US Congressman Andy Levin దేశానికి అన్నం పెట్టేది రైతు, కానీ ఆ రైతు కన్నెర్ర చేస్తే జరిగే పరిణామాలేంటో నిన్న తేటతెల్లం అయ్యాయి. ఏడాది కాలంగా వ్యవసాయ చట్టాల రద్దుకై అలుపెరగని పోరాటంలో రైతులు విజయం సాధించారు. కేంద్రం ప్రవేశపెట్టిన చట్టాలు కేవలం బడావ్యాపారులకు అనుకూలంగా ఉన్నాయంటూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం మొదలు పెట్టారు. దాదాపుగా 40 రైతు సంఘాలతో మొదలైన ఈ ఉద్యమంలో లక్షలాది మంది రైతులు పాల్గొన్నారు. ఏడాది కాలంపాటు జరిగిన ఈ ఉద్యమ సమయంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. కానీ కేంద్రంతో చర్చలు విఫలమవుతూ వచ్చాయి. అయితే ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నిన్న నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోడీ మూడు వ్యవసాయ సాగు చట్టాలపై కీలక ప్రకటన చేశారు. జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మూడు మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చారిత్రాత్మక ప్రకటన చేశారు. దీంతో దేశవ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని ప్రకటనపై వారు సానుకూలంగా స్పందించారు. కాగా… నోటిమాటతో కుదరదని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుని రద్దు చేశాకే పోరాటం విరమిస్తామంటూ రైతు సంఘాలు స్పష్టం చేశాయి.
కేంద్ర తీసుకున్న నిర్ణయంపై వామపక్షాలు స్పదింస్తున్నాయి. అయితే తాజాగా భారతదేశంలోని మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు ఆండీ లెవిన్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో ఒక సంవత్సరానికి పైగా నిరసనల తర్వాత భారత్‌లో ఇలా మూడు వ్యవసాయ బిల్లులు రద్దవ్వడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని ఆండీ లెవిన్ అన్నారు. అంతేకాదు కార్మికులు కలిసికట్టుగా ఉంటే కార్పొరేట్ ప్రయోజనాలను ఓడించగలరని చెప్పడానికి ఇదోక నిదర్శనం అని పైగా వారు యావత్ భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా పురోగతిని సాధించగలరు అంటూ ఆండీ లెవిన్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన మూడు నల్ల చట్టాలను రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
Also Read : పంటనష్టం పై సీఎం జగన్ ఏరియల్ సర్వే…