఈ జబ్బు వలన పెద్దగా ప్రాణహాని లేనప్పటికీ కణితులు/బుడి పెలకు సూక్ష్మజీవులు (బాక్టీరియా) సోకటం వలన మరింత క్లిష్టంగా మారి ఎక్కువ నష్టం జరుగుతుంది. బాక్టీరియా ఈ కణితులు లేదా బుడిపెలలోకి చేరటం వలన పుండ్లుగా మారి, చీము పట్టి సమస్య జటిలంగా మారుతుంది. ఈ వైరస్‌ వలన వచ్చే వ్యాధులకు ప్రధమ చికిత్సగా ఆయుర్వేదిక్‌ మరియు హోమియో మందులు వాడితే జబ్బు తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది.

ఆయుర్వేదిక్‌ పరముగా ఏమి ఇవ్వాలి?
బెల్లము ం పసుపుం ఆలోవీర గుజ్జుం తులసి అందాసుగా కలిపి 5 రోజులు ఉదయం సాయంత్రం తినిపించాలి. పసుపుంతులసింఆలోవీర గుజ్జుం వేపనూనె కలిపి ఉదయం సాయంత్రం రాస్తే కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నవి. నేషనల్‌ డైరీ డెవలప్‌ మెంట్‌ బోర్డ్‌ వారు మనకు కొన్ని రకాల మిశ్రమాలను అందించారు. వాటిలో ఏదయినా వాడుకోవచ్చును.

మొదటి మిశ్రమం:
(ఒక డోసుకు ) తమలపాకులు 10, మిరియాలు 10 గ్రాములు, ఉప్పు 10 గ్రాములు, పైన పేర్కొన్న పదార్థములు అన్ని కలిపి పేస్టుగా చేసి బెల్లంతో కలిపి ఒక డోసుగా తినిపించాలి, మొదటి రోజు ప్రతి మూడు గంటలకు ఒక డోసు తినిపించాలి. రెండవ రోజు నుండి రోజుకు మూడు సార్లు చొప్పున రెండు వారాలు తినిపించాలి.

రెండవ మిశ్రమం:
(రెండు డోసులకు ) రెండు రెబ్బలు వెల్లుల్లి, ధనియాలు – 10 గ్రాములు, జీలకర్ర – 10 గ్రాములు, మిరియాలు – 10 గ్రాములు, పసుపు – 10 గ్రాములు, చిరాట ఆకుల పొడి – 30 గ్రాములు, బిరియాని ఆకులు – 10 గ్రాములు, చిన్న ఉల్లిపాయలు రెండు, తులసి ఆకులు – ఒక గుప్పెడు, సజ్జ ఆకులు చారెడు, వేప ఆకులు చారెడు, బెల్లం – 100 గ్రాములు, పైన పేర్కొన్న పదార్ధములు అన్ని పేస్టుగా చేసి చిన్న చిన్న మోతాదులలో అనిపించాలి. మొదటి రోజు ప్రతి మూడు గంటలకు ఒక డోసు తినిపించాలి. రెండవ రోజు నుండి రోజుకు మూడు సార్లు చొప్పున రెండు వారాలు తినిపించాలి. ప్రతిరోజు తాజాగా తయారు చేసుకోవాలి.

ఇది చర్మం మీద పూత మందు : మూర్కౌండ ఆకులు చారెడు, వెల్లుల్లి -10 రెబ్బలు, వేపాకులు చారెడు, కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె – 500 గ్రాములు, పసుపు – 20 గ్రాములు, గోరింటాకు ఆకులు చారెడు, తులసి ఆకులు చారెడు. పై అన్నిటిని మెత్తగా నూరి ఆయిల్‌లో కలిపి మరిగించి, చల్లార్చిన తరువాత పుండ్ల మీద పూత మందుగా రాయాలి. పురుగులు పడిన పండ్లకు మొదటి రోజు సీతాఫలపు ఆకుల పేస్టు గాని లేదా కర్పూరం తో కలిపిన కొబ్బరి నూనె గాని రాయాలి.

ఆల్లోపతి పరముగా చికిత్స:
. యాంటీ బయోటిక్స్‌ బెంజాంతిన్‌ పెనిసిల్లిన్‌ ఉదయం పూట మరియు సాయంత్రం సల్ఫా ం ట్రై మేథోప్రిమ్‌ కలిగిన బోలస్‌లను 5 రోజులు ఇవ్వాలి.
. జ్వరము రాకుండా మెలోనేక్స్‌ పారసిటమోల్‌ మందులు ఉదయం మరియు సాయంత్రం 5 రోజులు ఇవ్వాలి.
. చర్మము పైన పుండ్లు మానడానికి ఏవయిన ఆయింట్‌ మెంట్లు వాడాలి. మరియు ఈగలు వాలకుండా టాపిక్యుర / మాగరీడ్‌ వంటి స్ప్రే వాడాలి.
. వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఇమ్మ్యునల్‌ టానిక్‌/ ఇంజక్సన్‌ లేవమిసోల్‌ ఇవ్వాలి
. విటమిన్‌ సి కలిగిన అప్థోకేర్‌ పౌడర్ను 20 గ్రా చొప్పున 3 రోజులు ఇవ్వాలి
. మంచి బలం ఇచ్చే విధముగా సైలైన్లు మరియు విటమిన్లు కలిగిన టానిక్లను జబ్బు తగ్గేవరకు ఇవ్వాలి

టీకాలు ఏమైనా ఉన్నాయా?
ఈ వ్యాధికి టీకా మందులు మన దేశంలో మొదటి సారిగా ఐసిఏఆర్‌ ఉత్తర ప్రదేశ్‌ సంస్థ తయారు చేసింది.. ఈ వైరస్‌ గొర్రెల మరియు మేకల బొబ్బ వైరసుల జాతికి చెందినది అందువలన దీనికి ప్రత్యామ్నాయంగా కొంతమంది గొర్రెలు, మేకల మశూచి టీకాలు వెయ్యవచ్చు. ఒకసారి వైరస్‌ పశువు శరీరంలోనికి ప్రవేశించాక వాటి ప్రభావం ఉన్నంత వరకు వ్యాధి లక్షణాలు కనిపించి తర్వాత తగ్గిపోతాయి. కాబట్టి రైతులందరూ పశువుల చావిడిని శుభ్రంగా ఉంచి క్రిమి, కీటకాలు, దోమలు, ఈగలు రాకుండా చూడటం, పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ, పుండ్లు పడకుండా మందులు వాడుతూ ఉంటే ఈ వ్యాధులు నుండి పశువులు త్వరగా కోలుకుంటాయి. పాల ఉత్పత్తి కూడా త్వరగా సాధారణ స్థితికి చేరుతుంది. ఈ వైరస్‌ ఇతర పశువులకు అంటుకోకుండా చనిపోవాలంటే 2% ఫినాల్‌ లేదా 1% ఫార్మాలిన్‌ లేదా 1% క్లోరోఫామ్‌ లేదా అయోడిన్‌ సొల్యూషన్‌లతో పశువుల శాలను కడగాలి.

Also Read: Ranikhet Disease Prevention Methods: కోళ్లలో సంక్రమించు కొక్కెర తెగులు దాని నివారణ పద్ధతులు.!

Leave Your Comments

Modern Agriculture Drones: ఆధునిక వ్యవసాయంలో డ్రోన్ల ప్రాముఖ్యత.!

Previous article

Thangedu Health Benefits: బతుకమ్మ పువ్వు తంగేడుతో బోలెడన్ని లాభాలు మీ సొంతం.!

Next article

You may also like