Actinomycosis Disease in Cows: ఈ వ్యాధి ఆక్టినోమైసిస్ బోవిస్ అను శిలీంధ్రము లాంటి బ్యాక్టీరియా ద్వారా ఆవులు, పందులు, గుర్రాలు మరియు మనుషులలో కలుగు ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిలో తల మరియు దవడ ఎముకలలో గడ్డలు తయారై, ఎముకలు బలహీనమై, వాచి ఉంటాయి.
Also Read: Castration in Bulls: దున్న మరియు ఎద్దులలో విత్తులు నొక్కు పద్ధతులు.!
వ్యాధి కారకము:- ఇది ఆక్టినోమైసిస్ బోవిస్ అను శిలీంధ్రము లాంటి బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఇది ఒక హైయర్ జెనరేషన్ బ్యాక్టీరియా. ఇది కర్ర ఆకారంలో వుండవచ్చు లేదా ఫిలమెంట్స్ వుండవచ్చు. దీనిని గ్రామ్ పాజిటివ్ స్టెయిన్ ద్వారా చూడవచ్చు. ఈ బ్యాక్టీరియాతో పాటు కొరిని బ్యాక్టీ రియం పయోజిన్స్, స్టెఫైలోకోకస్ రకాలు కూడా ఈ వ్యాధి ప్రబలుటకు మూల కారణాలుగా ఉంటాయి.
వ్యాధి బారిన పడు పశువులు:- ఈ వ్యాధి ప్రధానంగా అపుడప్పుడు 4 సంవత్సరముల పై బడిన ఆవులు, గేదెలలో కలుగుతుంది. కొన్ని సందర్భాలలో పందులు, గుర్రాలు మరియు మనుషులలో కూడా ఈ వ్యాధి ప్రబలుతుంటుంది.
వ్యాధి వచ్చు మార్గం మరియు వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- ఈ బ్యాక్టీరియాలు సహజంగా నోటికుహరంలో వుండి, నోటిలో ఏదైనా గాయాలు (కొత్త దంతాలు వస్తున్నపుడు, కొన్ని రకముల గడ్డి వరకలు వేస్తున్నప్పుడు) అయినపుడు, నోటి నుండి తల, దవడ ఎముకలలోకి ఈ క్రిములు చేరి, వాటిలో పెరిగి, ఆ కణజాలంను నాశనం చేసి, తద్వారా ఊపిరితిత్తులలోకి, మరియు జీర్ణాశయంలోకి చేరి ఆ కణజాలాలను కూడా నాశనం చేస్తాయి. ఫలితంగా ఈ క్రింది ఇబ్బందులుంటాయి.
వ్యాధి లక్షణాలు:-
(1) డయేరియా వుంటుంది.
(2) ఆహారం తీసుకోవడం కష్టంగా వుంటుంది.
(3) నోటిలో పళ్ళు వదులై పోయి వుండును.
(4) నోటి నుండి దుర్వాసన వస్తూ వుంటుంది.
(5) నోటి నుండి ఎక్కువ లాలాజలం కారుతూ వుంటుంది.
(6) క్రింద దవడ వాచిపోయి, చీము గడ్డలను కలిగి వాటి నుండి చీము ద్రవములు కారుతుంటాయి.
వ్యాధి కారక చిహ్నములు:- తల మరియు దవడ ఎముకలలో గడ్డలు తయారై, బలహీనమై ఉంటుంది. ఆహారవాహిక మరియు తల కండరాలలో కూడా చీము పట్టిన గడ్డలను చూడవచ్చు.
వ్యాధి నిర్ధారణ:-
(1) వ్యాధి చరిత్ర ఆధారంగా
(2) పైన వివరించిన లక్షణముల ఆధారంగా
(3) పైన వివరించిన వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా
(4) ప్రయోగశాల పరీక్షల ఆధారంగా చీము గడ్డల నుండి చీమును తీసి అందులోని సల్ఫర్ గ్రామ్యాల్స్ మరియు అందలి కారకాన్ని సూక్ష్మదర్శిని ద్వారా గమనించి ఈ వ్యాధిని నిర్ధారించవచ్చును.
డిఫరెన్సియల్ డయాగ్నోసిస్:- నొకార్డియా, ఆక్టినోబాసిల్లోసిస్, బొట్రియోమైకోసిస్ వంటి వ్యాధులతో పోల్చి సరిచూసుకోవలెను.
చికిత్స:-
వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు చేయు చికిత్స:- గాయాలను నీళ్లతో శుభ్రం చేసి, పొటాషియం అయోడైడ్, సోడియం అయోడైడ్, స్ట్రెప్టో పెన్సిలిన్స్ మరియు ఐసోనియాజిడ్ వంటి అంటిబయోటిక్ ఔషధములను ఇవ్వవలసి యుంటుంది.
వ్యాధి లక్షణములకు చేయు చికిత్స:- డయేరియాను తగ్గించడానికి అంటి డయేరియల్స్ ఔషధములను, నీరు, ఎలెక్ట్రోలైట్స్ను సమతుల్యం చేయుటకు సెలైన్ ద్రావణములను ఇవ్వవలసి ఉంటుంది.
ఆధారము కల్పించు చికిత్స:- పశువు యొక్క స్థితిని బట్టి పశువులకు సెలైన్స్, విటమిన్స్, మినరల్ మిక్చర్స్ వంటివి నోటి ద్వారా కాని లేదా ఇంజక్షన్ రూపంలో కాని ఇవ్వవలసి యుంటుంది. వ్యాధి బారిన పడిన పశువులకు తగినంత విశ్రాంతిని ఇవ్వాలి.
నివారణ:- వ్యాధి గమనించిన పశువులను వెంటనే మంద నుండి వేరు చేసి చికిత్స చేయటం, అట్టి పశువు యెుక్క చీము ద్రవాలతో కలుషితమైన మేత, నీరు వేరే పశువులకు ఇవ్వకుండా ఉండటం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు.
Also Read: Bacillary Haemoglobinurea in Cows: పశువులలో వచ్చే భాసిల్లరీ హిమోగ్లోబిన్యూరియా వ్యాధి లక్షణాలు.!