Avakado Farmers: మార్కెట్లో ఖరీదైన పండ్లలో అవకాడో ఒకటి. ఎక్కడో బ్రెజిల్, సెంట్రల్ అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పండు ఇప్పుడు భారత్‌లోనూ పండుతోంది. ఈ పండుకు కిలోకు రూ.300 పలుకుతుంది సూపర్ మార్కెట్లలో. ఈ పండులో పోషకాలకు కొదువ లేదనే చెప్పాలి. ఈ పండులోపలి భాగం వెన్నను పోలీ ఉంటుంది. అందుకే దీన్ని కొందరు వెన్నపండు అని కూడా అంటారు. లేదా బట్టర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ పండుని తినడం వలన చెడు కొవ్వును తగ్గించడమే కాకుండా ఊబకాయంతో బాధపడుతున్న వారికి ఇది దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఈ పండు సాధారణంగా ఆకుపచ్చ మరియు నల్ల రంగులో ఉంటుంది. మార్కెట్ పరంగా దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది.
కెన్యా రైతులకు అవకాడో సాగు అద్భుతమైన లాభాలను తెచ్చి పెడుతుంది. అయితే ఈ పండుకు అక్కడ ఎంత డిమాండ్ ఉందో తెలియాలంటే జరిగిన ఒక కథ గురించి చర్చించుకోవాలి. అవకాడో సాగు చేసేవారిని ఆక్కడ క్రిమినల్ గ్యాంగులు లక్ష్యంగా చేసుకుని రైతుల్ని వెంటాడుతున్నారు. దాదాపు ఒక చెట్టు నుంచి రూ.44,550 (600 డాలర్లు) వరకు లాభం వస్తుంది. అమెరికా, ఐరోపాలలో ఈ పండ్లకు డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో ఆఫ్రికా నుంచి వీటిని అత్యధికంగా ఎగుమతి చేసే దక్షిణాఫ్రికా స్థానాన్ని గత ఏడాది కెన్యా భర్తీ చేసింది.
పచ్చ బంగారంగా పిలుస్తున్న ఈ పంటను రక్షించుకునేందుకు రైతులు అవకాడో రక్షణ బృందాలు ఏర్పరుచుకున్నారు. అవకాడోలు కెన్యా లో ఫిబ్రవరి నుంచి అక్టోబర్ మధ్య లో కోతకు వస్తాయి. ఇదే సమయంలో దొంగతనాలు కూడా పెరుగుతుంటాయి. ఈ క్రమంలో ఆ పంటను కాపాడుకునేందుకు రైతులు సెక్యూరిటీని పెట్టుకుంటారు. అయితే కాస్త ధనవంతులైన రైతులు ఆధునిక టెక్నాలజీ సాయంతో తోటలను కాపాడుకుంటున్నారు.
గత ఏడాది కెన్యా రైతులు 980 కోట్ల రూపాయల విలువైన అవకాడో పండ్లను విదేశాలకు ఎగుమతి చేశారు. కాగా ప్రస్తుతం తేయాకు పండిస్తున్న రైతులు అవకాడో పంటను సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు.